సాక్షి, రాజమండ్రి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసు విషయంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అరుణ్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 2న మార్గదర్శి కేసు విచారణ ఉంది. డిపాజిట్ల సేకరణ ఆపేసినట్లు 2006లో రామోజీరావు చెప్పారు. డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని హైకోర్టు, సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు. కానీ, ఇప్పటికీ డిపాజిట్లు వసూలు చేస్తూనే ఉన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్ పేరు మీదే డబ్బు సేకరిస్తున్నారు.
గతంలో డిపాజిట్ అని ఉండేది.. ఇప్పుడు రిసీట్ అని సేకరిస్తున్నారు. మార్చి 31 నాటికి ఔట్ స్టాండింగ్ రూ. 139 కోట్లుగా చూపించారు. మార్గదర్శికి 3 శాతం కూడా డీఫాల్టర్లు లేరు.. అందులో కిటుకు ఏంటి?. రామోజీకి బ్యాంకులను అప్పగిస్తే అద్భుతంగా నడిపిస్తారేమో. రామోజీ తెలివితేటలకు పద్మవిభూషణ్ కాదు.. భారతరత్న ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా మార్గదర్శిలో తనిఖీలు నిర్వహించింది. మార్గదర్శికి ఇవాల్టికీ రామోజీనే ఛైర్మన్.. కానీ, కోర్టులో మాత్రం ఆయన ఛైర్మన్ కాదంటున్నారు.
రామోజీకి రెండు టోపీలు ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జీ చెప్పారు. రామోజీ టోపీల్లో ఒకటి మీడియా, రెండోది ఇండస్ట్రీయలిస్ట్. వ్యాపారవేత్తగా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మీడియాను వాడుకుంటున్నారు. ఏ వ్యాపారమైనా చట్టానికి లోబడే చేయాల్సిందే. రామోజీ చట్టాన్ని ఉల్లంఘించినట్టు రికార్డులే చెబుతున్నాయి. మార్గదర్శి స్కామ్‌పై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలి’ అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment