
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం, వైద్య కళాశాలల నిర్మాణం, నాడు–నేడు కింద ఆస్పత్రుల అభివృద్ధి వంటి కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగంలో సరికొత్త విప్లవాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. సీఎం జగన్ ఆలోచనలు దేశానికే దిక్సూచి అని అన్నారు. న్యూఢిల్లీలో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన టైమ్స్ నౌ సమ్మిట్–22లో మంత్రి రజిని నేతృత్వంలో ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జీఎస్ నవీన్‌కుమార్‌లతో కూడిన బృందం పాల్గొంది.
వివిధ అంశాలపై సదస్సులో చర్చించారు. వైద్య రంగంలో డిజిటలైజేషన్‌పై జరిగిన చర్చలో రాష్ట్ర ప్రజలకు డిజిటల్ వైద్య సేవలు అందించడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషి అనిర్వచనీయమని నిర్వాహకులు ప్రశంసించారు. ఈ చర్చలో మంత్రి రజిని మాట్లాడుతూ.. ప్రజలకు వైద్యం భారం కాకూడదన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అని తెలిపారు.
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద 2,200కు పైగా ఆస్పత్రుల్లో 3,255 చికిత్సలను ఉచితంగా పేదలకు అందిస్తున్నామని, ఇందుకు ఏటా రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య ఆసరా కింద రోగులకు ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల సహకారంతో రాష్ట్రంలోని 3.5 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ ఐడీలు సృష్టించామని, ఇప్పటికే 1.5 కోట్ల మంది ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేశామని వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, 1,142 పీహెచ్‌సీల నిర్మాణం, ఆధునికీకరణ ద్వారా ఆరోగ్య సేవలను బలోపేతం చేశామన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి, గ్రామీణులకు వైద్య సేవలను మరింత చేరువ చేశామని చెప్పారు. నాడు–నేడు కింద రూ.16 వేల కోట్లతో వైద్య రంగం రూపురేఖలు మారుస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఏకంగా రూ.8,500 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి రజిని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment