గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలలో జరుగుతున్న వర్చువల్ క్లాసులు
సాక్షి, అమరావతి: గత ఏడాది కాలంగా ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభం వల్ల మారుమూల గిరిజన ప్రాంతాల విద్యార్థులు చదువులో వెనుకబడి పోకూడదు అన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అన్ని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో వర్చువల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా 10వ తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పలు సబ్జెక్టుల్లో నిపుణులైన ఉపాధ్యాయుల ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించే కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం 190 గిరిజన సంక్షేమ గురుకుల స్కూళ్లు ఉండగా అందులో 81 స్కూళ్లను హాస్టళ్ల నుంచి కన్వర్ట్ చేశారు. వీటిలో మూడు నుంచి ఆరో తరగతి వరకు విద్యార్థులు ఉంటారు. ఇవి మినహా మిగిలిన అన్ని గిరిజన సంక్షేమ స్కూళ్లలో విద్యార్థులు ఆన్‌లైన్ పాఠాలు వినేందుకు వీలుగా వర్చువల్ క్లాస్ రూములు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోని ఏదైనా ఒక స్కూలు నుంచి ఒక సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ వర్చువల్ క్లాసు చెబుతుంటే ఆ క్లాసును రాష్ట్రంలోని అన్ని గిరిజన గురుకుల స్కూళ్లలోని విద్యార్థులు వినే అవకాశం కల్పించారు. ప్రధానంగా 10వ తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రతిరోజు వర్చువల్ క్లాసులు జరుగుతున్నాయి. కొన్ని సబ్జెక్టుల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులతో కూడా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో క్లాసులు చెప్పిస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతిలో గిరిజన గురుకుల విద్యార్థులు 3,399 మంది ఉన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 5,713 మంది, రెండో సంవత్సరంలో 5,217 మంది చదువుతున్నారు. ఇంటర్ విద్యార్థులకు ప్రధానంగా మ్యాథమ్యాటిక్స్, ఇంగ్లిష్, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం సబ్జెక్టులపై ప్రత్యేకంగా వర్చువల్ క్లాసులు నిర్వహిస్తున్నారు.
మంచి ఫలితాలు వస్తున్నాయి..
హాస్టల్ కన్వర్టెడ్ రెసిడెన్సియల్స్ కాకుండా మిగిలిన అన్ని స్కూళ్లలోనూ వర్చువల్ క్లాసు రూములు ఏర్పాటు చేశాం. వర్చువల్ క్లాసుల నిర్వహణను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం. విద్యార్థులు కూడా సమగ్రంగా అర్థం చేసుకుని తోటి విద్యార్థులకు క్లాసులు చెబుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. దీని వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి.
– గిరిజన సంక్షేమ గురుకుల కార్యదర్శి కె శ్రీకాంత్ ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment