ధర్మవరం: రాజకీయ ఉనికి కోసం మాజీ ఎమ్మెల్యే వరదపురం సూరి ధర్మవరం పట్టణంలో గురువారం హైడ్రామాకు తెరలేపారు. రహదారి అభివృద్ధి పనులకు అడ్డుపడుతూ అనుచరులను రెచ్చగొడుతూ నానా యాగి చేశారు. గత ఎన్నికల్లో వరదాపురం సూరి ధర్మవరం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత టీడీపీని వీడి బీజేపీలో చేరారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ధర్మవరం టీడీపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాదరణలో అత్యంత బలవంతుడైన కేతిరెడ్డిని ఢీకొట్టే సత్తా తనకు మాత్రమే ఉందని కలరింగ్ ఇచ్చేందుకు ఫీట్లు చేస్తున్నారు.
టెండర్‌లు పూర్తయిన విషయం తెలుసుకుని డ్రామా
2019లో అప్పటి ఎమ్మెల్యే సూరి రూ.28 కోట్లతో ధర్మవరం పట్టణంలో రోడ్డు వేశారు. రోడ్డు పనులు అత్యంత నాసిరకంగా చేయడంతో పదినెలలు గడవకముందే శిథిలావస్థకు చేరింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించి రూ.4 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రహదారిని నిరి్మంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతేడాది డిసెంబర్ 5న జీఓ విడుదల చేశారు.
ఈ క్రమంలో అధికారులు జనవరి 18న టెండర్ ప్రక్రియ సైతం పూర్తిచేశారు. గురువారం రోడ్డు పనులు ఎమ్మెల్యే కేతిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతున్నాయి. కానీ వరదాపురం సూరి రాజకీయ లబ్ధి కోసం హంగామా చేశారు. తన సొంత నిధులతో రోడ్డు వేస్తానని అనుమతి ఇవ్వాలని ఆర్‌అండ్‌బీ అధికారులను కోరగా, ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. అయినప్పటికీ పలుమార్లు అధికారులను కలుస్తూ విస్తృతంగా ప్రచారం చేశారు.
ఈ క్రమంలోనే గురువారం రోడ్డు పనులు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి సిద్ధమవుతున్న తరుణంలో వరదాపురం సూరి హైడ్రామాకు తెరలేపారు. ఉదయాన్నే మార్కెట్‌యార్డుకు రెండు టిప్పర్లు తీసుకువచ్చి పనులు చేస్తామంటూ అనుచర గణంతో బైఠాయించారు. డీఎస్పీ టీ. శ్రీనివాసులు, పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం తదితరులు సూరి వద్దకు వెళ్లి రోడ్డు పనులకు ఆటంకం కల్గించవద్దని ఎంత సర్ది చెప్పినా వినకుండా పోలీసులపైకి దౌర్జన్యం చేశారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ పట్టణంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు.
కేసు నమోదు
అభివృద్ధి పనులకు ఆటంకం కల్గిస్తూ రహదారిపై ధర్నా, పోలీసులపై దౌర్జన్యం తదితర కారణాలతో వరదాపురం సూరితో పాటు అనుచరులు 29 మందిని పోలీసులు అరెస్ట్ చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఐపీసీ 143, 145, 188, 341, రెడ్‌విత్ 149 కింద కేసులు పెట్టారు. సూరికి చెందిన రెండు వాహనాలను సీజ్ చేసినట్లు డీఎస్పీ టీ. శ్రీనివాసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment