అన్నా.. ఆశలన్నీ మీపైనే | Ys jagan prajasankalpa yatra in visaka district | Sakshi
Sakshi News home page

అన్నా.. ఆశలన్నీ మీపైనే

Aug 31 2018 3:52 AM | Updated on Aug 31 2018 9:44 AM

Ys jagan prajasankalpa yatra in visaka district - Sakshi

తుమ్మపాల–బవులవాడ క్రాస్‌ మధ్య జగన్‌ వెంట అడుగులేస్తున్న జనసందోహం , వైఎస్‌ జగన్‌కు తమ సమస్యలు వివరిస్తున్న కాంట్రాక్ట్‌ మహిళా ఉద్యోగులు

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఊరూరా జగన్‌ నినాదం.. జననేత జనంతో మమేకం.. ఊళ్లకు ఊళ్లు ఎదురేగి ఘన స్వాగతం.. ప్రతి గుండె ప్రతిధ్వనిస్తున్న చిత్రం.. మరో వైపు సమస్యల హోరు.. ప్రభుత్వంపై బాధితుల శాపనార్థాలు.. బతుకు భారమైందని విన్నపాలు.. ఆదుకోవాలని వేడుకోలు.. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని విధాలా మోసపోయి.. నష్టపోయామని, మీరొస్తేనే న్యాయం జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షించారు. ప్రజా సంకల్ప యాత్ర గురువారం 250వ రోజు విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలోని తుమ్మపాల శివారు నుంచి ప్రారంభమై మర్టూరు క్రాస్, బవులవాడ క్రాస్, త్రిమూర్తుల నగర్‌ మీదుగా దర్జీనగర్‌ వరకు కొనసాగింది.

దారిపొడవునా జనం ఎదురేగి జననేతను తమ గ్రామాల్లోకి ఆహ్వానించారు. పుష్పగుచ్ఛాలు అందజేశారు. దిష్టి తీశారు. హారతులు పట్టారు. బాణసంచా కాల్చారు. కోలాటాలు, భజనలు, గంగిరెద్దులతో స్వాగతించారు. అడుగడుగో జగనన్న అంటూ తల్లులు.. చిన్నారులకు చూపించారు. జననేతతో కరచాలనం కోసం పోటీపడ్డారు. మరోవైపు పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్లు ఇవ్వడం లేదని, నీటి సమస్య తీరలేదని, ఆరోగ్య శ్రీ వర్తించడం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. కశింకోట మండలం తీడ పంచాయతీ మాజీ సర్పంచ్‌ సోమిరెడ్డి నాయుడు, టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు తగరంపూడి నూకరత్నం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
 
తుమ్మపాల చక్కెరతోనే మా బతుకు..
విశాఖ జిల్లాలో 9 మండలాలు, 149 గ్రామాలకు జీవనాధారంగా ఉన్న తుమ్మపాల చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి తమను ఆదుకోవాలని వివిధ గ్రామాల రైతులు, సహకార, ఉద్యోగ సంఘాల నేతలు తుమ్మపాలలో జగన్‌కు వినతి పత్రాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తమకీ కష్టాలు తప్పడం లేదని ఫిర్యాదు చేశారు.

42 నెలలుగా కర్మాగారంలో పని చేస్తున్న కార్మికులు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ప్రావిడెంట్‌ ఫండ్‌ను తమ ఖాతాల్లో జమ చేయకపోవడంతో చనిపోయిన వారి కుటుంబాలకు, రిటైర్‌ అయిన వారికి పెన్షన్‌ రావడం లేదని వాపోయారు. ఈ ఫ్యాక్టరీని తెరిపించకపోతే 300 కార్మిక కుటుంబాలు, 14 వేల రైతు కుటుంబాలు బజారు పాలవుతాయని చెప్పారు. దీనిపై జగన్‌ స్పందిస్తూ.. మనందరి ప్రభుత్వం రాగానే ఫ్యాక్టరీని తెరిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  

సబ్‌ ప్లాన్‌ సరే.. కేటాయింపులేవీ?
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని చేసినా బడ్జెట్‌ కేటాయింపులకు నేటి వరకు విధివిధానాలు ఖరారు చేయలేదని ఎస్సీ, ఎస్టీ కులాల, సంక్షేమ పరిరక్షణ సంఘం జగన్‌తో గోడు వెళ్లబోసుకుంది. బడ్జెట్లలో నిధులు కేటాయిస్తున్నా అవి సక్రమంగా వినియోగం కావడం లేదని, దీనిపై అంబుడ్స్‌మెన్‌ కమిటీ ఏర్పాటయ్యేలా చూడాలని కోరింది.  వాల్మీకి (బోయ) కులస్తులకు బంజరు భూములను ఇచ్చి ఆత్మగౌరవంతో బతికేలా చూడాలని బోయల సంయుక్త కార్యాచరణ కమిటీ కోరింది.

ఈ సంఘం ప్రతినిధులు మార్టూరు క్రాస్‌ వద్ద జగన్‌ను కలిసి తమ ఇక్కట్లను ఏకరవుపెట్టారు. విశాఖలో విలీనమైన అనకాపల్లి పురపాలక సంఘ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కూడా 010 పద్దు కిందనే జీతభత్యాలు ఇప్పించాలని అనకాపల్లి జోనల్‌ ఉద్యోగులు కోరారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని, జీవో నెంబర్‌ 40ని రద్దు చేయాలని, ఎన్‌ఎంఆర్‌లను పర్మినెంట్‌ చేయాలని, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఎంటీఎస్‌ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. 11 ఏళ్లుగా పని చేస్తున్న తమకు ఏ సౌకర్యాలూ లేవని కశింకోట మండలం సుందరయ్యపేట  వద్ద ఉన్న జీఎస్‌బీ కంపెనీ వర్కర్లు జగన్‌కు ఫిర్యాదు చేశారు.   

జీవాలు ఇప్పించండి
యాదవులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం నేతలు కోరారు. జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని, గొర్రెలు, మేకలు, పాడి పశువులను పూర్తి సబ్సిడీపై ఇప్పించాలన్నారు. గవరపాలెం సౌత్‌ ప్రాంతంలో ఉన్న ఆవగర్భం ‘ఆవ’ను పరిరక్షించాలని అనకాపల్లి ఆవ కందం పరిరక్షణ సమితి నేతలు కోరారు. ఈ ఆవను స్థానిక ఎంఎల్‌ఏ అనుచరులు ఆక్రమించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయిస్తున్నారని జగన్‌కు ఫిర్యాదు చేశారు.


మా గ్రూపునకు ఒక్క పైసా మాఫీ కాలేదు
అధికారంలోకి వచ్చాక డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు చెబితే నమ్మాము. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. మా గ్రూపులో పది మంది సభ్యులం కలిసి రూ.3 లక్షలు రుణం తీసుకున్నాము. పైసా కూడా మాఫీ కాకపోవడంతో వడ్డీకి వడ్డీ కట్టలేక అల్లాడుతున్నాం. చంద్రబాబు మమ్మల్ని దారుణంగా మోసం చేశారు. – కోరుకొండ రమణమ్మ, శ్రీసాయి గ్రూప్, మామిడిపాలెం

వైఎస్‌ చేసిన మేలు మరచిపోలేను
మాది శ్రీకాళహస్తి. మాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నేను, నాభార్య వెంకటమ్మ కలిసి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసి పిల్లల్ని చదివిస్తున్నాము. అందులో ముగ్గురు పిల్లల పెద్ద చదువులు కోసం ఉన్న అర ఎకరం భూమిని 2005లో రూ.60 వేలకు అమ్మదలిచాము. అదే సమయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మమ్మల్ని ఆదుకుంది. ఆయన చలువతో ఆ భూమి అమ్మకుండానే పిల్లల చదువులు పూర్తయ్యాయి. ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అందుకే రాజన్న అన్నా, ఆయన బిడ్డన్నా ప్రాణం పెడతాను. అందుకే చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి జగనన్న వెంట పాదయాత్రలో నడుస్తున్నాను. జూలై 4న నా పెద్ద కుమారుడు కాటయ్య పెళ్లి జరిగితే ఒక్కరోజే వెళ్లి అక్షింతలు వేసి వచ్చాను.       – తొండు గురవయ్య  

చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలి
తుమ్మపాల చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని మా గ్రామానికి చెందిన వ్యవసాయదారుల సంఘం తరఫున వైఎస్‌ జగన్‌ గారికి వినతి పత్రం అందించాము. 1959లో స్థాపించిన ఈ ఫ్యాక్టరీని చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మూసివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందులో భాగంగానే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనుకున్నారు. రైతులు వ్యతిరేకించడంతో అప్పట్లో ఆగింది. దివంగత నేత వైఎస్సార్‌ ఫ్యాక్టరీని, రైతులను ఆదుకున్నారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మూసేశారు. దీంతో తొమ్మిది మండలాల చెరకు రైతులు కష్టాల్లో పడ్డారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని ప్రారంభించి రైతులను ఆదుకోవాలని జగన్‌ గారిని కోరాము. ఆయన భరోసా ఇచ్చారు. – పీలా బుజ్జి, ఎం.మోతునాయుడు, రైతులు


ప్రజా సంకల్ప యాత్ర 250 వ రోజు
ఇప్పటి వరకు నడిచిన దూరం - 2,847.6 కిలోమీటర్లు
250వ రోజు నడిచిన దూరం - 4.8 కిలోమీటర్లు
ప్రారంభం - ఉదయం 8.45 గంటలకు తుమ్మపాల శివారు
ముగింపు-  వూడేరు క్రాస్‌ శివారు

ముఖ్యాంశాలు
♦  అనకాపల్లి నియోజకవర్గం తుమ్మపాల, మార్టూరి క్రాస్, బవులవాడ క్రాస్, త్రిమూర్తుల వారి గుడి జంక్షన్, రిక్షాకాలనీ జంక్షన్, ధర్జీనగర్, వూడేరు క్రాస్‌ గ్రామాల ప్రజలతో మమేకం.
♦   దారిపొడవునా సమస్యలు చెప్పుకున్న జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement