టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి
తిరుమల: ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వైకుంఠ ఏకాదశి నుంచి వైకుంఠ ద్వార దర్శనం కల్పించే 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై ఆయన సీవీఎస్వో శ్రీధర్‌తో కలిసి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ విభాగాధిపతులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ...పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతించాలన్నారు.
కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులను తిరుమలకు అనుమతించాలన్నారు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్‌ఆర్‌ఐ, మొదలగు వారికి విశేష దర్శనాలను ఆ పది రోజులూ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. గోవింద మాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని స్పష్టం చేశారు.
వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు చేస్తారని తెలిపారు. అలాగే, తిరుమలలో జనవరిలో జరిగే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు భద్రతా అంశాలపై గురువారం ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తిరుమలలో అధికారులతో సమీక్షించారు.
రేపు ’డయల్ యువర్ ఈవో’
టీటీడీ డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం ఈ నెల 28న శనివారం ఉదయం 9–10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగుతుందని టీటీడీ అధికారులు గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్యామలరావుకు ఫోన్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఇందుకుగాను 0877–2263261 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment