
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానంపై కూడా ఈనాడు రామోజీ రావు అక్కసు వెళ్లగక్కారు. ఈ విధానం వల్ల తమకెంతో మేలు చేకూరుతోందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంతోష పడుతుంటే రామోజీ మాత్రం దీనిపై కూడా విషం కక్కారు.
‘వైద్య సేవల్లోనూ ప్రచార కక్కుర్తి’ అంటూ చంద్రబాబు కోసం ఎంత బరితెగింపుకైనా సిద్ధమని చాటుకున్నారు. రాష్ట్రంలో వైద్య రంగం ప్రగతి గురించి, ప్రత్యేకించి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గురించి మీ ఫ్యామిలీ డాక్టర్‌తో చర్చించే దమ్ముందా రామోజీ?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్య రంగం, 104, 108 సేవల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవడంతో పాటు ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంతో గ్రామీణుల ముంగిటకే వైద్య సేవలు అందుబాటులోకి వస్తే సంతోషించాల్సింది పోయి ఈనాడు రామోజీ ఏడుస్తున్నారు. తన విష ప్రచారంతో వాస్తవాలకు ముసుగు వేయడానికి విఫలయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 104 సంచార వైద్య సేవలను స్వల్ప మార్పులతో ఫ్యామిలీ డాక్టర్‌గా మార్చి ఈ ప్రభుత్వం హడావుడి చేస్తోందంటూ వక్రభాష్యం పలికారు.
అప్పట్లో కేవలం 277 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)లతో మొక్కుబడిగా సేవలు నడిపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 104 సేవలకు ఊపిరిపోశారు. ఏకంగా రూ.211 కోట్లతో 936 నూతన ఎంఎంయూ వాహనాలను కొనుగోలు చేసి సేవలను విస్తరించారు. దీనికి కొనసాగింపుగా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
1,676 మంది వైద్యుల నియామకం
ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామీణ ప్రజలకు సక్రమంగా సేవలందించేందుకు ప్రతి మండలానికి కనీసం రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో తెచ్చేందుకు కొత్తగా 88 పీహెచ్‌సీలు, 63 చోట్ల సీహెచ్‌సీలు కేంద్రంగా కో లొకేటెడ్ పీహెచ్‌సీలను మంజూరు చేశారు. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు చేపట్టారు. దీంతో పాటు కొత్త పీహెచ్‌సీలను ఏర్పాటు చేశారు. ఇలా ఏకంగా 1,676 మంది వైద్యాధికారుల్ని శాశ్వత ప్రాతిపదికన నియమించారు.
అదనంగా 104 మంది వైద్యుల పోస్టుల్ని ప్రభుత్వం మంజూరు చేసింది. 175 మంది పూల్ డాక్టర్‌లను అందుబాటులోకి తెచ్చింది. 10,032 డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి ప్రతి చోట బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన వారిని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)గా నియమించారు. ప్రస్తుతం విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో 105 రకాల మందుల్ని అందుబాటులో ఉంచారు. ఏఎన్‌ఎం, ఆశావర్కర్‌లు ఆయా గ్రామాల్లో సేవలందిస్తున్నారు.
ఆరోగ్య పరిస్థితులపై అవగాహన
ప్రస్తుత విధానంలో పీహెచ్‌సీ పరిధిలోని విలేజ్ క్లినిక్స్‌ను ఇద్దరు శాశ్వత వైద్యులకు సమానంగా మ్యాప్ చేశారు. దీంతో వారు నెలలో రెండు సార్లు ప్రతి విలేజ్ క్లినిక్ పరిధిలో పర్యటిస్తున్నారు. క్రమం తప్పకుండా గ్రామాలకు వెళుతుండటంతో ఆయా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులు, సమస్యలు, ఇతర అంశాలపై వైద్యులకు ఓ అవగాహన ఉంటోంది. వైద్యుడు, రోగికి మధ్య బంధం బలపడుతోంది. మంచానికి పరిమితం అయిన రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. మందుల కొరత తలెత్తకుండా ఎప్పటికప్పుడు వివరాల్ని ట్యాబ్‌లలో నమోదు చేస్తున్నారు.
97 లక్షల మందికి సేవలు
ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 3,11,74,218 జనాభాకు గాను 97,43,726 మంది కనీసం ఒక్కసారైనా (31 శాతం మంది) వైద్య సేవల్ని అందుకున్నారు. ఇప్పటి వరకు 68,24,258 మందికి సాధారణ వైద్య సేవలు, 12,46,335 మంది రక్తపోటు వ్యాధిగ్రస్తులు, 8,73,440 మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు, రక్తపోటు.. మధుమేహం రెండూ ఉన్న వారు 9,21,951 మందికి సేవలందించారు. 4,90,736 మంది గర్భిణిలు, 3,07,140 మంది బాలింతలు, 57,582 మంది రక్తహీనత బాధితులు సేవలు అందుకున్నారు.
కేంద్రం ప్రశంసలు గుర్తు లేవా?
ఇటీవల డెహ్రాడూన్‌లో కేంద్ర ప్రభుత్వం చింతన్ సివిర్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానం ఉత్తమ ఆరోగ్య విధానాల్లో ఒకటి అని కేంద్రం ప్రశంసించింది. వైద్య శాఖలో నియామకాలపై కూడా హర్షం వ్యక్తమైంది. ఈ విషయాలను సైతం విస్మరించి.. రామోజీరావు తప్పుడు రాతలు రాయడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది.
వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ రంగంలో ఏకంగా 53 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పరిధిలో స్పెషలిస్టు వైద్యుల కొరత 61 శాతం ఉండగా, ఏపీలో కేవలం 5 శాతం మాత్రమే ఉంది. ఈ ఖాళీలను కూడా భర్తీ చేయడానికి నిరంతరం మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నియామకాల్ని చేపడుతోంది.
17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఇందులో ఈ ఏడాది నుంచి ఐదు ప్రారంభిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది. ఇవన్నీ మీకు కనిపించడం లేదా రామోజీ?
Comments
Please login to add a commentAdd a comment