
చెరువూరు గ్రామంలో జరిగిన ఆటో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని చెరువూరు గ్రామంలో ఆదివారం జరిగిన ఆటో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీకొన్న ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
విశాఖ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. చెరువూరులో విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీకొన్న దుర్ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చింతపల్లి ప్రమాద బాధితుల్ని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ పరామర్శించారు. లోతుగడ్డ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం ఏర్పాట్లు పర్యవేక్షించారు.