సాక్షి, విశాఖపట్నం:మరోసారి అంతర్జాతీయ విన్యాసాలకు వేదికగా నిలిచేందుకు విశాఖ మహానగరం సన్నద్ధమవుతోంది. 2016లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నిర్వహించి.. సత్తా చాటిన మహా నగరం.. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ప్రతిష్టాత్మకమైన మిలాన్ విన్యాసాలకు ఆహ్వానం పలుకుతోంది. నౌకాదళ విభాగంలో కీలకమైన మిలాన్ కోసం భారీ ఏర్పాట్లు చేసేందుకు ఇండియన్ నేవీ ఏడాది కాలంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే భారత నౌకాదళం 46 దేశాలకు ఆహ్వానం పంపగా.. 30 దేశాలు పాల్గొంటున్నట్లు ఇప్పటికే అంగీకారం తెలిపాయి.
మిలాన్ అంటే.. హిందీలో సమావేశం అని అర్థం. 2018 అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన ఈ విన్యాసాల్లో 17 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి అంతకు మించి భారీ ఏర్పాట్లకు ఈఎన్‌సీ సమాయత్తమవుతోంది. వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరుచుకోవడంతో పాటు శత్రుసైన్యానికి బలం, బలగం గురించి నిత్యం తెలియజేసేందుకు ఈ విన్యాసాలు నిర్వహిస్తుంటారు. మార్చిలో జరగనున్న మిలాన్ బహుపాక్షిక విన్యాసాలకు భారత నౌకాదళం సారధ్యం వహించనుంది. వాస్తవానికి 2020 మార్చి 19 నుంచి 27 వరకూ మిలాన్ విన్యాసాలు జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. 2021 మార్చిలో నిర్వహించాలని భావించినా కరోనా పరిస్థితులు అనుకూలించకపోవడంతో మరోమారు వాయిదా వేశారు.
ఇప్పటివరకు 11 మిలాన్‌లు
1995లో మిలాన్ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. తొలిసారి జరిగిన విన్యాసాల్లో భారత్‌తో పాటు ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. రెండేళ్లకోసారి నిర్వహించే మిలాన్‌లో ఏటా దేశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2005లో సునామీ రావడం వల్ల మిలాన్ విన్యాసాలు రద్దు కాగా, 2001, 2016 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలు నిర్వహించడం వల్ల జరగలేదు. 2010 వరకూ 8 దేశాలు మాత్రమే పాల్గొనగా.. 2012లో జరిగిన విన్యాసాల్లో దేశాల సంఖ్య రెట్టింపై ఏకంగా 16 దేశాలు పాల్గొన్నాయి. 2014లో 17 దేశాలు పాల్గొని అతి పెద్ద ఫ్లీట్ రివ్యూగా చరితకెక్కింది. 2018లో అండమాన్ నికోబార్ కమాండ్‌లో జరిగిన విన్యాసాల్లో ఏకంగా 17 దేశాలు పాల్గొన్నాయి. మొత్తంగా ఇప్పటి వరకూ 10 సార్లు మిలాన్ విన్యాసాలు జరిగాయి.
అతి పెద్ద మిలాన్‌గా రికార్డుకు అవకాశం
మిలాన్–2022 విన్యాసాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే భారత నౌకాదళం దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలకు ఆహ్వానాలు అందించింది. భారత్‌తో పాటు యూఎస్‌ఏ, రష్యా, జపాన్, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఫ్రాన్స్, ఈజిప్ట్, శ్రీలంక, వియత్నాం, మోజాంబిక్, సూడాన్, ఇజ్రాయిల్, ఖతర్, థాయ్‌లాండ్, మలేషియా, సోమాలియా, కెన్యా, మయన్మార్, న్యూజిలాండ్, టాంజానియా, కొమరోస్, మాల్దీవులు, బ్రూనే, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, ఒమన్, కాంబోడియా, దక్షిణ కొరియా, కువైట్, ఇరాన్, మడగాస్కర్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, యూఏఈ, జిబౌటీ, ఎరిత్రియా, మారిషస్, సీషెల్స్ మొదలైన దేశాలకు భారత నౌకాదళానికి చెందిన ప్రతినిధులు ఆహ్వానాలు అందించారు.
ఇందులో ఇప్పటికే 30 దేశాలు తాము పాల్గొంటున్నట్లు అంగీకారం తెలిపాయి. మిగిలిన దేశాలూ వచ్చే అవకాశాలున్నాయి. 30 దేశాలు రానున్న నేపథ్యంలో అతి పెద్ద మిలాన్‌కు వేదికగా విశాఖ రికార్డు సృష్టించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి పలుమార్లు ప్రణాళిక సమావేశాల్ని నిర్వహించారు. తొలి సమావేశంలో 17 దేశాలకు చెందిన 29 మంది నౌకాదళ కీలకాధికారులు పాల్గొనగా.. తాజాగా విశాఖలోని వివిధ ప్రభుత్వ అధికారులతో తూర్పునౌకాదళం సమీక్ష నిర్వహించింది. ఏర్పాట్లు విషయంపై సుదీర్ఘంగా చర్చించింది.
రెండు ఫేజ్‌లలో..
మిలాన్–2022 విన్యాసాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తూర్పు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. సీ ఫేజ్, హార్బర్ ఫేజ్‌లలో రెండు ఫేజ్‌లలో విన్యాసాలు నిర్వహించనున్నారు. చరిత్రాత్మకమైన ఈవెంట్ విజయవంతం చేసేందుకు విశాఖ ప్రజలంతా కృషి చెయ్యాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరలోనే తేదీలు ఖరారు చేయనున్నట్లు నౌకాదళాధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment