
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారతదేశ ఆర్థికాభివృద్ధిలో విశాఖ నగరం పాత్ర కీలకమైందని మిజోరం గవర్నర్ కె.హరిబాబు అన్నారు. విశాఖలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన బిజినెస్ కాంక్లేవ్ ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏపీలో ఉన్నాయన్నారు. ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు దేశంలో హైదరాబాద్ తర్వాత విశాఖ అనుకూలమని చెప్పారు.
ఏపీ సహజ వనరులు కలిగిన రాష్ట్రమని తెలిపారు. 954 కి.మీ తీరం కలిగి ఉండటం రాష్ట్రం అదృష్టమన్నారు. విశాఖలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు తిరుగులేదని చెప్పారు. ఉమ్మడి ఏపీ అయినా, విభజిత ఏపీ అయినా పరిశ్రమల ఏర్పాటుకు విశాఖ మంచి నగరమన్నారు. జల, రోడ్డు, వాయు మార్గాలు ఉన్న ప్రధాన నగరాల్లో విశాఖ ఒకటని గుర్తు చేశారు.
ఐదేళ్లుగా ప్రముఖ ఫార్మా కంపెనీలు విశాఖలో తమ యూనిట్లను స్థాపించేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఏపీ కేవలం పరిశ్రమల ఏర్పాటులోనే కాకుండా వ్యవసాయ రంగ ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ దేశంలో ముందు వరుసలో ఉందన్నారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 35 శాతం ఉందని చెప్పారు. రాష్ట్రంలో పండించే పండ్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉందన్నారు.
త్వరలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన: మంత్రి అమర్‌నాథ్
మరో రెండు నెలల్లో భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. రాష్ట్ర జనాభాలో 71 శాతం మంది పని చేయగలిగిన సామర్థ్యం ఉన్నవారేనన్నారు. ప్రపంచంలో ఐటీ రంగంలో ఉన్న ప్రముఖుల్లో 25 శాతం మంది తెలుగువారేనని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment