ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్న వైద్యసిబ్బంది
కోడూరు(అవనిగడ్డ): సముద్ర తీర ప్రాంతమైన పాలకాయతిప్ప గ్రామంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే హడలిపోతున్నారు. బయటకు వస్తే చనిపోతామంటూ గ్రామమంతా వదంతులు వ్యాపించడంతో గ్రామస్తులు కాలు బయట పెట్టాలంటే వణికిపోతున్నారు. వారం రోజుల వ్యవధిలో గ్రామంలో ఎనిమిది మంది వివిధ అనారోగ్య సమస్యలు, కోవిడ్‌తో మృతిచెందడమే ఈ వదంతుల వ్యాప్తికి కారణమని అధికారులు అంచనా వేశారు. కోడూరు మండలంలోని సముద్రతీరానికి ఆనుకొని ఉన్న హంసలదీవి పంచాయతీలో భాగమే ఈ పాలకాయతిప్ప గ్రామం. ఈ గ్రామంలో 220 కుటుంబాలకు చెందిన 800 మంది జనాభా నివాసముంటున్నారు.
వీరంతా మత్స్యకార కుటుంబాల వారే కావడంతో అందరూ సముద్ర వేట మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు గ్రామస్తులు మృతి చెందారు. వారం రోజుల వ్యవధిలో గ్రామానికి చెందిన ఎనిమిది మంది చనిపోవడంతోపాటు వీరిలో మంగళవారం (25వ తేదీన) ఒక రోజే ముగ్గురు మృతి చెందడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఎనిమిది మందిలో ఇద్దరు మాత్రమే కోవిడ్ వైరస్ బారినపడి మృతి చెందగా, మిలిగిన ఆరుగురు వివిధ అనారోగ్య సమస్యలతో మృతి చెందారని అధికారులు తెలిపారు.
రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం
జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, బందరు ఆర్డీఓ ఖాజావలి దృష్టికి ఈ పాలకాయతిప్ప గ్రామ విషయం వెళ్లడంతో మండలాధికారులను అప్రమత్తం చేశారు. గ్రామస్తుల్లో భయాందోళన పోగొట్టేందుకు మండల అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. గురువారం సాయంత్రం తహసీల్దార్ షేక్ లతీఫ్‌పాషా, వైద్యాధికారి సోమరాజు, కార్యదర్శి యలవర్తి సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ పి.రమేష్ ఆయా శాఖాల సిబ్బందితో కలిసి గ్రామంలో పర్యటించారు.
ప్రతి ఇంటికి వెళ్లి వదంతులు నమ్మవద్దంటూ మనోధైర్యం కల్పించారు. వైద్య సిబ్బంది జ్వరపీడితుల వివరాలను సేకరించారు. తొమ్మిది మంది కోవిడ్‌తో బాధపడుతున్నారని, మరో 14 మంది గ్రామస్తులకు జ్వరాలు ఉన్నట్లు గుర్తించామని వైద్యాధికారి తెలిపారు. శుక్రవారం గ్రామస్తులందరికి ఆర్టీపీసీఆర్ కోవిడ్ టెస్టులు చేస్తామని, చనిపోయిన వారంతా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారేనని స్పష్టం చేశారు. పంచాయతీ అధికారులు గ్రామమంతా సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేసి, బ్లీచింగ్ చల్లారు. సర్పంచి కొక్కిలిగడ్డ బిక్షాలు, వలంటీర్లు సమస్యను అధికారులకు వివరించారు.
చదవండి: కారు హారన్ మోగించాడని... ఎంత పని చేశారంటే..
సాక్షి ఎఫెక్ట్: మాయలేడి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment