
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నిండే యువతీ, యువకులను ఓటరుగా నమోదు చేసేందుకు ఈ ఏడాది నవంబర్ 16వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
► ఈ నెల 10వ తేదీ నుంచి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణతో పాటు ఓటర్ల జాబితాల్లో అనర్హుల పేర్లను తొలగిస్తారు. అక్టోబర్ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ► నవంబర్ 1వ తేదీ నుంచి ఫాం 1 నుంచి 8 వరకు అందుబాటులో తెస్తారు. సప్లిమెంటరీతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబర్ 16వ తేదీన ప్రకటిస్తారు. అదే రోజు నుంచి వచ్చే ఏడాది జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండేవారితో పాటు ఓటర్ల జాబితాలో పేరులేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
► డిసెంబర్ 15వ తేదీ వరకు ఓటరుగా నమోదుకు లేదా అభ్యంతరాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
► నవంబర్ 28, 29, డిసెంబర్ 12, 13 తేదీ (శని, ఆదివారాలు)ల్లో పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు అందుబాటులో ఉంటారు.
► ఓటర్లుగా చేరేందుకు బూత్ స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా మార్పులు, చేర్పులుంటే వారి దృష్టికి తీసుకెళ్లవచ్చు. దరఖాస్తులను, అభ్యంతరాలను వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ నాటికి పరిష్కరిస్తారు. జనవరి 14న తుది ఓటర్ల జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని సరిచూసుకుంటారు. జనవరి 15వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు.