బస్సు యాత్రలో సీఎం జగన్‌కు సమస్యలు చెప్పుకున్న పలువురు బాధితులు
ఆదుకుంటానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి
వెంటనే అధికారులకు ఆదేశాలు
ఆత్మకూరు/నెల్లూరు(దర్గామిట్టా)/కావలి/కోవూరు: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ శనివారం నెల్లూరు జిల్లాలో తనను కలిసిన పలువురు బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వారి సమస్యలను సావధానంగా విని.. ‘బాధపడకండమ్మా.. ఆదుకుంటానంటూ’ వారి కన్నీళ్లు తుడిచారు. అప్పటికప్పుడు తగిన సాయమందించాలంటూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి.. అండగా నిలిచారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వల్లిపేడుకు చెందిన గడ్డం పెద సుబ్బయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సీఎం జగన్‌ను కలిసి తన బాధను చెప్పుకునేందుకు శనివారం నెల్లూరు సింహపురి ఆస్పత్రి సెంటర్‌కు చేరుకున్నాడు. బస్సు యాత్రలో భాగంగా అక్కడికి చేరుకున్న సీఎం జగన్ అంతమంది జనంలోనూ వీల్‌చైర్‌లో ఉన్న పెద సుబ్బయ్యను చూసి.. పరిస్థితిని ఆరా తీశారు. వెంటనే సుబ్బయ్యకు మెరుగైన చికిత్స అందించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
నా బిడ్డను బతికించన్నా..
నెల్లూరు జిల్లా సింగపేటకు చెందిన వ్యవసాయ కూలీ రవిచంద్ర తన నాలుగేళ్ల కుమార్తె బ్లెస్సీతో కలిసి సీఎం జగన్‌ను కలిసేందుకు ఉలవపాళ్ల కూడలి వద్దకు వచ్చాడు. ‘నా కుమార్తె పుట్టినప్పటి నుంచే జన్యు సంబంధిత సమస్యలతో బధిరత్వం, ఫిట్స్‌తో బాధపడుతోంది. రెండేళ్ల కిందట నా భార్య కూడా చనిపోయింది.
చికిత్స కోసం నా కుమార్తెను చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లా.. అనంతరం అక్కడి వైద్యుల సలహా మేరకు రాయవెల్లూర్‌లో చూపిస్తున్నా. నా బిడ్డను బతికించుకునేందుకు.. చికిత్సకు తగిన సాయం కోసం సీఎం జగన్‌ను కలిసేందుకు వచ్చా’అని రవిచంద్ర చెప్పాడు. వీరి పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బంది వివరాలన్నీ నమోదు చేసుకున్నారు.
అవ్వా.. పింఛన్ వస్తోందా?
బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ నెల్లూరు జిల్లా నార్త్‌రాజుపాలేనికి చెందిన పుల్లా లక్ష్మమ్మను ‘అవ్వా, పింఛన్ వస్తోందా’ అంటూ ఆరా తీశారు. ప్రతి నెలా ఒకటో∙తేదీనే వలంటీర్ తమ ఇంటికే వచ్చి పింఛన్ డబ్బులు ఇచ్చేవారని.. చంద్రబాబు నిర్వాకం వల్ల ఈనెల అష్టకష్టాలు పడ్డామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘మళ్లీ నువ్వే రావాలి.. మాలాంటి వృద్ధులను కంటికి రెప్పలా కాపాడాలి’ అని సీఎం జగన్‌ను కోరింది. ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘మరో రెండు నెలల్లో నీ మనవడి ప్రభుత్వం మళ్లీ రాబోతోంది. మీ సమస్యలు తీరుస్తా’ అని భరోసా ఇచ్చారు.
కాలు దెబ్బతిన్న బాధితుడికి అండ
అల్లూరు మండలం తూర్పు గోగులపల్లికి చెందిన సత్యనారాయణకు 20 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు పూర్తిగా దెబ్బతింది. మెరుగైన వైద్యం కోసం సీఎం జగన్ సాయం కోరేందుకు నెల్లూరుకు వచ్చాడు. సత్యనారాయణను పరామర్శించిన ముఖ్యమంత్రి.. ఆయనకు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆ దేవుడికి సమస్యలు చెప్పుకున్నాం..
బుజబుజనెల్లూరుకు చెందిన చల్లా కృష్ణ దంపతులు సీఎం జగన్‌ను కలిసేందుకు జాతీయ రహదారిపైకి వచ్చారు. వారిని చూసిన సీఎం జగన్ బస్సులో నుంచి దిగివచ్చి.. చల్లా కృష్ణ దంపతులతో మాట్లాడారు. తాము అనారోగ్యంతో బాధపడుతున్నామని.. తనకు రెండుసార్లు వైద్యులు ఆపరేషన్ చేశారని చల్లా కృష్ణ సీఎం జగన్‌కు తెలిపారు.
తన భార్య ఆరోగ్య పరిస్థితి కూడా సరిగ్గా లేదని.. ముగ్గురు సంతానం ఉన్నారని వివరించారు. వారి సమస్యను విన్న సీఎం జగన్ ‘బాధపడకండి.. ఆదుకుంటా’నంటూ భరోసా ఇచ్చారు. పేదల పాలిట దేవుడైన సీఎం జగన్‌కు తమ సమస్యలు చెప్పుకున్నామని మీడియాకు చల్లా కృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment