సాక్ణి, అమరావతి: రాష్ట్రంలో లక్షల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న విద్యుత్ తీగలకు సీఎం పర్యటనతో లింకు పెట్టి ఈనాడులో ఆదివారం ప్రచురించిన కథనంపై ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలతో విద్యుత్ ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, వాస్తవాలు దాచి తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. విద్యుత్ ప్రమాదాల్లో 85 శాతానికి పైగా మరణాలకు పంపిణీ వ్యవస్థలోని లోపాలే కారణమని రాసిన వార్తలో నిజం లేదంటున్న సీఎండీలు ‘సాక్షి’కి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
‘ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా చర్యలు’
ఇటీవల అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఘటన దృష్ట్యా విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు తగిన జాగ్రత్తలను ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా రైతులకు పగటి పూట 9 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. డిస్కంలో ప్రతి విద్యుత్ ఉద్యోగికి సరైన శిక్షణ ద్వారా అవగాహన కల్పిం చి, భద్రతా పరికరాలు అందించి, ఉద్యోగుల ప్రమాదాలు తగ్గించాం. ఎలక్ట్రికల్ షార్ట్ పోల్స్, లాంగ్ స్పాన్ ఉన్న చోట్ల మిడిల్ పోల్స్ ఏర్పాటు, ఒరిగిన స్తంబాలను సరి చేయడం, విద్యుత్ నియంత్రికల ఎత్తు పెంచడం, ఎర్తింగ్ ఏర్పాటు వంటివి క్రమం తప్పకుండా చేస్తున్నాం.సబ్ స్టేషన్లు, లైన్ల నిర్వహణ, లక్షలాది విద్యుత్ స్తంభాల మరమ్మతు పనులను చేపడుతున్నాం.
నగరాలు, పట్టణాల్లో ఎక్కువ జనసాంద్రత కలిగిన ప్రదేశాలు, వ్యాపార ప్రాంతాలు, ఇరుకు రోడ్లలో 30 ఏళ్లు దాటిన పోల్స్ , కండక్టర్స్ మార్చడం ద్వారా విద్యుత్ ప్రమాదాలు నివారించే ప్రయత్నం చేస్తున్నాం. విజయవాడ శివాలయం వీధిలో కండక్టర్ లేని ఎంసీసీబీ బాక్స్‌తో కూడిన ఓవర్ హెడ్ కేబుల్ ఏర్పాటు చేసే పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాం. వర్షాల వల్ల పెదవేగి మండలం పినకమిడి పొలాల్లో నీరు నిలిచిన కారణంగా ఒరిగిపోయిన స్తంభాలను సరిచేశాం. విశాఖపట్నం పాత పోస్టాఫీస్ ప్రాంతంలో లక్ష్మి థియేటర్ దగ్గర వాడవీధిలో పోల్‌కి పోల్‌కి మధ్యలో ఉన్న బేర్ కండక్టర్ తొలగించి ఎల్‌టీ ఏబీ కేబుల్ వైరు అమర్చాం. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇదో నిరంతర ప్రక్రియ. ఈ చర్యల వల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే విద్యుత్ ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి.
‘కండక్టర్‌లు మార్చాం’
గతేడాది నవంబర్ నుంచి ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఎల్‌టీ లైన్ కండక్టర్‌ను 2,403 కిలోమీటర్లు, 11 కేవీ లైన్ కండక్టర్ 2,256 కిలోమీటర్లు, 33 కేవీ లైన్ కండక్టర్ 256 కిలోమీటర్లు, ఎల్‌టీ కేబుల్ 1,089 కిలోమీటర్ల మేర మార్చాం. ఒరిగిన ఎల్‌టీ విద్యుత్ స్తంభాలు 6,873, 11 కేవీ విద్యుత్ స్తంభాలు 7,498, 33 కేవీ విద్యుత్ స్తంభాలు 3,254 కొత్తవి వేశాం. విద్యుత్ లైన్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎల్‌టీ లైన్ల పరిధిలో 3,317 చోట్ల, 11 కేవీ లైన్ల పరిధిలో 3,383 చోట్ల, 33 కేవీ లైన్ల పరిధిలో 860 చోట్ల ప్రమాదాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేశాం.
రోడ్డు క్రాసింగ్‌ల వద్ద ఎల్‌టీ లైన్ పరిధిలో 19,068, 11 కేవీ లైన్ల పరిధిలో 10,763, 33 కేవీ లైన్ల పరిధిలో 954 విద్యుత్ స్తంభాలను సరిచేశాం. సబ్‌స్టేషన్ల పరిధిలో ప్రొటెక్షన్‌ను పటిష్టం చేయడం ద్వారా లైన్‌లో ఎక్కడైనా ప్రమాదం జరిగితే సబ్ స్టేషన్లలో విద్యుత్ సరఫరా వెంటనే ట్రిప్ అయ్యేలా ఏర్పాటు చేశాం. ఈపీడీసీఎల్ పరిధిలో అన్ని విద్యుత్ ఉప కేంద్రాలకు, 33 కేవీ, 11 కేవీ, ఎల్‌టీ లైన్లు 2020 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు సర్వే చేసి సరిదిద్దాం. ఈ క్రమంలో 38,850 వాలిన విద్యుత్ స్తంభాలను సరిచేసి వేలాడే వైర్ల మధ్యలో 7,454 మధ్యస్థ స్తంబాలను వేశాం. 31,324 విరిగిపోయిన స్తంభాలను మార్చి 2,557 కిలోమీటర్ల మేర వేలాడుతున్న వైర్లను సరిచేశాం.
ప్రయాస్ కొత్తగా చెప్పిందేమీ లేదు
సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 9 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడం రైతులకు ఒక వరం. దీనివల్ల రైతులకు విద్యుత్ ప్రమాదాలు తగ్గడమే కాకుండా చేలకు నీటిని కావలసిన విధంగా వాడుకుని పంటలు సంవృద్ధిగా పండిస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని నిర్ణయించిన రోజే రైతులు, మోటార్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని భద్రతా పరికరాలను ప్రభుత్వమే తన ఖర్చుతో పెట్టాలని నిర్ణయించింది. మినీయేచర్ సర్క్యూట్ బ్రేకర్ (ఎంసీబీ), ఎర్త్ పైప్ పెట్టడం వల్ల రైతుకు, మోటార్‌కు, ఎలక్ట్రికల్ సామగ్రికి భద్రత ఉంటుంది. వోల్టేజీ హెచ్చుతగ్గులను కెపాసిటర్ నివారిస్తూ మోటార్ సామర్థ్యం పెంచుతుంది. విద్యుత్ వృథా కాకుండా నివారిస్తుంది. ఇవన్నీ సీఎం జగన్ ఎప్పుడో ఆలోచించారు. ఇక్కడ ప్రయాస్ కొత్తగా చెప్పింది ఏమీ లేదు.
‘తరచూ శిక్షణ ఇస్తున్నాం’
డిస్కంల పరిధిలో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లకు తరచుగా భద్రత, లైన్ మరమ్మతులపై శిక్షణ ఇస్తున్నాం. రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలు, పెనుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడం, లైన్లు దెబ్బతినడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి సమస్యలను క్షేత్రస్థాయి సిబ్బంది గుర్తించి వెంటనే వాటిని పరిష్కరిస్తున్నారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడం, దెబ్బతినడం, లైన్లు వేలాడుతుండటం వంటి సమస్యలను గుర్తిస్తే వినియోగదారులు వెంటనే 1912 కాల్ సెంటర్‌కు సమాచారం అందిస్తే వెంటనే మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment