సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ ఎంపీలు అందరం.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించొద్దని కోరుతూ వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. మంగళవారం ఏపీ భవన్‌లో పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీలు బాలశౌరి, అనూరాధ, గొడ్డేటి మాధవి, బి.సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, తలారి రంగయ్య, రెడ్డెప్ప, పోచ బ్రహ్మానందరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. ‘1999–2004 మధ్య 56 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన చంద్రబాబు, ఆయన తొత్తులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడటం హాస్యాస్పదం. వైఎస్ జగన్ ఉక్కు మనిషి అయితే, చంద్రబాబు తుక్కు మనిషి. చంద్రబాబుకు వైజాగ్ స్టీల్ గురించి తెలీదు. సుజనా స్టీల్ గురించే తెలుసు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకువచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ చేసిన సూచనలు కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించాం. ఏడు మేజర్ పోర్టుల ప్రైవేటీకరణను కూడా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పాం. విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చాల్సిందిగా కోరాం’ అని విజయసాయిరెడ్డి చెప్పారు.
ఎస్‌ఈసీని తొలగించే అధికారం గవర్నర్‌కు ఉండాలి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)ను గవర్నర్ నియమిస్తారు. అందువల్ల శాసనసభ సిఫారసు మేరకు ఎస్‌ఈసీని తొలగించే అధికారమూ గవర్నర్‌కు ఉండేలా రాజ్యాంగాన్ని సవరించాలని వైఎస్సార్‌సీపీ కోరుతోందని చెప్పారు. రాష్ట్రంలో విగ్రహాలు చోరీలను చంద్రబాబు, అచ్చెన్నాయుడు ప్రోత్సహిస్తున్నారని, మత మార్పిడుల్లోనూ చంద్రబాబు, ఆయన అనుచరుల పాత్రే ఉంది’ అని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రజలకు ఆమోదయోగ్యం కాదని ఆర్థిక మంత్రికి వివరించినట్లు మిథున్ రెడ్డి తెలిపారు.
నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా
రాజ్యసభ చైర్మన్‌ను అగౌరవపరచడమో, విధులు నిర్వర్తించకుండా చేయడమో తన ఉద్దేశం కాదని, సోమవారం సభలో తాను ఆవేదనలో ఉన్న సమయంలో జరిగిన పరిణామమని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాజ్యసభ జీరోఅవర్‌లో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ తన వ్యాఖ్యల పట్ల విచారం వెలిబుచ్చారు. ఆవేదనలో వచ్చిన భావోద్వేగమే తప్ప దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.
కేశినేని వ్యాఖ్యలపై మిథున్ అభ్యంతరం
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలోజరిగిన చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ కేశినేని నాని పలుమార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు ప్రస్తావించడాన్ని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి తప్పు పడుతూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణకు వీలుగా రాష్ట్ర అసెంబ్లీ చట్టాన్ని తెచ్చిందని గుర్తు చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగిస్తామని ప్యానల్ స్పీకర్ భరృ్తహరి మెహతాబ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment