వెలిగొండ ప్రాజెక్ట్ రెండవ టన్నెల్ పనుల్లో భాగంగా టిబీఎంకు మరమ్మతులు చేసిన రాబిన్స్ సంస్థ
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ (సొరంగం)లో మిగిలిన పనులను రికార్డు సమయంలో పూర్తి చేసిన ప్రభుత్వం, రెండో టన్నెల్ పనులను శరవేగంగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. రెండో టన్నెల్ తవ్వకం పనులకు గాను అమెరికా సంస్థ రాబిన్స్ నుంచి డబుల్ షీల్డ్ టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)ను 2007లో దిగుమతి చేసుకున్నారు. అయితే ఈ టీబీఎంలో, కన్వేయర్ బెల్ట్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. వాటిని సరిచేసేందుకు గత ప్రభుత్వం రాబిన్స్‌తో సంప్రదింపులు జరిపింది కానీ మరమ్మతులకు సంస్థను ఒప్పించలేకపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాబిన్స్‌తో చర్చించడంతో పాటు సంస్థ ప్రతినిధులను రప్పించడం ద్వారా టీబీఎం, కన్వేయర్ బెల్ట్‌లకు మరమ్మతులు చేయించింది. టీబీఎంతోపాటు, కార్మికులతోనూ తవ్వించడం ద్వారా నెలకు వెయ్యి మీటర్ల చొప్పున పనులు చేయించి, ఏడు నెలల్లో మిగిలిన 7,383 మీటర్ల టన్నెల్ తవ్వకం పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 830 అడుగులకు తగ్గిన వెంటనే ఈ టన్నెల్‌కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను ప్రారంభించి, జూన్‌లోగా పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది.
వైఎస్ హయాంలోనే సింహభాగం పనులు పూర్తి
శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోగానే రోజుకు 11,582 క్యూసెక్కుల చొప్పున 43.5 టీఎంసీలు తరలించేలా రెండు టన్నెళ్లను తవ్వాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, దర్శి, కొండెపి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో 84 వేల ఎకరాలు, వైఎస్సార్ జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో 27,200 ఎకరాలు వెరసి 4,47,200 ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 15.25 లక్షల మంది దాహార్తి తీర్చాలన్నది వైఎస్సార్ సంకల్పం. పనులు వేగంగా కొనసాగించడంతో మహానేత హయాంలోనే టన్నెళ్లు, నల్లమలసాగర్, ప్రధాన కాలువల పనులు సింహభాగం పూర్తయ్యాయి. ఇక మిగిలిన పనులను పూర్తిచేసే పేరుతో కాంట్రాక్టర్లతో కలసి గత ప్రభుత్వ పెద్దలు రూ.66.44 కోట్లు దోచుకున్నారు. టన్నెళ్ల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై వేటు వేసి.. అంచనా వ్యయాన్ని పెంచి అధిక ధరలకు ఎంపిక చేసుకున్న కాంట్రాక్టర్లకు అప్పగించేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు.
ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెలిగొండను ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు అప్పగించిన రెండో టన్నెల్ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి, రివర్స్ టెండరింగ్‌తో రూ.61.76 కోట్లు ఖజానాకు ఆదా చేశారు. తద్వారా గత సర్కార్ అక్రమాలను బహిర్గతం చేశారు. మరోవైపు మొదటి టన్నెల్‌లో మిగిలిన 3.6 కి.మీల పనిని 13 నెలల రికార్డు సమయంలో పూర్తి చేశారు. లైనింగ్‌తో సహా మొదటి టన్నెల్ పూర్తయింది. మొదటి టన్నెల్‌కు శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేసేందుకు హెడ్ రెగ్యులేటర్‌ను గతేడాదే పూర్తి చేశారు. ఇక రెండో టన్నెల్ ఏడు నెలల్లో పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టారు. నల్లమలసాగర్ నిర్వాసితులకు పరిహారాన్ని చెల్లించడంతో పాటు పునరావాసం కల్పించడం ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి టన్నెళ్ల ద్వారా నల్లమలసాగర్‌కు అక్టోబర్ నాటికి కృష్ణా వరద జలాలను తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది.
వెలిగొండ ప్రాజెక్ట్ రెండవ టన్నెల్‌లో ఇప్పటి వరకు పనులు పూర్తయిన ప్రాంతం
Comments
Please login to add a commentAdd a comment