క్షేత్ర స్థాయిలో పర్యటనలు తప్పనిసరి  | Vidadala Rajini directive medical and health department officials | Sakshi
Sakshi News home page

క్షేత్ర స్థాయిలో పర్యటనలు తప్పనిసరి 

Published Tue, Sep 6 2022 5:06 AM | Last Updated on Tue, Sep 6 2022 5:06 AM

Vidadala Rajini directive medical and health department officials - Sakshi

సాక్షి, అమరావతి: జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పర్యటించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఆదేశించారు. దీనివల్ల పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, డీహెచ్‌లు, ఏహెచ్‌లలో వైద్య సేవలు మెరుగవుతాయన్నారు. సీజనల్‌ వ్యాధులపై మంగళగిరి నుంచి అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో సోమవారం మంత్రి రజని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీజనల్‌ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న చోట్ల వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాధుల వ్యాప్తిని గమనిస్తూ అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. డెంగీ, మలేరియా వ్యాధి నిర్ధారణ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.

సీఎం వైఎస్‌ జగన్‌ రూ.వేల కోట్లు వైద్య శాఖ కోసం ఖర్చు చేస్తున్నారని గుర్తు చేశారు. అన్ని విషజ్వరాలకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందేలా చేస్తున్నారన్నారు. డెంగీ, మలేరియా, చికెన్‌గున్యాతోపాటు కలరా, డయేరియా నివారణకు కావాల్సిన మందులన్నీ ప్రభుత్వాస్పత్రుల్లో సరిపడా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే వినతులపై తక్షణమే స్పందించాలన్నారు.

ఈ విషయంలో స్పందించని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని మరింత చిత్తశుద్ధితో నిర్వహించాలని చెప్పారు. వెంటనే ఫీవర్‌ సర్వేను చేపట్టాలని, 15 రోజుల్లోగా ఇది పూర్తికావాలని ఆదేశించారు. ఈ సర్వేకు సంబంధించి ఏ రోజు వివరాలు ఆ రోజు తనకు నేరుగా పంపాలన్నారు.

ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ నివాస్, డీఎంఈ రాఘవేంద్రరావు, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిర ప్రసాద్, ఏపీవీవీపీ కమిషనర్‌ వినోద్‌కుమార్, డీహెచ్‌ డాక్టర్‌ వి.రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement