Visaka District
-
ప్రియుడు, మేనత్తతో కలిసి రామలక్ష్మి ఏం చేసిందంటే..?
నర్సీపట్నం: వివాహేతర సంబంధానికి అడ్డంకిగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి ఓ మహిళ హత్య చేయించింది. గతేడాది ఆగస్టు 7న ఈ ఘటన జరిగింది. తొమ్మిది నెలల తరువాత గొలుగొండ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గొలుగొండ మండలం పాకలపాడు గ్రామానికి చెందిన రుత్తల సత్తిబాబు భార్య రామలక్ష్మికి అదే గ్రామానికి చెందిన సబ్బవరపు ఎర్రినాయుడుకు మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం సత్తిబాబుకు తెలియడంతో తరచూ తాగి వచ్చి భార్య రామలక్ష్మితో గొడవ పడేవాడు. దీంతో సత్తిబాబును హతమార్చాలని రామలక్ష్మి, ఆమె మేనత్త సన్యాసమ్మ, రామలక్ష్మి ప్రియుడు ఎర్రినాయుడు కలిసి కుట్రపన్నారు. సత్తిబాబును హత్య చేస్తే రూ.50 వేలు ఇచ్చేందుకు అదే గ్రామానికి చెందిన కర్రి కృష్ణతో ఎర్రినాయుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సత్తిబాబుకు మద్యపానం, పేకాట అలవాటు ఉంది. గత ఏడాది ఆగస్టు 7న సత్తిబాబుకు ఫోన్ చేసి మాకవరపాలెం సమీపంలో పేకాట ఆడుతున్నారని ఎర్రినాయుడు,కృష్ణ నమ్మబలికారు. ఎర్రినాయుడు, కృష్ణ ఒక బైక్‌పై, సత్తిబాబు తన మోపెడ్‌పై బయలుదేరారు. మార్గం మధ్యంలో ఏటిగైరంపేట, పెద»ొడ్డేపల్లిల్లో సత్తిబాబుతో ఫుల్‌గా మద్యం తాగించారు. మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం దగ్గరలో ఏలేరు కాలువ పక్కన తోటలోకి తీసుకు వెళ్లారు. సత్తిబాబును ఎర్రినాయుడు కిందపడేశాడు. కృష్ణ గట్టిగా పట్టుకోగా ఎర్రినాయుడు అతని గొంతునొక్కి చంపేసి పక్కనే ఉన్న ఏలేరు కాలువలో పడేశారు. మోపెడ్‌ను కూడా కాలువలో పడేశారు. సత్తిబాబు కనిపించకపోవడంతో అతని తండ్రి దేముడు, అక్క పైడితల్లి, ఆమె భర్త రమణమూర్తి గత ఏడాది ఆగస్టు 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయలేదు. రామలక్ష్మి, ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న ఎర్రినాయుడు కలిసి సత్తిబాబును చంపేసి ఉంటారని గత నెల 19న హతడు తండ్రి దేముడు, కుటుంబ సభ్యులు గొలుగొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముందు పరారీ.. తరువాత లొంగుబాటు గొలుగొండ ఎస్ఐ ధనుంజనాయుడు, సిబ్బందితో కలిసి విచారణ చేస్తుండగా ఎర్రినాయుడు కనిపించకుండా పోయాడు. తరువాత ఈ నెల 27న గ్రామ వీఆర్వో ఎదుట లొంగిపోయాడు. ఎర్రినాయుడు, రామలక్ష్మి, సన్యాసమ్మను విచారించగా తామే హత్య చేశామని అంగీకరించారు. హత్య జరిగిన ప్రాంతంలో కాలువలో గాలించగా మోపెడ్ లభ్యమైంది. సంఘటన జరిగి తొమ్మిది నెలలు కావడంతో సత్తిబాబు మృతదేహం లభ్యం కాలేదు. హత్య కేసులో మరో నిందితుడు కృష్ణ ఇటీవల గంజాయి కేసులో పట్టుబడి జైలులో ఉన్నాడు. ఎర్రినాయుడు, రామలక్ష్మి, సన్యాసమ్మలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. కృష్ణను కూడా అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. -
విశాఖ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని చెరువూరు గ్రామంలో ఆదివారం జరిగిన ఆటో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీకొన్న ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విశాఖ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. చెరువూరులో విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీకొన్న దుర్ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చింతపల్లి ప్రమాద బాధితుల్ని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ పరామర్శించారు. లోతుగడ్డ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
కొండలు, గుట్టలనూ మింగేస్తున్నారన్నా..
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘సార్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ చూసుకుని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కొండలు, గుట్టలను మింగేస్తున్నారు. ప్రకృతి సంపదను అక్రమంగా దోచేస్తున్నారు. అడ్డుపడిన, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే, ఆయన కుమారుడి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మీరే కాపాడాలి’ అంటూ వివిధ గ్రామాల ప్రజలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 256వ రోజు గురువారం వైఎస్ జగన్.. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం శివారు నుంచి అమృతాపురం, ఇప్పవానిపాలెం మీదగా జెర్రిపోతులపాలెం వరకు పాదయాత్ర కొనసాగించారు. దారిపొడవునా ప్రజలు ఘన స్వాగతం పలుకుతూనే తమ సమస్యలను విన్నవించారు. ఎమ్మెల్యే ఆగడాలు మితిమీరాయి.. పెందుర్తి ఎమ్మెల్యే, ఆయన కుమారుడు చేస్తున్న ఆగడాలను చింతగట్ల, జెర్రిపోతులపాలెం గ్రామస్తులు పలువురు జగన్‌కు ఏకరవుపెట్టారు. ‘అయ్యా.. మా గ్రామాల్లో భూముల్ని కబ్జా చేసేందుకు మా ఎమ్మెల్యే చేయని దురాగతాలు లేవు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, అడ్డుపడిన వారిపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. జాతీయ రహదారి కోసం (షీలానగర్ నుంచి సబ్బవరం వరకు) భూమిని సేకరిస్తూ ఐదారు రెట్ల నష్టపరిహారం అని చెప్పి మోసం చేస్తున్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కాకుండా ఏవేవో మార్పులు, చేర్పులు అంటూ 1.25 రెట్లు మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలా చేయడం ధర్మమా?’ అని వాపోయారు.అసైన్డ్ భూములు, మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ భూములను కాజేయకుండా చూడాలని కోరారు. జెర్రిపోతులపాలెం సహా వివిధ గ్రామాల్లో కొండల్ని దారుణంగా తవ్వి.. మట్టి, గ్రావెల్‌ను అమ్ముకుంటున్నారని పలువురు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. సర్వే నెంబర్ 75లోని కొండ ప్రాంతాన్ని తవ్వుకునేందుకు ఎటువంటి అనుమతులు లేవని, అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే దురాగతాలను వివరించారు. కొత్తగా వేస్తున్న ఐఓసీ పైపులైను ఎమ్మెల్యే, ఇతర నాయకుల భూముల మీదుగా వెళ్లాల్సి ఉండగా, పేదల భూముల మీదుగా తీసుకుపోయేలా చేస్తున్నారని చెప్పారు. దీనిపై జగన్ స్పందిస్తూ ఈ వ్యవహారాలన్నింటిపై సమగ్ర సమాచారం సేకరించి పంపాలని పెందుర్తి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త అదీప్ రాజుకు సూచించారు. గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ బాధితురాలికి అందిన సాయం నామమాత్రమే.. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలతో ఘోర అవమానానికి (వివస్త్రను చేసి) గురైన ఓ మహిళ, మరో బాధితురాలైన ఆమె సోదరి వచ్చి జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు అవమానం జరిగినప్పుడు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఘటన జరిగినప్పుడు వచ్చిన ఎస్సీ కమిషన్ అధ్యక్షుడు రాములు ప్రకటించిన రూ.8 లక్షల ఆర్థిక సాయంలో రూ.లక్ష మాత్రమే ఇచ్చారని, మిగతా సొమ్ము ఇంకా అందలేదని బాధితురాలు చెప్పారు. ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు ఆర్థిక సహాయం చేసిందని కృతజ్ఞతలు తెలిపారు. జగన్ స్పందిస్తూ.. ఆ సంఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం దత్తత గ్రామానికే దిక్కులేదు మన్యం మంచం పట్టినా పట్టించుకున్న నాథుడు లేడన్నా అంటూ పాడేరు, అరకు నియోజకవర్గాల ప్రజలు జగన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మన్యంలోని అనేక గ్రామాల్లో డెంగీ జ్వరం తీవ్రంగా ప్రబలిందని, అమాయక గిరిజనులకు వైద్యం అందడం లేదని వాపోయారు. సీఎం దత్తత తీసుకున్న అరకు నియోజకవర్గంలోని పెదలబుడు గ్రామంలో డెంగీ విజృంభించినా, పట్టించుకున్న పాపాన పోలేదని న్యాయవాది నిప్పుల సింహాచలం జగన్‌కు ఫిర్యాదు చేశారు. పాడేరు, అరకులో వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు అధికార వ్యామోహంతో టీడీపీకి అమ్ముడుపోయి వాళ్లు క్షేమంగా ఉన్నారే తప్ప గిరిజనుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్సార్సీపీ వాళ్లమని వేధిస్తున్నారు.. రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నా తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లమని టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే వేధిస్తున్నట్టు జెర్రిపోతుల పాలెం సర్పంచ్‌గా పని చేసిన కోన శ్రీనివాసరావు జగన్‌కు చెప్పారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయాన్ని తాను అభివృద్ధి చేస్తే టీడీపీ నాయకులు ఇప్పుడు దానికి పచ్చరంగు పులిమారన్నారు. తమ ఊరిని ఆనుకుని ఉన్న కొండల్ని తొలిచేస్తున్నారని, ఈ వ్యవహారంలో అధికారులు మొదలు స్థానిక ఎమ్మెల్యే వరకు అందరికీ కమీషన్లు పోతున్నాయన్నారు. ట్రై జంక్షన్ బలవంతపు భూ సమీకరణ ఆపాలని, జీవో నెంబర్ 269ని రద్దు చేయాలని పరవాడ మండల వాసులు, దివ్యాంగులకు పాఠాలు చెప్పే తమను రెగ్యులరైజ్ చేయాలని పెందుర్తిలో పని చేస్తున్న టీచర్లు, తమతో గొడ్డు చాకిరీ చేయించుకుంటూ సర్వీసులను క్రమబద్ధీకరించకుండా అన్యాయం చేస్తున్నారని పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్లు, జీత భత్యాలు ఇప్పించాలని లైసెన్స్డ్ సర్వేయర్లు కోరారు. పాదయాత్ర అమృతాపురం దాటాక పలువురు వృద్ధ కళాకారులు డప్పు వాయిస్తూ ఎదురేగి జగన్‌తో కలిసి అడుగులో అడుగు వేశారు. కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ‘అయ్యా.. నువ్వు గెలవాలి. అప్పుడే మా లాంటి పేదలకు న్యాయం జరుగుతుంది’ అని ఊరూరా జనం ఆకాంక్షించారు. అందరి సమస్యలను ఓపికగా విని ధైర్యం చెబుతూ జననేత ముందుకు సాగారు. వైఎస్ చలువతో ఇళ్లు కట్టుకున్నాం అయ్యా.. మాది చింతగట్ల పంచాయతీలోని ఉప్పిలివానిపాలెం. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనకు ముందు మా ఊళ్లో చాలా వరకు పూరిళ్లే. అగ్ని ప్రమాదాలు, వర్షాలతో ఏటా ఇబ్బందులు పడేవాళ్లం. అందరం నిరుపేదలమే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 40 ఏళ్లపాటు కమ్మల ఇంట్లో ఉండేవాడిని. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2007లో మా గ్రామంలో వందలాది మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించారు. ఇవాళ మా గ్రామంలో డాబా ఇళ్లు ఉన్నాయంటే అది వైఎస్ చలవే. – చీపురుపల్లి నారద పింఛను రూ.3 వేలు చేస్తానన్నారు నాది పెందుర్తి మండలం ఇప్పవానిపాలెం. నేను పుట్టుకతోనే వికలాంగుడిని. ఇప్పుడు నాకు రూ.1500 పింఛను వస్తోంది. కుటుంబం గడవడానికి సరిపోవడం లేదు. నేను ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాను. నాకు ఒక చెల్లి ఉంది. మా చెల్లిని పెద్ద చదువులు చదివించాలనుకుంటున్నాను. జగన్ గారిని కలిసి నా బాధ చెప్పుకున్నాను. మరో ఆరు మాసాల్లో మన ప్రభుత్వం రాబోతుందని, రూ.3 వేల పింఛను ఇస్తానని జగనన్న హామీ ఇచ్చారు. – దాసరి ఎర్నికుమార్ -
అన్నా.. ఆశలన్నీ మీపైనే
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఊరూరా జగన్ నినాదం.. జననేత జనంతో మమేకం.. ఊళ్లకు ఊళ్లు ఎదురేగి ఘన స్వాగతం.. ప్రతి గుండె ప్రతిధ్వనిస్తున్న చిత్రం.. మరో వైపు సమస్యల హోరు.. ప్రభుత్వంపై బాధితుల శాపనార్థాలు.. బతుకు భారమైందని విన్నపాలు.. ఆదుకోవాలని వేడుకోలు.. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని విధాలా మోసపోయి.. నష్టపోయామని, మీరొస్తేనే న్యాయం జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షించారు. ప్రజా సంకల్ప యాత్ర గురువారం 250వ రోజు విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలోని తుమ్మపాల శివారు నుంచి ప్రారంభమై మర్టూరు క్రాస్, బవులవాడ క్రాస్, త్రిమూర్తుల నగర్ మీదుగా దర్జీనగర్ వరకు కొనసాగింది. దారిపొడవునా జనం ఎదురేగి జననేతను తమ గ్రామాల్లోకి ఆహ్వానించారు. పుష్పగుచ్ఛాలు అందజేశారు. దిష్టి తీశారు. హారతులు పట్టారు. బాణసంచా కాల్చారు. కోలాటాలు, భజనలు, గంగిరెద్దులతో స్వాగతించారు. అడుగడుగో జగనన్న అంటూ తల్లులు.. చిన్నారులకు చూపించారు. జననేతతో కరచాలనం కోసం పోటీపడ్డారు. మరోవైపు పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్లు ఇవ్వడం లేదని, నీటి సమస్య తీరలేదని, ఆరోగ్య శ్రీ వర్తించడం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. కశింకోట మండలం తీడ పంచాయతీ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి నాయుడు, టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు తగరంపూడి నూకరత్నం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తుమ్మపాల చక్కెరతోనే మా బతుకు.. విశాఖ జిల్లాలో 9 మండలాలు, 149 గ్రామాలకు జీవనాధారంగా ఉన్న తుమ్మపాల చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి తమను ఆదుకోవాలని వివిధ గ్రామాల రైతులు, సహకార, ఉద్యోగ సంఘాల నేతలు తుమ్మపాలలో జగన్‌కు వినతి పత్రాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తమకీ కష్టాలు తప్పడం లేదని ఫిర్యాదు చేశారు. 42 నెలలుగా కర్మాగారంలో పని చేస్తున్న కార్మికులు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ప్రావిడెంట్ ఫండ్‌ను తమ ఖాతాల్లో జమ చేయకపోవడంతో చనిపోయిన వారి కుటుంబాలకు, రిటైర్ అయిన వారికి పెన్షన్ రావడం లేదని వాపోయారు. ఈ ఫ్యాక్టరీని తెరిపించకపోతే 300 కార్మిక కుటుంబాలు, 14 వేల రైతు కుటుంబాలు బజారు పాలవుతాయని చెప్పారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. మనందరి ప్రభుత్వం రాగానే ఫ్యాక్టరీని తెరిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సబ్ ప్లాన్ సరే.. కేటాయింపులేవీ? ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని చేసినా బడ్జెట్ కేటాయింపులకు నేటి వరకు విధివిధానాలు ఖరారు చేయలేదని ఎస్సీ, ఎస్టీ కులాల, సంక్షేమ పరిరక్షణ సంఘం జగన్‌తో గోడు వెళ్లబోసుకుంది. బడ్జెట్లలో నిధులు కేటాయిస్తున్నా అవి సక్రమంగా వినియోగం కావడం లేదని, దీనిపై అంబుడ్స్‌మెన్ కమిటీ ఏర్పాటయ్యేలా చూడాలని కోరింది. వాల్మీకి (బోయ) కులస్తులకు బంజరు భూములను ఇచ్చి ఆత్మగౌరవంతో బతికేలా చూడాలని బోయల సంయుక్త కార్యాచరణ కమిటీ కోరింది. ఈ సంఘం ప్రతినిధులు మార్టూరు క్రాస్ వద్ద జగన్‌ను కలిసి తమ ఇక్కట్లను ఏకరవుపెట్టారు. విశాఖలో విలీనమైన అనకాపల్లి పురపాలక సంఘ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కూడా 010 పద్దు కిందనే జీతభత్యాలు ఇప్పించాలని అనకాపల్లి జోనల్ ఉద్యోగులు కోరారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని, జీవో నెంబర్ 40ని రద్దు చేయాలని, ఎన్‌ఎంఆర్‌లను పర్మినెంట్ చేయాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఎంటీఎస్ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. 11 ఏళ్లుగా పని చేస్తున్న తమకు ఏ సౌకర్యాలూ లేవని కశింకోట మండలం సుందరయ్యపేట వద్ద ఉన్న జీఎస్బీ కంపెనీ వర్కర్లు జగన్‌కు ఫిర్యాదు చేశారు. జీవాలు ఇప్పించండి యాదవులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం నేతలు కోరారు. జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని, గొర్రెలు, మేకలు, పాడి పశువులను పూర్తి సబ్సిడీపై ఇప్పించాలన్నారు. గవరపాలెం సౌత్ ప్రాంతంలో ఉన్న ఆవగర్భం ‘ఆవ’ను పరిరక్షించాలని అనకాపల్లి ఆవ కందం పరిరక్షణ సమితి నేతలు కోరారు. ఈ ఆవను స్థానిక ఎంఎల్ఏ అనుచరులు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయిస్తున్నారని జగన్‌కు ఫిర్యాదు చేశారు. మా గ్రూపునకు ఒక్క పైసా మాఫీ కాలేదు అధికారంలోకి వచ్చాక డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు చెబితే నమ్మాము. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. మా గ్రూపులో పది మంది సభ్యులం కలిసి రూ.3 లక్షలు రుణం తీసుకున్నాము. పైసా కూడా మాఫీ కాకపోవడంతో వడ్డీకి వడ్డీ కట్టలేక అల్లాడుతున్నాం. చంద్రబాబు మమ్మల్ని దారుణంగా మోసం చేశారు. – కోరుకొండ రమణమ్మ, శ్రీసాయి గ్రూప్, మామిడిపాలెం వైఎస్ చేసిన మేలు మరచిపోలేను మాది శ్రీకాళహస్తి. మాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నేను, నాభార్య వెంకటమ్మ కలిసి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసి పిల్లల్ని చదివిస్తున్నాము. అందులో ముగ్గురు పిల్లల పెద్ద చదువులు కోసం ఉన్న అర ఎకరం భూమిని 2005లో రూ.60 వేలకు అమ్మదలిచాము. అదే సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ మమ్మల్ని ఆదుకుంది. ఆయన చలువతో ఆ భూమి అమ్మకుండానే పిల్లల చదువులు పూర్తయ్యాయి. ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అందుకే రాజన్న అన్నా, ఆయన బిడ్డన్నా ప్రాణం పెడతాను. అందుకే చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి జగనన్న వెంట పాదయాత్రలో నడుస్తున్నాను. జూలై 4న నా పెద్ద కుమారుడు కాటయ్య పెళ్లి జరిగితే ఒక్కరోజే వెళ్లి అక్షింతలు వేసి వచ్చాను. – తొండు గురవయ్య చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలి తుమ్మపాల చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని మా గ్రామానికి చెందిన వ్యవసాయదారుల సంఘం తరఫున వైఎస్ జగన్ గారికి వినతి పత్రం అందించాము. 1959లో స్థాపించిన ఈ ఫ్యాక్టరీని చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మూసివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందులో భాగంగానే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనుకున్నారు. రైతులు వ్యతిరేకించడంతో అప్పట్లో ఆగింది. దివంగత నేత వైఎస్సార్ ఫ్యాక్టరీని, రైతులను ఆదుకున్నారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మూసేశారు. దీంతో తొమ్మిది మండలాల చెరకు రైతులు కష్టాల్లో పడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని ప్రారంభించి రైతులను ఆదుకోవాలని జగన్ గారిని కోరాము. ఆయన భరోసా ఇచ్చారు. – పీలా బుజ్జి, ఎం.మోతునాయుడు, రైతులు ప్రజా సంకల్ప యాత్ర 250 వ రోజు ఇప్పటి వరకు నడిచిన దూరం - 2,847.6 కిలోమీటర్లు 250వ రోజు నడిచిన దూరం - 4.8 కిలోమీటర్లు ప్రారంభం - ఉదయం 8.45 గంటలకు తుమ్మపాల శివారు ముగింపు- వూడేరు క్రాస్ శివారు ముఖ్యాంశాలు ♦ అనకాపల్లి నియోజకవర్గం తుమ్మపాల, మార్టూరి క్రాస్, బవులవాడ క్రాస్, త్రిమూర్తుల వారి గుడి జంక్షన్, రిక్షాకాలనీ జంక్షన్, ధర్జీనగర్, వూడేరు క్రాస్ గ్రామాల ప్రజలతో మమేకం. ♦ దారిపొడవునా సమస్యలు చెప్పుకున్న జనం -
మీరొస్తే చెక్క బొమ్మలకూ ప్రాణం
‘జగనన్నొస్తే చాలు.. మా బొమ్మలకు మళ్లీ ప్రాణమొస్తుందయ్యా.. మా వూరికే కొత్త కళొస్తుంది.’ – చెక్కబొమ్మల తయారీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఏటికొప్పాకలో ప్రతి ఇంటా వినిపించిన మాట ఇది. ఆ ఊరి వాళ్లంతా జననేతను కలిశారు. ఇప్పుడున్న పరిస్థితిని చెప్పుకుని బాధ పడ్డారు. ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కలవరించని ఇల్లు లేదు.. పలకరించని పల్లె లేదు.. కష్టాలు చెప్పుకోని వ్యక్తులూ కనిపించలేదు. ఆశీర్వదించిన అమ్మ.. హారతి పట్టిన అక్కచెల్లెమ్మలు.. నాగలి పట్టే రైతన్న.. పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు.. బంగారు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న యువత.. చెక్కబొమ్మల కళాకారులు.. ఇలా ఎవరిని కదిపినా వేడి నిట్టూర్పులే.. ‘బాబు పాలనలో అన్నీ కష్టాలే.. జగనన్న వస్తేనే బావుంటుంది’ అంటూ ఆకాంక్షించారు. తమ కష్టాలు చెప్పుకుని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 243వ రోజు గురువారం జగన్.. విశాఖ జిల్లా పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగించారు. దార్లపూడి నుంచి ప్రారంభమైన యాత్ర.. ఏటికొప్పాక, పద్మరాజుపేట, పురుషోత్తం పట్టణం మీదుగా భారీ జనసందోహం మధ్య సాగింది. ఈ కళను బతికించండన్నా.. ‘కొప్పాక కొయ్య బొమ్మలకు 400 ఏళ్ల నేపథ్యముంది. దేశ విదేశాల్లో బొమ్మలకు మంచి గిరాకీ ఉంది. ఇక్కడి ప్రజలకు ఇదే జీవనాధారం. ఆదాయం కన్నా.. ఆ కళను బతికించాలన్నదే ఆరాటం. కానీ చంద్రబాబు సర్కారు వచ్చాక కొయ్య బొమ్మలు కళ తప్పుతున్నాయి. ఏయేటికాయేడు కరెంట్ బిల్లులు పెంచడంతో గిట్టుబాటు కాని పరిస్థితి. కొయ్య బొమ్మలకు అంకుడు కర్రే ముడి సరుకు. అడవినిండా ఇది దొరుకుతున్నా అధికారులు అడ్డుపడుతున్నారు. ప్రభుత్వం కంటి తుడపుగా ఊళ్లో ఓ డిపో పెట్టినా, దాని ద్వారా కర్ర ఇచ్చిందే లేదు. బతకడం కోసమని చాలా మందిమి కార్పొరేట్ కంపెనీల్లో కూలీలుగా వెళ్తున్నాము. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోదు.. మనసున్న మీరొస్తేనే ఈ ప్రాచీన కళ బతుకుతుంది. చెక్క, లక్కపై సబ్సిడీ ఇచ్చి ఆదుకోండి’ అని చెక్కబొమ్మల కళాకారులు జగన్‌ను కోరారు. అధికారంలోకి రాగానే అన్ని విధాల ఆదుకుంటానని జననేత వారికి భరోసా ఇచ్చారు. చెరకు పంట శాపమైంది దార్లపూడి, ఏటికొప్పాకకు జగన్ వెళ్తున్నప్పుడు రోడ్డుకిరువైపులా చెరకు పంట భూములే. వాటిల్లోంచి ఎంతో మంది రైతులు పరుగెత్తుకుంటూ జననేత వద్దకొచ్చి కష్టాలు చెప్పుకున్నారు. ఏటికొప్పాక సహకార చక్కెర ఫ్యాక్టరీనే నమ్ముకుని వేసిన చెరకు పంట తమకు శాపమైందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీ నష్టాల్లోకెళ్లిందని చెప్పారు. ఒకవైపు చెరకు పంటకు గిట్టుబాటు ధర లేదని, మరోవైపు అప్పుల్లో ఉందనే సాకుతో ఫ్యాక్టరీ వాళ్లు ఆ డబ్బులూ సరిగా ఇవ్వడం లేదన్నారు. నాన్నగారి హయాంలో ఫ్యాక్టరీకి చెరకు వెళ్లంగానే చేతికి డబ్బులొచ్చేవని భద్రయ్య అనే రైతు చెప్పాడ. ‘ఇదెక్కడి ప్రభుత్వమయ్యా... తిండిపెట్టే రైతు కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది’ అంటూ అన్నం రమణ అనే రైతు జీరబోయిన గొంతుతో బావురుమన్నాడు. ‘రోజుకు 3 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదయ్యా.. పైర్లు ఎండిపోతున్నాయి’ అంటూ వరి రైతులు సోమశేఖర్, బలరామయ్య తెలిపారు. అగ్రీగోల్డ్ ముంచేసిందయ్యా... దార్లపూడి, ఏటికొప్పాక గ్రామాల్లో అగ్రీగోల్డ్ బాధితులు వైఎస్ జగన్‌ను కలిసి కన్నీరు మున్నీరయ్యారు. దార్లపూడిలోనే 45 మంది దాదాపు రూ. కోటి మేర డిపాజిట్లు చేసినట్టు చెప్పారు. ‘నమ్మి డిపాజిట్లు సేకరించాను. ఖాతాదారులు నా వెంటపడుతున్నారు. ఏం చెయ్యాలో తెలియడం లేదన్నా’ అంటూ చంటమ్మ బావురు మంది. జగన్‌ను కలిసిన ఇరసపు గోవిందమ్మ బాధ అంతా ఇంతా కాదు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ల పెళ్లికి ఉపయోగపడుతుందని రెక్కల కష్టాన్ని అగ్రిగోల్డ్‌లో పెట్టిందట. బోర్డు తిప్పేశాక ఏడవని రోజు లేదని చెప్పింది. అగ్రీగోల్డ్ బాధితుల పక్షాన జగననన్న పోరాడుతున్న తీరు చూసి ఒక్కసారి కలవాలని వచ్చానంది. జగన్ అధికారంలోకిస్తే మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. లోకేశ్‌ను కలిసినా పింఛన్ రాలేదు.. పెన్షన్ కోసం ఐదుసార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని దార్లపూరికి చెందిన తలమరి రామయ్య అనే వృద్ధుడు వాపోయాడు. మంత్రి లోకేశ్‌ను కలిసినా కూడా లాభం లేదయ్యా.. అన్నాడు. కొడుకు చనిపోయి, కోడలి ఆరోగ్యం సరిగా లేకపోయినా వితంతు పెన్షన్ కోసం తిప్పించుకుంటున్నారని, జన్మభూమి కమిటీ కనికరం చూపడం లేదని ఏటి కొప్పాక వద్ద దమ్ము ఎరుకమ్మ జననేత ఎదుట వాపోయింది. వికలాంగులను పెళ్లి చేసుకుంటే చంద్రన్న పెళ్లి కానుక కింద రూ.75 వేలు ఇస్తానన్నారని, అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకునే వాళ్లే లేరని దేవారపు రాము తెలిపాడు. ‘ఇద్దరు పిల్లలూ వికలాంగులే.. ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం లేదన్నా..’ అంటూ కంబాల అప్పయ్యమ్మ జననేతకు చెప్పుకుంది. దారిపొడవునా ఇలా వందలాది మంది కష్టాలు చెప్పుకున్నారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జననేత.. త్వరలోనే నవలోకం వస్తుందని, కష్టాలన్నీ తీరతాయని ధైర్యం చెప్పారు. కక్షగట్టి ఉపాధి లేకుండా చేశారు మా కుటుంబానికి జాబ్ కార్డు ఉంది. మేమంతా ఉపాధి కూలీలమే. మహానేత వైఎస్‌పై ఉన్న అభిమానంతో గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్లు వేశాం. దీంతో కక్షగట్టి నాలుగున్నరేళ్లుగా మాకు ఉపాధి లేకుండా చేశారు. పనులు ఇప్పించండయ్యా.. అని ఎన్నిసార్లు వెళ్లి అడిగినా.. ‘మీరు వైఎస్సార్సీపీ కదా.. మీకు ఎమ్మెల్యే గారు పనులివ్వొద్దన్నారు.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో’ అన్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు మావి. మాలాంటి చిన్నవాళ్లతో కూడా టీడీపోళ్లు ఆటలాడుకుంటున్నారు. జగన్‌బాబుకు మా కష్టం చెప్పుకున్నాం. ఆరు నెలలు ఓపిక పట్టండి.. మంచిరోజులొస్తాయని ధైర్యం చెప్పారు. ఆ బాబు అధికారంలోకి రావాలి. మాబోటి పేదల కష్టాలు తీరాలి. – గార అప్పారావు, కుటుంబ సభ్యులు రాజన్న పాలనలో ఖుషీగా ఉండేవాళ్లం రాజశేఖరరెడ్డి హయాంలో అప్పట్లోనే చెరకుకు గిట్టుబాటు ధర రూ.1600కు పైగా ఇచ్చారు. అప్పట్లో ఏటికొప్పాక చక్కెర ఫ్యాక్టరీ 3.80 లక్షల టన్నులు క్రషింగ్ చేõసేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతుకు గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేక చెరకు సాగు తగ్గించేశారు. ఈ ఏడాది 80 వేల టన్నుల క్రషింగ్ ఆడింది. రాజన్న రాజ్యంలో ఎంతో ఖుషీగా ఉండేవాళ్లం. – అన్నం రమణ, చెరకు రైతు -
ద్విచక్ర వాహనం కొనలేదని యువకుడి ఆత్మహత్య
విశాఖ సిటీ, చోడవరం టౌన్: ద్విచక్రవాహనం కొనలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నా డు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో దుడ్డుపాలెం ఎస్సీ కాలనీలో ఉంటున్న ములకలపల్లి భానుసురేష్ (16) పెయింటింగ్ పనులు చేస్తుం టాడు. తన కు ద్విచక్రవాహనం కొనా లని ఇంటిలో వారిని కొద్ది రోజులగా అడుగుతున్నాడు. అయితే మన పరిస్థితి అంతంత మాత్రమేనని తరువాత కొనుక్కుందామని కుటుంబ స భ్యులు సురేష్‌కి చెప్పారు. అనకాపల్లి మండలం వడ్లపూడిలో సురేష్ కుటుం బం నివసించేది. సురేష్ తండ్రి కొండలరావు నాలుగేళ్ల కిందట మరణించడంతో తల్లి మారెమ్మ పిల్లలను తీసుకుని అమ్మగారి ఊరు దుడ్డుపాలెం వచ్చేసింది. కూలిపని చేస్తూ కు టుంబాన్ని పోషిస్తోంది. భాను సురేష్ కూడా చదువు మానేసి పెయింటింగ్ పనికి, రేషన్ డిపోలో తూనికలు వేయడానికి వెళ్తుండేవాడు. దసరా సందర్భంగా శనివారం సొంత ఊరు వడ్లపూడికి కుటుంబ సభ్యులంతా వెళ్లారు. తనకు పని ఉందని, దుడ్డుపాలెం వెళ్లిపోతానని తల్లి మారెమ్మ వద్ద రూ. వంద తీసుకుని అక్కడి నుంచి సురేష్ సోమవారం ఉదయం వచ్చేశాడు. మారెమ్మ సోమవారం సాయంత్రం దుడ్ముపాలెం వచ్చింది. ఇంటికి వచ్చి తలుపులు తీసి చూసేసరికి చీరతో ఉరివేసుకుని సురేష్ వేలాడుతుండడం చూసి భోరున విలపించింది. స్థానికులు వచ్చి సురేష్ మృతి దేహాన్ని కిందకి దించారు. అయితే సురేష్ తండ్రికి తరఫు బంధువులు మాత్రం సురేష్ మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మల్లేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. సురేష్‌కి తమ్ముడు హర్ష ఉన్నాడు. -
సైకో వీరంగం
మర్రిపాలెం (విశాఖ ఉత్తరం) : మర్రిపాలెంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. పూటుగా మద్యం తాగి ఉన్మాదిలా విరుచుకుపడ్డాడు. మద్యం సీసా పగులకొట్టి పొడిచేందుకు ప్రయత్నించాడు. దీంతో హడలిపోయిన ప్రజలు పరుగులు తీశారు. పోలీసులకు సమాచారం అందించడంతో పరారయ్యాడు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మర్రిపాలెం ప్రధాన రహదారిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అతిగా మద్యం సేవించాడు. ఒడిశా భాషలో మాట్లాడుతూ బిగ్గరగా కేకలు వేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా మద్యం సీసా పగులకొట్టాడు. ఆ దారిలో పాదచారుల మీద ప్రతాపం చూపించాడు. సీసాతో పొడిచేందుకు ముందుకు రావడంతో ప్రాణ భయంతో ప్రజలు పరుగులు తీశారు. ఈ విషయాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించడంతో కొద్దిసేపటికి ఎయిర్పోర్ట్ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. ఉన్మాదిలా ప్రవర్తించిన వ్యక్తి కోసం గాలించారు. అప్పటికే ఆ వ్యక్తి పరారయ్యాడు. మర్రిపాలెం పరిసర ప్రాంతాలలో గాలించినా ఆచూకీ తెలియరాలేదు. ఇదిలా ఉండగా గలాటా సృష్టించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, గాయాలతో ఉన్న అతనికి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుపోయాడని మరో కథనం వినిపిస్తోంది. అయితే ఎవరూ నేరుగా ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు కాలేదు. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి తమకు సమాచారం అందిన విషయం వాస్తవమని ఎయిర్పోర్ట్ సీఐ ఎన్.వి.ప్రభాకర్ స్పష్టం చేశారు. పోలీసులు Ððవెళ్లేసరికి ఆగంతకుడు కనిపించలేదని తెలిపారు. గాయపడినట్టు ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలలో చాటుమాటుగా అమ్మకాలు జరగడంపై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సైకో సీసాతో పొడిచి వుంటే ప్రాణ నష్టం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. -
సినీఫక్కీలో స్మగ్లింగ్
సాక్షి, విశాఖపట్నం: ఆ మధ్య తమిళ హీరో సూర్య నటించిన చిత్రంలో ఓ పాత్రధారి కడుపులో కొకైన్ టాబ్లెట్స్ పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తుంటాడు. చివరకు వాటిలో ఒకటి కడుపులోనే పగిలిపోవడంతో ప్రాణం మీదకు తెచ్చుకుంటాడు. బంగారం స్మగ్లర్లు ఇప్పుడు ఈ దారినే ఎంచుకున్నారు. ఇన్నాళ్లూ బూట్లు, దుస్తులు, టీవీలు, ఐరెన్ బాక్స్‌లు వంటి వాటిలో విదేశాల నుంచి బంగారం రవాణా చేసే స్మగ్లర్లు... ఇప్పుడు కడుపులో బంగారం బిస్కెట్లు రవాణా చేస్తున్నారు. ఒకప్పుడు ముంబయి, హైదరాబాద్, చెన్నై వంటి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల మీదుగా విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఘరానాబాబులు ఇటీవల కాలంలో విశాఖ ఎయిర్‌పోర్టును ఎంచుకున్నారు. మూడేళ్లుగా పెరిగిన కార్యకలాపాలు గడిచిన మూడేళ్లుగా విశాఖ ఎయిర్ పోర్టు ద్వారా విమానాల సంఖ్యతో ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అదే స్థాయిలో స్మగ్లింగ్ కార్యకలాపాలు కూడా పెచ్చుమీరుతున్నాయి. గడిచిన మూడేళ్లలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ సుమారు 82 మంది పట్టుబడగా... రూ.10కోట్లకు పైగా విలువైన బంగారం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువగా దుబాయి నుంచే బంగారం బిస్కెట్ల అక్రమ రవాణా సాగుతోంది. గత ఏడాది దుబాయి నుంచి నాలుగున్నర కేజీల బంగా రాన్ని తీసుకొస్తున్న ఏడుగురిని కస్టమ్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు మహిళల నుంచి 4కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది టీవీలు, స్పీకర్లలో రూ.2కోట్ల విలువైన బంగారాన్ని స్మగింగ్ చే స్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శ్రీలంక వాసిని పట్టించిన మెటల్‌డిటెక్టర్ తాజాగా శ్రీలంకకు చెందిన అబ్దుల్ రజాక్ కడుపులో బంగారం కాయిన్స్ పెట్టుకుని రవాణా చేస్తూ కస్టమ్స్ పోలీసులకు చిక్కాడు. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌లో శ్రీలంక నుంచి విశాఖకు చేరుకున్న రజాక్ బయటకొస్తుండగా... కస్టమ్స్ అధికారులు మెటల్ డిటెక్టర్‌తో తనిఖీలు చేస్తుండగా కడుపులో ఉన్న పసిడి బయటపడింది. అనుమానం వచ్చిన అధికారులు రజాక్‌ను బాత్ రూమ్‌లోకి తీసుకెళ్లి విచారించేసరికి అసలు విషయం కక్కేశాడు. ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున బరువున్న 8 బిస్కెట్లు కవర్లో చుట్టి మింగేశాడు. మల ద్వారం నుంచి ఐదు కాయిన్స్ బయటకు తీయగలిగారు. మరో మూడు కాయిన్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతం కేజీహెచ్‌లోనే ప్రత్యేక పోలీసుల బందోబస్తు మధ్య ఉంచారు. మంగళవారం మిగిలిన మూడు కాయిన్స్‌ను కూడా వెలికి తీసి ఆ తర్వాత పోలీసులకు అప్పగిస్తామని వైద్యులు తెలిపారు. కాగా కస్టమ్స్ పోలీసులతో పాటు శ్రీలంక నుంచి వచ్చిన ఆ దేశ కస్టమ్స్ సిబ్బంది కూడా నిందితుడు అజీజ్‌ను కేజీహెచ్‌లో విచారించారు. గతంలో కూడా రజాక్ ఇదే రీతిలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినట్టుగా సమాచారం. స్మగ్లర్లు సినీఫక్కీలో కడుపులో పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తుండడం కస్టమ్స్ పోలీసులకు సవాల్‌గా మారింది. -
నేనున్నానని...
-
విశాఖలో లెక్కల మాస్టారి తిక్కవేషాలు
విశాఖపట్నం: చిన్నారులపై కీచకల పరంపర కొనసాగుతోంది. విద్య నేర్పాల్సిన గురువులే దారితప్పి ప్రవర్తిస్తున్నారు. కీచక టీచర్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా విశాఖ జిల్లాలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని లెక్కల మాస్టారు వేధింపులకు పాల్పడుతున్న ఘటన ఊర్వశి జంక్షన్‌లోని న్యూటన్ స్కూల్లో చోటుచేసుకుంది. విద్యార్థిని కీచక మాస్టర్ వేధింపులు భరించలేక చివరికి మాస్టర్ గారి తిక్కవేశాల గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, స్థానికుల సహాయంతో కీచక టీచర్‌కు దేహశుద్ధి చేశారు. విద్యార్ధులపై వేధింపులకు గురిచేసిన టీచర్‌పై చర్య ఎందుకు తీసుకోలేదంటూ పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. అయినా స్కూలు యాజమాన్యం పట్టించుకోవటం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు. -
విశాఖలో అక్రమంగా గంజాయి రవాణా, నలుగురు అరెస్ట్
విశాఖపట్నం: అక్రమంగా గంజాయి రవాణా యదేచ్ఛగా కొనసాగుతోంది. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాలపై పోలీసులు దాడులు చేస్తున్నా వారి ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. విశాఖ జిల్లాలోని ఆరులోవలో సోమవారం అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అక్రమ గంజాయి తరలిస్తున్న వారిలో ముగ్గురు ఒరిస్సాకు చెందిన కోరాపుట్‌కు చెందిన వారిగా గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు.