
ఆరిలోవ(విశాఖ తూర్పు): పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఎన్‌జీ బస్సులు నడుపుతూ ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది విశాఖ వ్యాలీ స్కూల్. ఇటీవల పాఠశాల యాజమాన్యం కంప్రెస్ట్ నేచురల్ గ్యాస్(సీఎన్‌జీ)తో నడిచే ఆరు బస్సులను కొనుగోలు చేసింది. పాఠశాల విద్యార్థుల కోసం ఈ బస్సులను నడుపుతోంది. కొన్నేళ్లుగా నడుస్తున్న బస్సులు మరమ్మతులకు గురి కావడంతో.. వాటి స్థానంలో డీజిల్‌తో నడిచేవి కాకుండా సీఎన్‌జీ బస్సులు కొనుగోలు చేసింది.
డీజిల్‌తో నడిచే బస్సుల కారణంగా అధిక శాతం నల్లని పొగ బయటకు వస్తుంది. దీని వల్ల పర్యావరణానికి చాలా నష్టం. అదే సీఎన్‌జీ బస్సులతో నగరానికి కాలుష్య ముప్పు తక్కువ. అందులో భాగంగానే విశాఖ వ్యాలీ పాఠశాల యాజమాన్యం సీఎన్‌జీ బస్సులను కొనుగోలు చేసి.. ప్రైవేట్ పాఠశాలలకు ఆదర్శంగా నిలిచింది. సాధారణంగా డీజిల్‌తో నడిచే బస్సుల కంటే ఈ బస్సులు ఎక్కువ మైలేజీ ఇస్తాయని డ్రైవర్లు చెబుతున్నారు.
డీజిల్ బస్సులు లీటర్‌కు 5 నుంచి 6 కిలోమీటర్లు నడుస్తాయి. అదే సీఎన్‌జీ బస్సులు ఓ కిలో గ్రాము గ్యాస్‌తో 7 నుంచి 8 కిలోమీటర్ల దూరం నడుస్తాయని చెబుతున్నారు. వీటి వల్ల కార్బన్ డయాక్సైడ్ చాలా తక్కువగా వెలువడుతుంది. వాతావరణం కాలుష్యం కాకుండా తమ వంతు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నామని ఇక్కడ యాజమాన్యం చెబుతోంది. ఇటీవల కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ ఈ బస్సులను ప్రారంభించారు. ఈ బస్సులను పలు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు పరిశీలిస్తున్నాయి. ఎక్కువ మైలేజీతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఉపయుక్తంగా ఉండటంతో.. వీటిని నడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
బస్సులో సౌకర్యాలు
విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఈ బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇద్దరు విద్యార్థులకు ఒక సీటు చొప్పున కేటాయించారు. ప్రతి బస్‌లో 40 మంది విద్యార్థులు ప్రయాణించవచ్చు. ఇందులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ సిద్ధం చేశారు. బస్ వెనుక భాగం కిందన సీఎన్‌జీ సిలిండర్ల క్యాబిన్ ఉంటుంది.
అన్ని బస్‌లు సీఎన్‌జీవే నడుపుతాం
భవిష్యత్‌లో అన్నీ సీఎన్‌జీ బస్సులు నడపాలనే ఆలోచనలో ఉన్నాం. ఇక్క డ విద్యార్థుల అవసరానికి తగినట్లు 13 బస్సులున్నాయి. వాటిలో ఆరు మరమ్మతులకు గురయ్యాయి. వాటి స్థానంలో సీఎన్‌జీ బస్సులు కొనుగోలు చేశాం. వీటి వల్ల కాలుష్యం ఉండదు. అతి తక్కువగా కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. పర్యావరణం పరిరక్షణ కోసం మా వంతు కృషి చేస్తున్నాం.
– ఈశ్వరి ప్రభాకర్, ప్రిన్సిపాల్, విశాఖ వ్యాలీ స్కూల్