రైల్వే స్టేషన్ ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా, వినోదమయంగా, విజ్ఞానవంతంగా వెలుగులీనుతూ మీకు స్వాగతం పలుకుతోంది. మీరు వచ్చింది ఎయిర్‌పోర్టుకా లేదా రైల్వేస్టేషన్‌కేనా అనే సందేహమే అవసరం లేదు. ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా ఈ ప్రగతిని పట్టాలెక్కించారు.
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఎన్నో ప్రత్యేకతలతో, మరెన్నో విశేషాలతో స్వాగతం చెబుతోంది. కరోనా లాక్‌డౌన్ వేళల్లో సైతం నిత్యం జాగ్రత్తలు వహిస్తూ ఇక్కడ ఆధునికీకరణ పనులు పూర్తి చేశారు. ఒకటో నెంబర్ ప్లాట్ ఫారం మీద వీఐపీ లాంజ్, మూడో నెంబర్ గేట్ వద్ద ప్రవేశ ద్వారం, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల వంటి నిర్మాణాలు చేపట్టారు. వీటిలో కొన్ని పూర్తవగా మరికొన్నిటి పనులు చకచకా సాగుతున్నాయి. వృద్ధులు, చిన్న పిల్లలకు అవసరమైన ప్రత్యేక సేవలు మొదలు, కనువిందు చేసే పచ్చటి గార్డెన్లు, చరిత్ర సాక్ష్యాలు తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్, జాతిపిత జీవితంలో ప్రధాన ఘట్టాలను ఆవిష్కరింపచేసేలా శిల్పాలు, పనికిరాని వస్తువులతో తయారు చేసిన ప్రత్యేక పరికరాలు, వాడి వదిలేసిన భారీ క్రేన్, రైలింజన్ వంటి ఎన్నో ప్రత్యేకతలతో మన రైల్వేస్టేషన్ ఆహ్వానం పలుకుతోంది.
ఆకర్షణీయంగా ప్రవేశ ద్వారాలు
అందమైన ప్రవేశ ద్వారాలతో మన స్టేషన్ ముస్తాబైంది. ఇంత వరకూ కరోనా కారణంగా పరిమిత ద్వారాలను మాత్రమే వినియోగించారు. ఇప్పుడు అన్ని ద్వారాలు అందుబాటులోకి రావటంతో స్టేషన్ పరిసరాలు చాలా అందంగా మారిపోయాయి. గతంలో వర్షం వస్తే చాలామంది బయట తడిసిపోయేవారు. ఇప్పుడు శ్లాబులను పెంచడంతో ప్రయాణికులు చాలావరకు ఎండా, వానల నుంచి రక్షణ పొందవచ్చు.
కుడ్య చిత్రాలలో అహింసామూర్తి
ఇక ఈ ప్రవేశ ద్వారం పక్కనే ఏర్పాటు చేసిన మహాత్మా మ్యూరల్ ఆర్ట్ మరో ప్రత్యేక ఆకర్షణ. జాతిపిత జీవితంలో సంభవించిన ప్రధాన ఘట్టాలతో ఈ కుడ్య చిత్రకళను వాల్తేర్ డివిజన్‌కు చెందిన ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు ఇక్క డ గోడలపై అద్భుతంగా ఆవిష్కరించారు. వివిధ సంవత్సరాల్లో జరిగిన సత్యాగ్రహ, సహాయ నిరాకరణోద్యమం, దండిమార్చ్, క్విట్ ఇండియా మూవ్‌మెంట్, సబర్మతి ఆశ్రమం నమూనా, సౌత్ ఆఫ్రికా రైలు ఘటన, ఖాదీ గ్రామోద్యోగ్, జాతిపిత సమాధి వంటి వాటిని కనుల ముందు సాక్షాత్కరింపజేశారు. ఇక ప్రధాన ప్రవేశద్వారం ఒకటో నెంబర్ గేట్ ఎదురుగా స్వచ్ఛ భారత్ లోగో కనువిందు చేస్తుంది. దాని నేపథ్యంలో పచ్చదనం మరో విశేష ఆకర్షణ.
నూరేళ్ల సేవలకు నిలువెత్తు దర్పణం
విశాఖ రైల్వేస్టేషన్‌లో 1887–1988 వరకు వందేళ్లు సేవలందించిన పర్లాకిమిడి లైట్‌రైల్ ప్రధాన ద్వారం పక్కనే మరో అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. నాటి సౌత్ ఈస్ట్రన్ రైల్వే పరిధిలో పర్లాకిమిడి లైట్ రైల్వే పేరిట నౌపడా–గుణుపూర్ మధ్య దాదాపు 100 సంవత్సరాలు ఈ లైట్ రైల్ సేవలందించింది. దానికి గుర్తుగా అదే ఇంజిన్, బోగీలను ఇక్కడ ప్రదర్శనార్థం ఉంచారు. జ్ఞానాపురం వైపు గల ప్రవేశాల వద్ద ఏర్పాటు చేసిన గ్లోబ్, గిటార్ కళ్లు తిప్పుకోనీయవు. అప్పట్లో విశేష సేవలందించిన భారీ క్రేన్‌లను చూస్తే వాటిని మలచిన వారి కళా దృష్టి, చక్కటి పని తీరు ఎప్పటికీ మన మదిలో కదలాడుతుంది. వాల్తేర్ డివిజన్‌కు చెందిన డీజిల్ లోకో షెడ్ సిబ్బంది వీటిని పనికిరాని, వాడి వదిలేసిన ఇనుప పనిముట్లతో తయారు చేశారు. జ్ఞానాపురం వైపే రైల్వేలో అప్పట్లో ఎంతోకాలం సేవలందించిన భారీ క్రేన్‌ను కూడా సందర్శన కోసం ఉంచారు.
చరిత్ర చిత్రాలు
ఒకటో నెంబర్ ప్రధాన ద్వారం పక్కనే విశాఖపట్నం రైల్వే, వాల్తేర్ డివిజన్ చరిత్రను తెలియజేసే అలనాటి ఫొటోలెన్నో మనకు చరిత్రను తెలియజేస్తాయి. కేకే లైన్‌లో నాటి నిర్మాణ శైలి, తొలి రైల్వేస్టేషన్, ఇలా రైల్వే చరిత్రను మనకు సాక్షాత్కరింపజేస్తుంది.
చదవండి: వైఎస్సార్‌కు భారతరత్న ఇవ్వాలి
Comments
Please login to add a commentAdd a comment