అశేష ప్రజాభిమానం మధ్య వైఎస్ జగన్ పర్యటన ఆలస్యం
జోరు వానలోనూ తరగని జనాభిమానం
దారి పొడవునా అభివాదం చేస్తూ ముందుకు సాగిన జననేత
గ్రామాలకు గ్రామాలు తరలివచ్చి ఘన స్వాగతం
జగన్‌ను చూసేందుకు జనసముద్రమైన వినుకొండ
సాక్షి ప్రతినిధి, గుంటూరు/ సాక్షి అమరావతి: వినుకొండ పర్యటనకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గుంటూరు, పల్నాడు జిల్లాల ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. తాడేపల్లి నుంచి వినుకొండకు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఏడున్నర గంటలు పట్టిందంటే ప్రజల స్పందన ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. రెండు రోజుల కిందట హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న జగన్‌కు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం తెలిపారు.
పల్నాడు జిల్లా వినుకొండలో నడిరోడ్డుపై వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌పై టీడీపీ గూండా జిలానీ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రెండు చేతులు తెగ నరికాడు. అనంతరం కత్తితో మెడ నరికి పాశవికంగా హత్య చేశాడు. ఈ విషయం తెలియగానే బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ హుటాహుటిన బెంగళూరు నుంచి బయలుదేరి తాడేపల్లికి గురువారం సాయంత్రానికి చేరుకున్నారు. రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరగానే పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నేతలు ఆయన్ను అనుసరించారు.
దారి పొడవునా వేలాది మంది పలు కూడళ్ల వద్ద జగన్ కోసం వేచి చూశారు. ఎక్కడికక్కడ జగన్.. వాహనాన్ని ఆపి రెండు చేతులు పైకి ఎత్తి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రతి చోటా వేలాది మంది మేము సైతం మీ వెంటే అంటూ చేతులెత్తి సంఘీభావం తెలిపారు. తాడేపల్లి నుంచి వినుకొండకు వెళ్లాలంటే సాధారణంగా రెండు.. రెండున్నర గంటలు పడుతుంది. కానీ వైఎస్ జగన్ ఉదయం పది గంటలకు బయలుదేరితే వినుకొండలోని రషీద్ ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం ఐదున్నర గంటలు అయ్యింది.
అభిమాన జడి
తాడేపల్లి నుంచి వినుకొండ వరకు వర్షం పడుతూనే ఉన్నా, దారి పొడవునా అశేష జనవాహిని జగన్ వెంట కదలి వచ్చింది. కాజ టోల్ గేట్, పెదకాకాని వై.జంక్షన్‌లో పార్టీ సమన్వయకర్తలు అంబటి మురళీ కృష్ణ, షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు జగన్‌కు స్వాగతం తెలిపారు. కాన్వాయ్ వెంట ఉన్న పలు వాహనాలను పెదకాకాని వై.జంక్షన్ వద్ద బారికేడ్లు అడ్డుపెట్టి నిలిపి వేయడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 30 నిమిషాల తర్వాత వాహనాలను అనుమతించారు.
ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యకర్తలు ఏటుకూరు వద్ద పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం లభించింది. 144 సెక్షన్ అమలులో ఉందంటూ పోలీసులు మైక్‌లో హెచ్చరికలు చేస్తున్నా వెరవక జనం వేలాదిగా తరలి వచ్చారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, అభిమానులు ఎన్‌ఆర్‌టీ సెంటర్ వద్ద జై జగన్ నినాదాల హోరు నడుమ ఘన స్వాగతం పలికారు.
పట్టణంలోని బ్యాంక్ కాలనీ పార్టీ కార్యాలయం వద్ద గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్‌నాయుడు జగన్‌కు స్వాగతం పలికారు. చిలకలూరిపేట మండలం కావూరు, లింగంగుంట్ల గ్రామాల మధ్య ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి స్వాగతం పలికారు. కోమటినేని వారిపాలెం వద్ద, అమీన్‌సాహెబ్‌పాలెం, బసికాపురం గ్రామాల మధ్య కనపర్రు, తదితర గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి అభిమానం చాటుకున్నారు.
జగన్ కోసం జనం ఎదురుచూపులు
నరసరావుపేట నియోజకవర్గంలో జోరువానలోనూ జనం ఎదురు చూశారు. గ్రామ గ్రామాన అపూర్వ స్వాగతం పలికారు. బసికాపురం, ఎస్‌ఆర్‌కెటి జంక్షన్, ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం మీదుగా జగన్ కాన్వాయ్ బాపట్ల జిల్లా సంతమాగులూరు చేరుకుంది. సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద వేలాది మంది అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలు స్వాగతం పలికారు. శావల్యాపురం నుంచి వినుకొండ వరకు జనం ప్రతిచోటా రోడ్లపైకి వచ్చారు.
వినుకొండ పట్టణంలోకి వచ్చిన తర్వాత రషీద్ ఇంటికి వెళ్లడానికి గంటన్నర సమయానికి పైగా పట్టింది. వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లి నుంచి రాజీవ్ రజక కాలనీ, నిర్మలా స్కూల్, డ్రైవర్స్ కాలనీ మీదుగా రషీద్ ఇంటి వరకు ఇసుకేస్తే రాలనంతగా జనం జగన్ కోసం వేచి ఉన్నారు. పలు చోట్ల యువకులు, మíßహిళలు జగన్ ప్రయాణిస్తున్న కారుకు అడ్డుగా నిలిచి బయటకు రావాలని పట్టుబట్టారు. జగన్ బయటకు వచ్చి వారితో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు.
Comments
Please login to add a commentAdd a comment