Volunteers About CM YS Jagan And Volunteer System - Sakshi
Sakshi News home page

వాలంటీర్ల భావోద్వేగం.. హేళన చేసిన వాళ్లే ఇప్పుడు పొగుడుతున్నారు..

Published Fri, May 19 2023 1:43 PM | Last Updated on Fri, May 19 2023 2:21 PM

Volunteers About Cm Ys Jagan And Volunteer System - Sakshi

సాక్షి, విజయవాడ: వరసగా మూడో ఏడాది.. ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రదానం చేశారు. విజయవాడ ఎ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, వాలంటీర్లు ఏమన్నారంటే.. వారి మాటల్లోనే

సీఎం ఆలోచన ఎంత గొప్పదో అర్ధమవుతుంది. మంత్రి బూడి ముత్యాలనాయుడు
అందరికీ నమస్కారం, ఈ రోజు మీరంతా వాలంటీర్లుగా ఎంపిక కాబడి, మన ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఎప్పుడు వచ్చింది అంటే సీఎం సచివాలయాలను ఏర్పాటుచేసి, ఉద్యోగులను, వాలంటీర్లను నియమించి మీకు అధికారాలు కల్పించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారు. ఈ రోజు అవార్డులు పొందుతున్న వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నా.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మీరు ప్రతి ఇంటికి వెళ్ళి అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు గురించి చెబుతున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా ఏ అవ్వాతాతను అడిగినా పెన్షన్ల గురించి చెబుతున్నారు, కానీ ఈ ప్రభుత్వంలో తెలవారకముందే మా తలుపుతట్టి చిరునవ్వుతో పలకరించి పెన్షన్లు ఇస్తున్నారు. ఇలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నాయంటే వాలంటీర్లే కారణం, సీఎం ఆలోచనా విధానం ఎంత గొప్పదో అర్ధమవుతుంది. వాలంటీర్లు చాలా చక్కగా పనిచేస్తున్నారు, మరింత బాధ్యతలు తీసుకుని మరింత మంచిపేరు వచ్చేలా ముందుకుసాగాలని కోరుకుంటున్నాను.

దేశమంతా కొనియాడుతున్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్
అందరికీ నమస్కారం, వాలంటీర్లకు నా అభివందనాలు, జగనన్న ప్రజలకు మేలు చేసేది ఏదైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకు తీసుకెళతారు. వాలంటీర్‌ వ్యవస్ధ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా సంక్షేమ ఫలాలు చిట్టచివరి కుటుంబానికి అందించేలా చేసిన ఆలోచన సీఎంగారిది. వాలంటీర్లలోని 76 శాతం మంది యువత, అందులో మహిళలు 53 శాతం ఉన్నారు, జగనన్న పిలుపు మేరకు మీరు గొప్పగా ప్రజాసేవ చేస్తున్నారు.

అవినీతి రహితంగా సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలనే నినాదంతో వాలంటీర్లు ముందుకెళుతున్నారు. గత పాలకులు జన్మభూమి కమిటీల ద్వారా లబ్ధిదారులను గుర్తించారు. ఆ కమిటీల అరాచకాలకు ప్రజలు విసిగి వేశారారు. ఈ వ్యవస్ధను ఏర్పాటుచేసినప్పుడు వారిని అవహేళన చేశారు, కానీ ఇప్పుడు అందరు గుర్తించారు, కరోనా సమయంలో, వరదల సమయంలో ప్రాణాలు సైతం తెగించి మీరు చేసిన సేవలు, తెగువను దేశమంతా కొనియాడుతున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్ధను ఫాలో అవుతున్నాయి, పట్టణ ప్రాంతాల్లో 67 వేల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఈ పురస్కారాలతో మీరు మరింత స్పూర్తితో చక్కగా పనిచేయాలి, జగనన్నే మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్‌ అనే నినాదంలో మనం గొంతుకలుపుదాం, ఆయన్ను మళ్ళీ మళ్ళీ సీఎం చేద్దాం. 

ఈ వ్యవస్ధలో భాగస్వామినైనందుకు గర్విస్తున్నా..
సార్, నమస్కారం, ఈ వాలంటీర్‌ వ్యవస్ధలో నేను కూడా ఒక భాగస్వామినైనందుకు గర్విస్తున్నాను. మాకు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు సంతోషిస్తున్నాను. నా సర్వీసులో రెండు మూడు సంఘటనలు నా మనసుని కదిలించాయి. రైస్‌ కార్డు విషయంలో నేను డేటా కలెక్షన్‌ కోసం ఇంటింటికీ వెళ్లినప్పుడు ఒక లబ్ధిదారుడు చాలా ఆవేదనతో చెప్పాడు. గత ప్రభుత్వంలో అధికారుల చుట్టూ జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి అలసిపోయానని, అయినా నాకు రేషన్‌ కార్డు రాలేదన్నాడు, మీరు అయినా మంజూరు చేస్తారా అంటే వెంటనే నేను అతని రేషన్‌ కార్డు అర్హతను పరిశీలించి కార్డు కోసం అప్లై చేశాను.

కేవలం 4 గంటల్లో కార్డు అప్రూవ్‌ అవడంతో నేను అతని చేతిలో కార్డు పెట్టాను, ఆ సంతోషంతో అతను జగనన్నకు రుణపడి ఉంటామన్నారు, కొంతమంది వాలంటీర్లంటే మూటలు మోసేవారని విమర్శలు చేశారు.  కానీ మేం మోసింది మూటలు కాదు, మీరు అప్పగించిన బాధ్యతను మా భుజస్కందాలపై వేసుకుని మోశాం, కరోనా సమయంలో సేవలు చేసి వారిని ఆదుకున్నాం, ఇలాంటి వ్యవస్ధను రూపొందించిన మీకు రుణపడి ఉంటాం. మరొక సంఘటన చూస్తే ఒక వికలాంగ మహిళ తనకు అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ చేయించుకుని మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో ఉంది. ఆమె ఫోన్‌ చేసి నేను ఫలానా సమస్యతో హాస్పిటల్‌లో ఉన్నాను.
చదవండి: వాలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపుమంట: సీఎం జగన్‌

నువ్వు ఇక్కడికి వచ్చి పెన్షన్‌ ఇస్తే రవాణా ఖర్చులు కూడా ఇస్తానంది, కానీ నాకు వద్దని తిరస్కరించి నేను ఆసుపత్రికి వెళ్ళి పింఛన్‌ ఇచ్చాను. ఆమె భావోద్వేగానికి గురై నాకు నమస్కరించింది. కానీ నన్ను పంపింది జగనన్న కాబట్టి అన్నకు నమస్కరించు అన్నాను. చాలా సంతోషమేసింది. వాలంటీర్లు రాత్రిపూట వెళ్ళి తలుపులు కొట్టారని విమర్శలు చేశారు కానీ మేం తలుపులు కొట్టింది తెల్లవారుజామున పింఛన్లు ఇవ్వడానికి, కరోనా సమయంలో మన ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరూ చర్చించుకున్నారు. మమ్మల్ని విమర్శించిన వారే మళ్లీ ఇప్పుడు పొగుడుతున్నారు. నేను కాలర్‌ ఎత్తుకుని చెబుతున్నాను. నాకు గర్వంగా ఉంది. మాకు ప్రజల ఆశీస్సులు. ఆశీర్వాదాలే మరింత పెద్దవి. మా వాలంటీర్ల అందరి తరపునా మా ధైర్యం, మా నమ్మకం, మా భవిష్యత్‌ మీరే. ధ్యాంక్యూ జగనన్నా.
-ఉప్పాల నరేష్, వాలంటీర్, విజయవాడ అర్భన్‌ మండలం

ఆయన కళ్లలో సంతోషం ఎప్పటికీ మరిచిపోలేను..
జగనన్నా నమస్కారం, నాకు కేటాయించిన క్లస్టర్‌లోని 75 కుటుంబాలలో 62 కుటుంబాలకు నేను సంక్షేమ పథకాలు అందజేశాను. పెన్షన్‌ కానుక గురించి ఒక పెద్దాయనకు ఈ కేవైసీ చేయించాలని వెళితే ఆయనకు ఇల్లు లేదు.. సమాధుల పక్కన చెట్టు కింద ఉన్నారు.. నాకు బాధ వేసి ఓల్డేజ్‌ హోంలో చేర్చాను.. తర్వాత పెన్షన్‌ ఇవ్వడానికి వెళ్ళి కలసినప్పుడు ఆయన కళ్లలో చూసిన సంతోషం నేను ఎప్పటికీ మరిచిపోలేను. పేదలందరికీ ఇల్లు పథకం కింద నా క్లస్టర్‌లో ఒక మహిళకు ఇంటి పట్టా వచ్చిందని సంతోషంగా చెప్పి నాకు ఆడపిల్లలు లేరు నువ్వే వచ్చి పాలు పొంగించాలని చెప్పినప్పుడు సంతోషమేసింది. ఈ గౌరవం జగనన్నా మీ వల్లే దక్కింది. మరొక ఆమెకు నేను కొత్త రేషన్‌ కార్డు, ఫించన్‌ ఇవన్నీ ఇప్పిస్తే ఆమె నా కన్నబిడ్డ కూడా ఇంత చేయలేదంటే నాకు చాలా సంతోషమేసింది, అవన్నీ కూడా మీకే జగనన్నా, ధ్యాంక్యూ.
-హేమ, వాలంటీర్, విజయవాడ తూర్పు నియోజకవర్గం

హేళన చేశారు..  కరోనా టైంలో ప్రాణాలు కాపాడింది ఈ వ్యవస్ధే..
జగనన్నా మీరు గొప్ప సంకల్పంతో ఈ వాలంటీర్‌ వ్యవస్ధను తీసుకొచ్చారు. ఈ వ్యవస్ధలో నేను ఉన్నందుకు గర్వపడుతున్నాను. నేను ఒక ఇంటికి వెళితే ఆయన నాకు ఏ పథకాలు వద్దు, మీకు జీతాలు ఇస్తారా అని హేళన చేశాడు. కానీ కరోనా టైంలో ఆయనకు కరోనా వస్తే తన పిల్లలే తన దగ్గర లేకపోతే మేం దగ్గరుండి అన్నీ చేశాం. ఆ తర్వాత కోలుకుని రియలైజ్‌ అయి మాకు రెండు చేతులు జోడించి దండం పెట్టి నాకు ప్రాణభిక్ష పెట్టారన్నాడు. మమ్మల్ని చాలా హేళన చేశారు. కరోనా టైంలో అందరి ప్రాణాలు కాపాడింది ఈ వ్యవస్ధే, ధ్యాంక్యూ సీఎం సార్‌.
-మురళీ, వాలంటీర్, మైలవరం నియోజకవర్గం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement