
ఆనందపురం కూడలిలో విద్యార్థి లోకేశ్వరరావుతో మాట్లాడుతున్న డీఈవో చంద్రకళ
తగరపువలస (భీమిలి)/విశాఖపట్నం: ఇంటిలో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో స్కూల్‌కు వెళ్లకుండా వెల్డింగ్ పనికి వెళ్లిన ఓ విద్యార్థికి డీఈవో చంద్రకళ అండగా నిలిచారు. పనికెళ్తే వచ్చే డబ్బులు తానే ఇస్తానని, చక్కగా చదువుకోవాలని హితవు పలికారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆనందపురం జెడ్పీ హైస్కూల్‌ను డీఈవో చంద్రకళ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో వసతులు, సిలబస్ బోధనపై అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం, నాణ్యత, రుచిపై ఆరా తీశారు.
చదవండి: కిరాతక దుశ్చర్య.. కూరతో భోజనం పెట్టలేదని..
అనంతరం పదో తరగతి విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. హాజరుకాని వారి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా గొంప లోకేశ్వరరావు అనే విద్యార్థి ఆర్థిక ఇబ్బందులతో వెల్డింగ్ షాపులో పనికి వెళ్తున్నట్టు తెలుసుకున్నారు. వెంటనే ఆనందపురం కూడలిలో లోకేశ్వరరావు పనిచేస్తున్న వెల్డింగ్‌షాపు వద్దకు ఉపాధ్యాయులు సాయంతో వెళ్లి మాట్లాడారు. చదువు కోసం ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను వివరించారు. మధ్యలో చదువు ఆపేయవద్దని కోరారు. పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు వెల్డింగ్ పనులకు వెళ్తే ఎంత వేతనం వస్తుందో ఆ మొత్తం తాను సమకూరుస్తానని ఆమె భరోసా కల్పించారు. అలాగే హాస్టల్‌లో ఉండి చదువుకునేలా చర్యలు తీసుకుంటానని లోకేశ్వరరావుకు హామీ ఇచ్చారు. ఆమె వెంట ప్రధానోపాధ్యాయుడు బి.శ్రీనివాసరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment