అస్త్ర పరీక్షల కేంద్రంగా విశాఖ | Visakhapatnam Will Become The Focal Point For Naval Weapons Tests | Sakshi
Sakshi News home page

అస్త్ర పరీక్షల కేంద్రంగా విశాఖ 

Published Sat, Aug 27 2022 8:36 AM | Last Updated on Sat, Aug 27 2022 11:26 AM

Visakhapatnam Will Become The Focal Point For Naval Weapons Tests - Sakshi

నౌకాదళ ఆయుధ పరీక్షలకు విశాఖ కేంద్ర బిందువుగా మారనుంది. ప్రధానంగా సముద్రంలో జరిగే యుద్ధాల్లో వినియోగించే ఆయుధాల పరీక్షా కేంద్రాన్ని రక్షణ శాఖ నెలకొల్పుతోంది. ఇలాంటి కేంద్రం దేశంలో విశాఖలోనే ఏర్పాటు కానుండటం గమనార్హం. అలాగే క్షిపణులు, రాకెట్ల పరీక్షా కేంద్రం కూడా ఇక్కడ నిర్మితమవుతోంది. భారీ టార్పెడోల పరీక్షలకూ ఈ కేంద్రాన్ని వినియోగించుకునే వీలుంది. తీర ప్రాంత రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఈఎన్‌సీ (ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌) స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో  ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది.  

భీమిలిలో క్షిపణులు, రాకెట్ల పరీక్ష కేంద్రం 
ఇప్పటికే యుద్ధ నౌకలు, సబ్‌ మెరైన్ల స్థావరంగా ఉన్న విశాఖ తీరం తాజాగా మరో రెండు ముఖ్యమైన రక్షణ వ్యవస్థలకు కేంద్రంగా మారుతోంది. దేశంలోనే తొలిసారిగా భారీ టార్పెడోలు, అండర్‌ వాటర్‌ వెపన్స్‌ పరీక్ష కేంద్రాన్ని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌) నిర్మించనుంది. భీమిలిలో అన్ని రకాల క్షిపణులు, రాకెట్లను పరీక్షించే కేంద్రం ఏర్పాటుకు తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ దాస్‌గుప్తా ఇటీవల శంకుస్థాపన చేశారు.  

రెండు టన్నుల భారీ టార్పెడోలను సైతం... 
గత జూలైలో గుజరాత్‌ తీరంలోని భారత సముద్ర జలాల పరిధిలోకి పాకిస్థాన్‌కు చెందిన యుద్ధనౌక (పీఎన్‌ఎస్‌ అలంగీర్‌) చొచ్చుకురావడం తీవ్ర చర్చనీయాంశమైంది. మన నౌకాదళాలు వెంటనే గుర్తించడంతో పాకిస్థాన్‌ పాచికలు పారలేదు. మహారాష్ట్ర తీర ప్రాంతంలో కూడా ఓ విదేశీ చిన్న పడవ ఆయుధాలతో వచ్చింది. అయితే అది ఆస్ట్రేలియన్‌ దంపతులదని తేలింది. తీర రక్షణ ఎంత కీలకమన్న విషయాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పు నౌకాదళ కేంద్రంగా ఉన్న విశాఖ తీరంలో ఎన్విరాన్‌మెంటల్‌ టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటు బాధ్యతను ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా బీడీఎల్‌కు అప్పగించారు. ఇప్పటికే టార్పెడోలు, అండర్‌ వాటర్‌ వెపన్స్‌ తయారీ యూనిట్‌ను భారత్‌ డైనమిక్స్‌ విశాఖలోనే ఏర్పాటు చేసింది. అయితే వాటిని పరీక్షించే కేంద్రం లేకపోవడంతో దాన్ని కూడా విశాఖలోనే ఏర్పాటు చేయాలని నౌకాదళం నిర్ణయించింది. దీనిలో భాగంగా 8 మీటర్ల పొడవు, 2 టన్నుల బరువైన భారీ టార్పెడోల్ని సైతం ఈ టెస్టింగ్‌ సెంటర్‌లో పరీక్షించేలా అత్యాధునిక వైబ్రేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. థర్మల్‌ చాంబర్, వాకింగ్‌ చాంబర్లను ఏర్పాటు చేసి అండర్‌ వాటర్‌ వెపన్స్‌నూ అణువణువూ పరీక్షించేలా యూనిట్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. 

విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం 
వైబ్రేషన్‌ టెస్ట్‌లతో పాటు పర్యావరణహిత పరీక్షలు కూడా ఇందులో నిర్వహించేలా ఏర్పాటవుతున్న ఈ పరీక్ష కేంద్రం నిర్మాణం పూర్తయితే భవిష్యత్తులో అండర్‌వాటర్‌ వెపన్స్, టార్పెడోల్ని మిత్ర దేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం లభిస్తుంది. క్రమంగా టార్పెడోలతో పాటు ఉపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే క్షిపణులు, యుద్ధ విమానాలతో పాటు గగనతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఆయుధాలు, యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్స్‌నూ ఎగుమతి చేసే స్థాయికి భారత్‌ చేరుకుంటుందని ఈ సందర్భంగా నౌకాదళాధికారులు భావిస్తున్నారు. 

ఇతర ప్రయోగాలకూ వేదికగా భీమిలి
సముద్ర గర్భంలో ఆయుధాలతో పాటు రాకెట్లు, క్షిపణులనూ పరీక్షించేందుకు వీలుగా భీమిలిలో స్టాటిక్‌ టెస్ట్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటవుతోంది. ఐఎన్‌ఎస్‌ కళింగ సమీపంలోని కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ నేవల్‌ ఆర్న్‌మెంట్‌ టెస్టింగ్‌ కాంప్లెక్స్‌(సీఎన్‌ఏఐ)– ఈస్ట్‌ కాంప్లెక్స్‌లో దీన్ని నిర్మించేందుకు తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌దాస్‌ గుప్తా కొద్దిరోజుల కిందట శంకుస్థాపన చేశారు. సుమారు రూ.4.40 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. అన్ని రకాల క్షిపణులు, రాకెట్లను పరీక్షించడంతో పాటు వాటి జీవితకాలాన్ని పొడిగించేలా మార్పులు, ఇతర ప్రయోగాలకు వేదికగా భీమిలి మారనుంది.  

ఏర్పాటైన సంవత్సరం    – 1968 మార్చి 1    
కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌    – త్రీ స్టార్‌ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ (వైస్‌ అడ్మిరల్‌ ర్యాంక్‌) 
ప్రస్తుత వైస్‌ అడ్మిరల్‌    – బిస్వజిత్‌ దాస్‌గుప్తా 
బలం    – 58 యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లు 
ఫ్లాగ్‌ షిప్‌    – ఐఎన్‌ఎస్‌ జలశ్వ 
ఈఎన్‌సీ పరిధిలో నేవల్‌ బేస్‌లు     – 15 
విశాఖలో నేవల్‌ బేస్‌లు     – 8 
కొత్తగా నిర్మిస్తున్న నేవల్‌ బేస్‌లు     – విశాఖలో–1, ఒడిశాలో 2 
తూర్పు నౌకాదళం సిబ్బంది, అధికారులు  – సుమారు 40,500 మంది 
(కె.జి.రాఘవేంద్రారెడ్డి – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement