గుంటూరు జిల్లా జొన్నలగడ్డలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన హోం మంత్రి సుచరిత (ఫైల్)
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెండేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలతో గ్రామసీమల ముఖచిత్రం సమూలంగా మారిపోతోంది. రాష్ట్రంలో ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కృతం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. గ్రామాల రూపు రేఖలను సమూలంగా మార్చివేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలకు అక్కడే సకల మౌలిక వసతులను కల్పించేందుకు భారీ ఎత్తున పలు అభివృద్ధి కార్యక్రమాలకు వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ, సచివాలయాలకు పక్కా శాశ్వత భవనాల నిర్మాణానికి ఏకంగా రూ.4,186.83 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
రాష్ట్రంలో మొత్తం 10,929 గ్రామ సచివాలయాలకు కొత్త భవనాల నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే 4,418 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం పూర్తయింది. మరో 4,129 పూర్తికానున్న దశలో ఉన్నాయి. ఇంకో 1,822 భవనాలు గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ దశలో ఉన్నాయి. మిగతా భవనాలు బేస్‌మెంట్, వివిధ స్థాయిల్లో ఉండగా వాటి నిర్మాణాలను వేగవంతం చేయాలని ఇటీవల స్పందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే నెలాఖరు నాటికి మొత్తం గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన గ్రామ సచివాలయ భవనాలను ఆయా జిల్లాల్లో మంత్రులు ప్రారంభిస్తున్నారని జైన్ పేర్కొన్నారు. ఈ భవనాల్లో సచివాలయ ఉద్యోగుల కార్యాలయంతో పాటు సమావేశ మందిరం, సందర్శకుల హాలుతో పాటు గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు.
గ్రామాలకు డిజిటల్ విప్లవం
► ప్రస్తుతం మండలాలకే పరిమితమైన వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని గ్రామ సచివాలయాల స్థాయికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామ సచివాలయంలో డిజిటల్ స్క్రీన్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటిని బహుళ ప్రయోజనాలకు వినియోగిస్తారు.
► ముఖ్యమంత్రితో పాటు అధికారులు నేరుగా గ్రామ సచివాలయాల ఉద్యోగులు, లేదా ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ఉపయోగ పడుతుంది. పథకాలతో పాటు లబ్ధిదారుల జాబితాలను ప్రస్తుతం పోస్టర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు.
► పేర్లు, సంఖ్యలో మార్పులు చేయాలంటే మరో పోస్టర్‌ను ప్రదర్శించాల్సి వస్తోంది. అలా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం అందుబాటులోకి వస్తే డిజిటల్ డిస్‌ప్లే ద్వారా లబ్ధిదారుల సంఖ్యను, పథకాలను ప్రదర్శిస్తారు. సెంట్రల్ సర్వర్ నుంచి లబ్ధిదారుల పేర్లు, సంఖ్య మార్చేందుకు వీలు కలుగుతుంది.
► ఏ నెలలో నవరత్నాల్లో ఏ పథకం ఎప్పుడు అమలవుతుందనే వివరాలను కూడా డిజిటల్ డిస్‌ప్లేలో ప్రదర్శిస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కూడా టీవీల ద్వారా తెలియజేస్తారు. దీని వల్ల పోస్టర్ల వ్యయం తగ్గుతుంది.
ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీ
ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ నాటికి సుమారు 4 వేల గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో రెండేళ్లలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది.
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను సకాలంలో అందించేందుకు గ్రామ సచివాలయాన్నింటినీ కంప్యూటరీకరించారు. ప్రభుత్వ పథకాల మంజూరుకు సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా తయారైంది. ఇందుకోసం ప్రత్యేకంగా డిజిటల్ అసిస్టెంట్‌ను నియమించారు.
గ్రామ సచివాలయ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్, రాష్ట్ర సచివాలయ స్థాయి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలతో కూడిన పాలన అంతా ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి వచ్చింది. అర్హులైన లబ్ధిదారులకు పథకాల మంజూరు అంతా ఆన్‌లైన్‌లోనే కొనసాగుతోంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 30,008 కంప్యూటర్లు, 15,004 ప్రింటర్లు, 2,67,224 సెల్‌ఫోన్లను సమకూర్చింది.
Comments
Please login to add a commentAdd a comment