సాక్షి, అమరావతి: న్యాయస్థానాల భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ఇతర రాష్ట్రాలకు అధిక నిధులు వెచ్చిస్తున్న కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ఆ స్థాయిలో నిధులు ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధుల కొరతతో ప్రాథమిక దశలోనే పలు నిర్మాణాలు నిలిచిపోయాయని తెలిపింది. కోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు సంబంధించిన 19 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా కింద ఇవ్వాల్సిన రూ. 394 కోట్లను విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయాలని సూచించింది.
రాష్ట్ర విభజన తరువాత న్యాయవ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేసింది. నిధుల విడుదల వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతానని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు అడిషనల్ జనరల్ (ఏఎస్‌జీ) బి.నరసింహ శర్మ హై కోర్టుకు తెలిపారు. ఇందుకు కొంత గడువునిస్తే కేంద్రం నిర్ణయం ఏమిటో తెలియచేస్తానన్నారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
రూ. 4.82 కోట్లు మాత్రమే విడుదల
కృష్ణాజిల్లా గన్నవరంలో పలు కోర్టుల కోసం భవన నిర్మాణాలను చేపట్టడం లేదని, పాత భవనాలకు మరమ్మతులు నిర్వహించడం లేదని, తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గన్నవరానికి చెందిన దేవిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి 2022లో హైకోర్టులో పిల్ దాఖలు చేయగా.. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎంఆర్‌కే చక్రవర్తి వాదనలు వినిపిస్తూ, నిధుల కొరత వల్ల కోర్టు భవనాల నిర్మాణాలు నిలిచిపోయాన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ, కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారం న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు విడుదల చేయాల్సి ఉంటుందన్నారు.
19 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మొత్తం రూ. 656 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందులో కేంద్రం వాటా రూ. 394 కోట్లు విడుదల చేయాల్సి ఉందన్నారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 83.33 కోట్లు కోసం హైకోర్టు కేంద్రానికి లేఖ రాసిందన్నారు. కేంద్రం తరఫున ఏఎస్‌జీ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ, ఈ విషయాలన్నింటినీ కేంద్రం దృష్టికి తీసుకెళతానన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం కేటాయించిన సొమ్ములో ఇంకా రూ. 14.44 కోట్లు ఇవ్వాల్సి ఉందని, ఈ మొత్తం విడుదల చేసినా కూడా ఇప్పటికే నిలిచిపోయిన 19 ప్రాజెక్టులు పూర్తి కావని తెలిపింది. అందువల్ల పూర్తిస్థాయి నిధుల కేటాయింపు అవసరమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఏఎస్‌జీకి స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment