సాక్షి, అమరావతి: ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలపై విధాన నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తున్న నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. దేశంలోని పంచాయతీలలో ఏకరూపత సాధించే దిశగా చర్యలు చేపడుతోంది. కనీస నిర్ణీత జనాభా సంఖ్య ఆధారంగా దేశమంతటా గ్రామ పంచాయతీలను పునర్విభజన జరిపే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో తీరుగా.. ఒకే రాష్ట్రంలోనూ వేర్వేరు పంచాయతీలలో ఉండే జనాభా సంఖ్య మధ్య ఊహించని స్థాయిలో వేల సంఖ్యలో వ్యత్యాసాలు ఉన్నాయి.
ఒక్కొక్క చోట 15 వేల నుంచి 20 వేల జనాభా ఉండే ఓ పెద్ద గ్రామ పంచాయతీగా ఉంటుంటే.. కొన్నిచోట్ల 500 జనాభా ఉండే గ్రామం మరో పంచాయతీగా ఉంటోంది. ఉదాహరణకు రాష్ట్రంలో 13,300కి పైగా గ్రామ పంచాయతీలు ఉండగా.. ఒక్కో పంచాయతీ సరాసరి జనాభా 2,800 వరకు ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
అక్కడ ఒక్కో పంచాయతీలో 20 వేలకు పైనే..
కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో సరాసరి జనాభా 20 వేలకు పైబడి ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. కేరళ వంటి రాష్ట్రంలో అతి చిన్న గ్రామ పంచాయతీలో సైతం 10 వేలకు తక్కువ జనాభా ఉండదని చెబుతున్నారు. మన రాష్ట్రంలో వందలోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు సైతం ఉండగా.. 30 వేల జనాభా గల గ్రామాలు కూడా పంచాయతీలుగా కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిన కనీస ఓ నిర్ధిష్ట జనాభా సంఖ్య ఆధారంగా గ్రామ పంచాయతీలను పునర్విభజన చేయడం ద్వారా గ్రామీణ స్థానిక సంస్థల స్థాయిలోనూ మెరుగైన, సమర్థవంతమైన పరిపాలనకు అవకాశం ఉంటుందా అన్న దానిపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాలతో సంప్రదింపులు చేపట్టింది.
నేడు, రేపు వర్క్‌షాప్
చాలా రాష్ట్రాల్లో జిల్లా స్థాయిలో జెడ్పీ చైర్మన్ల ఎన్నిక పరోక్ష పద్ధతిన కొనసాగుతోంది. కానీ ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానాన్ని తేవడం వంటి స్థానిక సంస్థల స్థాయిలో పరిపాలనకు సంబంధించి అనేక అంశాలపై అవసరమైతే చట్ట సవరణలు తెచ్చేందుకు సోమ, మంగళవారాల్లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అన్ని రాష్ట్రాల అధికారులు ప్రతినిధులతో హైదరాబాద్‌లో వర్క్‌షాప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో మన రాష్ట్రం నుంచి 9 మంది, 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 261 మంది హాజరవుతున్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి ప్రతి రెండు విడతలకోసారి రోటేషన్ పద్ధతిన రిజర్వేషన్ల మార్పులు, చేర్పులు చేసుకునే అంశాన్ని వర్క్‌షాప్ అజెండాలో చేర్చారు.
ఏకరూప పంచాయతీలపై కసరత్తు!
Published Mon, Sep 4 2023 5:11 AM | Last Updated on Mon, Sep 4 2023 5:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment