సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. రాజధానిపై నిర్ణయం ఆయా రాష్ట్రాలకే ఉంటుందని గతంలో కేంద్రం విస్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడంపై కేంద్రం వైఖరి ఏమిటని రాజ్యసభలో బుధవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి సమాధానమిస్తూ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ దాఖలు చేసిందని, ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 మేరకు నూతన రాజధాని ఏర్పాటుకు ఉన్న ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.
ఆ కమిటీ నివేదికను తదుపరి చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిందని తెలిపారు. అనంతరం అమరావతిని రాష్ట్ర రాజధాని నగరంగా ప్రకటిస్తూ 2015 ఏప్రిల్ 23న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిందన్నారు. కాలక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీసీఆర్‌డీఏ చట్టం–2020ని రద్దు చేసిందని తెలిపారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు నగరాల ను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సంఘటిత అభివృద్ధి చట్టం–2020 (ఏపీడీఐడీఏఆర్)ని తీసుకొచ్చిందని వివరించారు.
ఈ చట్టం చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వం 2021లో ఈ చట్టాన్ని రద్దుచేసిందన్నారు. మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ అప్పీల్ (సివిల్)ను దాఖలు చేసిందని, ప్రస్తుతం ఈ అంశం విచారణ దశలో ఉందని మంత్రి చెప్పారు.
హైవే నిర్మాణాల్లో వేస్ట్ మెటీరియల్ వినియోగం
జాతీయ రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్, ఇను ము, స్టీల్, నిర్మాణాల కూల్చివేత వ్యర్థాలను విరి విగా వినియోగిస్తున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. 2019 నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఏపీలో 209 కిలోమీటర్ల మేర జాతీయ రహదార్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలు వినియోగించినట్లు తెలిపారు.
అదేవిధంగా హైవేల నిర్మాణంలో 359 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి ఫ్లైయాష్ (థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే బూడిద), 7.28 లక్షల టన్నుల నిర్మాణ కూల్చివేత వ్యర్థాలు వినియోగించామని, 68 కిలోమీటర్లు మేర రహదారి నిర్మాణంలో ఇనుము, స్టీల్ స్లాగ్ వ్యర్థాలు వాడామని వివరించారు. దేశంలోని అన్ని జాతీయ రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్, ఇనుము, నిర్మాణ రంగ వ్యర్థాలు, ఇతర వ్యర్థాలు, ఫ్లైయాష్ వినియోగించే విధంగా తమ శాఖ విధానపరమైన మార్గదర్శకాలు జారీచేయడంతోపాటు, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ మాన్యువల్స్ ప్రచురించినట్టు చెప్పారు.
సున్నా/తక్కువ ఉద్గారాల ప్రాంతాల్లో ఈ–వాహనాలకు అనుమతి దేశంలో సున్నా/తక్కువ ఉద్గారాలున్న ప్రాంతాల్లోనే ఈ–వాహనాలను అనుమతిస్తున్నట్లు కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సున్నా/తక్కువ ఉద్గారాలున్న ప్రాంతాలు గుర్తించడానికి అధ్యయనం తమ శాఖకు తెలియదని వైఎస్సార్‌సీపీ సభ్యుడు ఎస్.నిరంజన్‌రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఏపీలో 192 రహదారి పనులు పూర్తి
ఆంధ్రప్రదేశ్‌లో 1,490 కిలోమీటర్ల మేర 192 రహదారి పనులు పూర్తయ్యాయని కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఏపీలో 3,285 కిలోమీటర్ల పనులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఈ నెల 2వ తేదీ నాటికి తూర్పుగోదావరి జిల్లాలో ఒక రహదారి మినహాయించి పూర్వ 13 జిల్లాల్లోని 2,308.58 కిలోమీటర్ల మేర 298 రహదారి పనులు మంజూరుకాగా 1,490 కిలోమీటర్ల మేర 192 రహదారుల పనులు పూర్తయ్యాయని వివరించారు. చాలా ప్రాజెక్టులు కరోనా, వరదల వల్ల ఆలస్యమైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని చెప్పారు.
జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికకు మరింత సమయం
జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక ఇవ్వడానికి మరింత సమయం పడుతుందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతశాఖ సహాయమంత్రి నారాయణస్వామి తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు.
విజయసాయిరెడ్డి రాజ్యసభ కార్యకలాపాల నిర్వహణ
ప్యానల్ వైస్‌చైర్మన్ హోదాలో బుధవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 4.32 గంటల నుంచి గంటసేపు ఆయన సభాకార్యక్రమాలు నిర్వహించిన సమయంలో సభ్యులు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రసంగించారు.
మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉంది
Published Thu, Feb 9 2023 5:35 AM | Last Updated on Thu, Feb 9 2023 5:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment