సాక్షి ప్రతినిధి, విజయవాడ, సాక్షి, అమరావతి: కోవిడ్ నిబంధనలు, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. మెరుగైన పీఆర్‌సీ, కొత్త జీవో ఉపసంహరణ డిమాండ్‌తో ఉద్యోగ సంఘాలు 5 వేల మందితో గురువారం చలో విజయవాడ కార్యక్రమ నిర్వహణకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. విజయవాడలో నేడు బీఆర్‌టీఎస్ రోడ్డులో వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాకపోకలకు అనుమతి లేదని, వాహనదారులు మళ్లింపు మార్గాల్లోనే ప్రయాణించాలని సూచించారు.
బీఆర్‌టీఎస్ వైపు వాహనాల రాకపోకల్ని నివారిస్తూ ప్రత్యామ్నాయంగా ఆరు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను ఏర్పాటు చేశారు. బీఆర్‌టీఎస్ రోడ్డులో వందకుపైగా కెమెరాలతో నిఘా ఉంచారు. డ్రోన్‌లు, ఫాల్కన్ వాహనాలతో పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్లలో తనిఖీ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు, 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఉద్యోగులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్టీరింగ్ కమిటీ నేతల ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ఉద్యోగ సంఘాలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
అయినా సరే.. ఆగేది లేదు: తమపై చర్యలు తీసుకున్నా సరే చలో విజయవాడ నిర్వహిస్తామని పోలీసు కమిషనర్‌కు తెలియచేసినట్లు పీఆర్సీ సాధన సమితి నేతలు మీడియాతో పేర్కొన్నారు. కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో స్టీరింగ్ కమిటీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ బుధవారం రాత్రి సీపీని కలిశారు. తమ ఉద్యమ కార్యాచరణ నోటీసును గతంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చామని, అందులో భాగంగానే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అనుమతి లేదు.. సహకరించండి
చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తున్నాం. ఉద్యోగులు 5 వేల మంది తరలి రావాలని పిలుపునిచ్చారు. కోవిడ్ నిబంధనల ప్రకారం అవుట్ డోర్ లోకేషన్‌లలో 200, ఇండోర్‌లో వంద మందికి మించరాదు. అసాంఘిక శక్తులు చొరబడి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశముంది. నగరంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, 144 సీఆర్‌పీసీ ప్రొసీడింగ్స్ అమలులో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కార్యక్రమానికి అనుమతి ఇవ్వటం లేదు. ఉద్యోగులు సహకరించాలి.
–టి.కె.రాణా,విజయవాడ పోలీస్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment