ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, రొద్దం: విషపురుగు ఓ రైతు కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. 9 ఏళ్ల క్రితం భార్యను బలితీసుకుని విషాదం నింపిన సర్పం.. తాజాగా భర్తనూ చంపేసింది. వివరాలు.. మండలంలోని ఆర్.కుర్లపల్లికి చెందిన రైతు గొల్ల రాము (33) శుక్రవారం రాత్రి పొలంలో మొక్క జొన్న పంటకు కాపలాగా వెళ్లాడు. ఈ క్రమంలోనే పాము కాటు వేయగా, ఏదో ముల్లు గుచ్చుకుందనుకుని తేలిగ్గా తీసుకున్న రైతు కొద్దిసేపటికే ఇంటికి వచ్చేశాడు. అర్ధరాత్రి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
చదవండి: (ప్రతి నెలా రూ. కోటి వడ్డీ కడుతున్నాం.. గత్యంతరం లేక ఐపీ పెట్టాం)
9 ఏళ్ల క్రితం భార్యా ఇలాగే..
రాము మొదటి భార్య నాగమణి కూడా పాముకాటుకు గురై 9 ఏళ్ల క్రితం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పొలంలో పనులు చేసుకుంటున్న సమయంలో సర్పం కాటువేయగా, ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు పేర్కొన్నారు. నాగమణి మృతి తర్వాత రాము సుజాతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు బాలికలు. కుటుంబ పెద్ద మరణించడంతో భార్యాబిడ్డలు గుండెలవిసేలా రోదించారు. ఎంపీపీ చంద్రశేఖర్, మండల కో ఆప్షన్ మెంబర్ షఫీవుల్లా, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నారాయణరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ లక్ష్మినారాయణరెడ్డి, తదితరులు రాము మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment