సాక్షి, విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మి తాము మోసపోయామన్నారు విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతలు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి నేతలు అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు.
కాగా, ఉక్కు పోరాట కమిటీ నేత వరసాల శ్రీనివాస్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘పోరాట కమిటీ సభ్యులందరం సీఎం చంద్రబాబుని కలిశాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరాం. ఈ సందర్భంగా చంద్రబాబు.. మీరు మాట్లాడొద్దు నేను చెప్పింది వినండి.. మీరు రాజకీయాలు చేయద్దు.. పని చేయండి అని అన్నారు. మేము పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ముడి సరుకు లేదని చెప్పినా ఆయన వినిపించుకోలేదు. ఆయన మాటలు మమ్మల్ని తీవ్రంగా కలచివేశాయి.
ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్‌ను కాపాడతామని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవుతున్నా కనీస స్పందన లేదు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకోవాలి. కేంద్రంలో మనపై ఆధారపడి పనిచేసే ప్రభుత్వం వచ్చింది. ఇలాంటి సందర్భంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. ప్లాంట్‌లో ఏ నిమిషంలో ఏదైనా జరగవచ్చు. బ్లాస్ట్ ఫర్నీచర్ దెబ్బతింటే మళ్ళీ రివైవల్ చేయడం అతి కష్టం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment