నర్సీపట్నం: వివాహేతర సంబంధానికి అడ్డంకిగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి ఓ మహిళ హత్య చేయించింది. గతేడాది ఆగస్టు 7న ఈ ఘటన జరిగింది. తొమ్మిది నెలల తరువాత గొలుగొండ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఆయన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గొలుగొండ మండలం పాకలపాడు గ్రామానికి చెందిన రుత్తల సత్తిబాబు భార్య రామలక్ష్మికి అదే గ్రామానికి చెందిన సబ్బవరపు ఎర్రినాయుడుకు మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం సత్తిబాబుకు తెలియడంతో తరచూ తాగి వచ్చి భార్య రామలక్ష్మితో గొడవ పడేవాడు. దీంతో సత్తిబాబును హతమార్చాలని రామలక్ష్మి, ఆమె మేనత్త సన్యాసమ్మ, రామలక్ష్మి ప్రియుడు ఎర్రినాయుడు కలిసి కుట్రపన్నారు. సత్తిబాబును హత్య చేస్తే రూ.50 వేలు ఇచ్చేందుకు అదే గ్రామానికి చెందిన కర్రి కృష్ణతో ఎర్రినాయుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
సత్తిబాబుకు మద్యపానం, పేకాట అలవాటు ఉంది. గత ఏడాది ఆగస్టు 7న సత్తిబాబుకు ఫోన్ చేసి మాకవరపాలెం సమీపంలో పేకాట ఆడుతున్నారని ఎర్రినాయుడు,కృష్ణ నమ్మబలికారు. ఎర్రినాయుడు, కృష్ణ ఒక బైక్‌పై, సత్తిబాబు తన మోపెడ్‌పై బయలుదేరారు. మార్గం మధ్యంలో ఏటిగైరంపేట, పెద»ొడ్డేపల్లిల్లో సత్తిబాబుతో ఫుల్‌గా మద్యం తాగించారు. మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం దగ్గరలో ఏలేరు కాలువ పక్కన తోటలోకి తీసుకు వెళ్లారు. సత్తిబాబును ఎర్రినాయుడు కిందపడేశాడు. కృష్ణ గట్టిగా పట్టుకోగా ఎర్రినాయుడు అతని గొంతునొక్కి చంపేసి పక్కనే ఉన్న ఏలేరు కాలువలో పడేశారు.
మోపెడ్‌ను కూడా కాలువలో పడేశారు. సత్తిబాబు కనిపించకపోవడంతో అతని తండ్రి దేముడు, అక్క పైడితల్లి, ఆమె భర్త రమణమూర్తి గత ఏడాది ఆగస్టు 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయలేదు. రామలక్ష్మి, ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న ఎర్రినాయుడు కలిసి సత్తిబాబును చంపేసి ఉంటారని గత నెల 19న హతడు తండ్రి దేముడు, కుటుంబ సభ్యులు గొలుగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ముందు పరారీ.. తరువాత లొంగుబాటు
గొలుగొండ ఎస్‌ఐ ధనుంజనాయుడు, సిబ్బందితో కలిసి విచారణ చేస్తుండగా ఎర్రినాయుడు కనిపించకుండా పోయాడు. తరువాత ఈ నెల 27న గ్రామ వీఆర్వో ఎదుట లొంగిపోయాడు. ఎర్రినాయుడు, రామలక్ష్మి, సన్యాసమ్మను విచారించగా తామే హత్య చేశామని అంగీకరించారు. హత్య జరిగిన ప్రాంతంలో కాలువలో గాలించగా మోపెడ్ లభ్యమైంది. సంఘటన జరిగి తొమ్మిది నెలలు కావడంతో సత్తిబాబు మృతదేహం లభ్యం కాలేదు. హత్య కేసులో మరో నిందితుడు కృష్ణ ఇటీవల గంజాయి కేసులో పట్టుబడి జైలులో ఉన్నాడు. ఎర్రినాయుడు, రామలక్ష్మి, సన్యాసమ్మలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. కృష్ణను కూడా అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment