రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో వడ్డే కులానికి చెందిన దంపతులకు ఇద్దరు అబ్బాయిలు సంతానం. దశాబ్దాలుగా రెండు గదుల ఇంట్లోనే జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసిన ఆ దంపతులు... మరోమార్గం లేక ఇద్దరు కోడళ్లు, కుమారులతో కలిసి ఆ ఇంట్లోనే సర్దుకుని జీవనం సాగిస్తున్నారు. వీరు ఇల్లు కట్టుకునేందుకు అర్హులు. ప్రభుత్వం కూడా ఇలాంటి వారికి ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆ గ్రామానికే చెందిన ఓ వ్యక్తి ఇంటి పట్టా కోసం తన పొలాన్ని ప్రభుత్వానికి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక్కరంటే ఒక్కరూ దరఖాస్తు చేసే సాహసం చేయని పరిస్థితి. ఇలాంటి వారు వెంకటాపురంలో చాలా మందే ఉన్నారు. పథకాలకు అర్హులైనప్పటికీ.. ఇక్కడ రాజకీయ నాయకులకు భయపడి ఒక్క పథకం పొందలేకపోతున్నారు.
రామగిరి/అనంతపురం: వెంకటాపురం.. ఈ పేరు వినిపిస్తే చాలు ఓ రాజకీయ నేత గుర్తొస్తారు. ఏళ్లుగా అక్కడ ఆ కుటుంబానిదే ఆధిపత్యం. గ్రామంలో బతికి బట్టకట్టాలంటే వారి చెప్పుచేతల్లో ఉండాల్సిందే. లేదంటే ఊరు విడవక తప్పని పరిస్థితి. చివరకు ప్రభుత్వ పథకాలైనా వారు చెప్పిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి. కాదూ.. కూడదని దరఖాస్తు చేయాలనుకుంటే ఆ గ్రామంలో వారికి నిలువ నీడ ఉండదు. అందుకే 750 జనాభా ఉన్న వెంకటాపురం దశాబ్దాలుగా పూర్తి నిర్బంధంలో బతుకుతోంది.
దరఖాస్తు చేసుకోవాలంటేనే భయం
రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఎందరో అర్హులు వాటిని అందిపుచ్చుకుని తమ జీవితాలను మార్చుకుంటున్నారు. కానీ రామగిరి మండలం వెంకటాపురంలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ప్రభుత్వం ఇద్దరు వలంటీర్లను ఆ గ్రామంలో నియమించినా.. ప్రభుత్వ పథకాలకు అర్హులైనప్పటికీ ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి.
గ్రామంలో ఎవరైనా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పథకం తీసుకుంటే తమ ఆధిపత్యానికి గండి పడుతుందనే దురాలోచనతో ఆ గ్రామానికి చెందిన రాజకీయ నాయకులు పేదలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. పోనీ వారైనా నిరుపేదలను ఆదుకుంటారా అంటే అదీ లేదు. ఎప్పుడూ ఏ మెట్రో సిటీలోనో లేదా జిల్లా కేంద్రంలోనో హాయిగా గడుపుతున్న ఆ ‘పెద్ద’ కుటుంబం నిరుపేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
గూడు లేని 46 మంది ఉన్నా..
వెంకటాపురం గ్రామంలో నిలువ నీడ లేని వారు 46 మంది ఉన్నట్లు ఆ గ్రామస్తులే చెబుతున్నారు. కానీ అధికారులు వెళ్లి అడిగితే ఒక్కరంటే ఒక్కరూ నోరు తెరవలేని పరిస్థితి. అందువల్లే చాలా మంది సొంత ఊరును వదులుకుని బంధువుల ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల గ్రామంలో పర్యటించిన తహసీల్దార్ 14 మంది గ్రామస్తులకు ఇళ్లు లేనట్లు గుర్తించారు. వారంతా దరఖాస్తు చేసుకుంటే ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో గ్రామానికే చెందిన రైతు శ్రీనివాసులు పేదలకు పట్టాలిచ్చేందుకు సర్వేనంబర్ 752లోని తన 2.50 ఎకరాల పొలాన్ని ప్రభుత్వానికి విక్రయించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కానీ అక్కడి రాజకీయ నేతలు మాత్రం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు తమ గ్రామస్తులకు అవసరం లేదని చెబుతున్నారు. ఫలితంగా గూడులేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులే చొరవ తీసుకుని..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంకటాపురం అభివృద్ధిపై దృష్టి సారించింది. స్థానిక శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కూడా వెంకటాపురం వాసుల పరిస్థితి అర్థం చేసుకుని అధికారులనే గ్రామానికి పంపారు. దీంతో మండల అధికారులు పథకాలకు అర్హులను గుర్తించారు. అందువల్లే ప్రస్తుతం గ్రామంలోని 100 మందికి పెన్షన్లు.. 215 రేషన్ కార్డులు ఉన్నాయి.
అదో ప్రత్యేక రాజ్యం
వెంకటాపురంలో ప్రత్యేక రాజ్యం నడుస్తోంది. ఆ గ్రామంలోకి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. అధికారులు కూడా ఆ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసే సాహసం చేయలేకపోతున్నారు. ఒక్క కుటుంబం రాజకీయ ఉనికి కోసం ఎందరో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఆ రాజకీయ కుటుంబీకులు తమ దుస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, లేకపోతే వారే సాయం చేసినా బాగుంటుందని గ్రామస్తులు కోరుతున్నారు.
అర్హులను గుర్తించాం
వెంకటాపురంలో ఇళ్లు లేని వారు 14 మంది ఉన్నట్లు గుర్తించాం. అయితే వారెవరూ ఇంటి కోసం గానీ, స్థలం కోసం గానీ దరఖాస్తు చేయలేదు. వారు ఇల్లు కావాలని కోరితే తప్పకుండా స్థలం ఇవ్వడంతో పాటు అర్హత మేరకు ఇళ్లు కూడా మంజూరు చేస్తాం.
– నారాయణస్వామి, తహసీల్దార్ రామగిరి
Comments
Please login to add a commentAdd a comment