రామతీర్థం కొండపై ఘటన వివరాలు తెలుసుకుంటున్న ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షిప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాలోని రామతీర్థం బోడికొండపై నున్న కోదండరామాలయంలోని రాముడి విగ్రహం ధ్వంసం ఘటనకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుచరులే కారణమని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు నేతృత్వంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి ఆయన శనివారం రామతీర్థంలో పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న పాలన చూసి ఓర్వలేకే చంద్రబాబు, ఆయన అనుచరులు కుట్రపూరితంగా ఈ ఘటనకు పాల్పడ్డారనడంలో సందేహం లేదన్నారు.
లోకేష్ సవాలును స్వీకరిస్తున్నామని, ఆయన కోరినట్టుగా సింహాచలం అప్పన్న సన్నిధిలో చర్చకొస్తానని, సమయం, తేదీ చెప్పాలని ప్రతి సవాలు విసిరారు. విజయనగరం నియోజకవర్గం గుంకలాంలో నిరుపేదలకు గృహవసతి కల్పించేందుకు సీఎం శ్రీకారం చుట్టిన మహత్తర కార్యక్రమాన్ని పక్కదోవ పట్టించాలనే దుర్మార్గపు ఆలోచనతో చంద్రబాబు ఇలాంటి పనికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేవన్నారు. ఆయన ఐదేళ్ల పాలనలో సుమారు 20 వేల దేవాలయాలు మూతపడటం నిజంకాదా? అని ప్రశ్నించారు. రామతీర్థంలో గత నెల 29వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఘటనను మొట్టమొదటగా ఎవరు బయటపెట్టారో ఆలోచించాలన్నారు. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియకముందే చంద్రబాబు సోషల్ మీడియా ఎలా బయట పెట్టగలిగిందని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన కుమారుడు, పూసపాటి అశోక్‌గజపతిరాజు కలిసి వారి సహచరుల ద్వారా ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారన్న విషయం అర్థమవుతోందన్నారు.
అన్ని అపచారాలకూ బాబే కారణం
చంద్రబాబు తిరుమలలో వేయి కాళ్ల మండపాన్ని తొలగించిన దుర్మార్గుడని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. విజయవాడలో 39 దేవాలయాలను కూలగొట్టారన్నారు. తిరుమలలో లడ్డూ తయారుచేసే పోటును మూసివేయించి తవ్వకాలు జరిపించటంతోపాటు అర్ధరాత్రి తాంత్రిక పూజలు చేసిన దుర్మార్గుడు చంద్రబాబన్నారు. కలకాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలనే ఆశతో శ్రీకాళహస్తి, సింహాచలం, పెందుర్తి భైరవ ఆలయాల్లో క్షుద్రపూజలు చేయించారన్నారు. అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించాలని కోరితే గొంతెమ్మ కోర్కెలంటూ దుర్భాషలాడారని గుర్తుచేశారు.
అమరావతిలో సదావర్తి భూములు అమ్మకానికి పెడితే.. కోర్టు మొట్టికాయలు వేయటంతో వెనక్కి తగ్గారన్నారు. కుట్ర, కుతంత్ర రాజకీయాలే తప్ప విలువలతో కూడిన రాజకీయాలు చంద్రబాబు చేయలేరన్నారు. రామతీర్థం గుడికి సంబంధించి చంద్రబాబు, అతని కొడుకు లోకేష్, టీడీపీ కార్యకర్తలు పాల్పడిన దుశ్చర్యకు భగవంతుడు తప్పక శిక్ష విధిస్తారని ఆయన అన్నారు. ఆలయ పునరుద్ధరణకు ఇప్పటికే దేవదాయ మంత్రి ఆదేశాలిచ్చారని, రూ.1.50 కోట్లు ఖర్చవుతుందని ఆలయ అధికారులు ప్రతిపాదనలు పంపించారని, రూ.4 కోట్లు అవసరమైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామన్నారు. విలువలుగల నాయకుడైతే తాను చైర్మన్‌గా ఉన్న రామతీర్థం పుణ్యక్షేత్రంలో జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ పూసపాటి అశోక్‌గజపతిరాజు తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సాయిరెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణుల యత్నం..
అంతకుముందు విజయసాయిరెడ్డి పార్టీ నేతలతో కలసి కాలినడకన బోడికొండపైకి ఎక్కి అక్కడి కోదండ రామాలయాన్ని, శిరస్సు లభించిన కొలనును పరిశీలించారు. అనంతరం కొండ దిగి కిందకు రాగానే ఆయన్ను అడ్డుకోవాలంటూ టీడీపీ నేత కళావెంకట్రావ్ రెచ్చగొట్టడంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. టీడీపీ శ్రేణులు, వారిని చూసి బీజేపీ నేతలు, కార్యకర్తలు విజయసాయిరెడ్డిని, ఇతర వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిని పక్కకు తొలగించేందుకు పోలీసులు శ్రమించారు. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు విజయసాయిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులపై రాళ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లు విసిరారు. ఈ ఘటనలో విజయసాయిరెడ్డి ప్రయాణిస్తున్న బుల్లెట్‌ప్రూఫ్ వాహనం ముందు అద్దం పగిలింది. దీనిపై నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌లో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కళావెంకట్రావులపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. తమపై జరిగిన దాడికి చంద్రబాబు, అశోక్‌గజపతిరాజు, అచ్చెన్నాయుడు బాధ్యత వహించాలన్నారు. టీడీపీ దుశ్చర్యను నిరసిస్తూ కొండ దిగువభాగం నుంచి గొర్లిపేట వరకు నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment