విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం ఏటికొప్పాకలో ప్రతిపక్ష నేత జగన్‌కు వెంకన్న బొమ్మను అందజేస్తూ.. కష్టాలు చెప్పుకుంటున్న చెక్కబొమ్మల తయారీ కళాకారులు
‘జగనన్నొస్తే చాలు.. మా బొమ్మలకు మళ్లీ ప్రాణమొస్తుందయ్యా.. మా వూరికే కొత్త కళొస్తుంది.’ – చెక్కబొమ్మల తయారీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఏటికొప్పాకలో ప్రతి ఇంటా వినిపించిన మాట ఇది. ఆ ఊరి వాళ్లంతా జననేతను కలిశారు. ఇప్పుడున్న పరిస్థితిని చెప్పుకుని బాధ పడ్డారు.
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కలవరించని ఇల్లు లేదు.. పలకరించని పల్లె లేదు.. కష్టాలు చెప్పుకోని వ్యక్తులూ కనిపించలేదు. ఆశీర్వదించిన అమ్మ.. హారతి పట్టిన అక్కచెల్లెమ్మలు.. నాగలి పట్టే రైతన్న.. పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు.. బంగారు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న యువత.. చెక్కబొమ్మల కళాకారులు.. ఇలా ఎవరిని కదిపినా వేడి నిట్టూర్పులే.. ‘బాబు పాలనలో అన్నీ కష్టాలే.. జగనన్న వస్తేనే బావుంటుంది’ అంటూ ఆకాంక్షించారు.
తమ కష్టాలు చెప్పుకుని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 243వ రోజు గురువారం జగన్.. విశాఖ జిల్లా పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగించారు. దార్లపూడి నుంచి ప్రారంభమైన యాత్ర.. ఏటికొప్పాక, పద్మరాజుపేట, పురుషోత్తం పట్టణం మీదుగా భారీ జనసందోహం మధ్య సాగింది.
ఈ కళను బతికించండన్నా..
‘కొప్పాక కొయ్య బొమ్మలకు 400 ఏళ్ల నేపథ్యముంది. దేశ విదేశాల్లో బొమ్మలకు మంచి గిరాకీ ఉంది. ఇక్కడి ప్రజలకు ఇదే జీవనాధారం. ఆదాయం కన్నా.. ఆ కళను బతికించాలన్నదే ఆరాటం. కానీ చంద్రబాబు సర్కారు వచ్చాక కొయ్య బొమ్మలు కళ తప్పుతున్నాయి. ఏయేటికాయేడు కరెంట్ బిల్లులు పెంచడంతో గిట్టుబాటు కాని పరిస్థితి. కొయ్య బొమ్మలకు అంకుడు కర్రే ముడి సరుకు. అడవినిండా ఇది దొరుకుతున్నా అధికారులు అడ్డుపడుతున్నారు.
ప్రభుత్వం కంటి తుడపుగా ఊళ్లో ఓ డిపో పెట్టినా, దాని ద్వారా కర్ర ఇచ్చిందే లేదు. బతకడం కోసమని చాలా మందిమి కార్పొరేట్ కంపెనీల్లో కూలీలుగా వెళ్తున్నాము. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోదు.. మనసున్న మీరొస్తేనే ఈ ప్రాచీన కళ బతుకుతుంది. చెక్క, లక్కపై సబ్సిడీ ఇచ్చి ఆదుకోండి’ అని చెక్కబొమ్మల కళాకారులు జగన్‌ను కోరారు. అధికారంలోకి రాగానే అన్ని విధాల ఆదుకుంటానని జననేత వారికి భరోసా ఇచ్చారు.
చెరకు పంట శాపమైంది
దార్లపూడి, ఏటికొప్పాకకు జగన్ వెళ్తున్నప్పుడు రోడ్డుకిరువైపులా చెరకు పంట భూములే. వాటిల్లోంచి ఎంతో మంది రైతులు పరుగెత్తుకుంటూ జననేత వద్దకొచ్చి కష్టాలు చెప్పుకున్నారు. ఏటికొప్పాక సహకార చక్కెర ఫ్యాక్టరీనే నమ్ముకుని వేసిన చెరకు పంట తమకు శాపమైందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీ నష్టాల్లోకెళ్లిందని చెప్పారు. ఒకవైపు చెరకు పంటకు గిట్టుబాటు ధర లేదని, మరోవైపు అప్పుల్లో ఉందనే సాకుతో ఫ్యాక్టరీ వాళ్లు ఆ డబ్బులూ సరిగా ఇవ్వడం లేదన్నారు.
నాన్నగారి హయాంలో ఫ్యాక్టరీకి చెరకు వెళ్లంగానే చేతికి డబ్బులొచ్చేవని భద్రయ్య అనే రైతు చెప్పాడ. ‘ఇదెక్కడి ప్రభుత్వమయ్యా... తిండిపెట్టే రైతు కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది’ అంటూ అన్నం రమణ అనే రైతు జీరబోయిన గొంతుతో బావురుమన్నాడు. ‘రోజుకు 3 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదయ్యా.. పైర్లు ఎండిపోతున్నాయి’ అంటూ వరి రైతులు సోమశేఖర్, బలరామయ్య తెలిపారు.
అగ్రీగోల్డ్ ముంచేసిందయ్యా...
దార్లపూడి, ఏటికొప్పాక గ్రామాల్లో అగ్రీగోల్డ్ బాధితులు వైఎస్ జగన్‌ను కలిసి కన్నీరు మున్నీరయ్యారు. దార్లపూడిలోనే 45 మంది దాదాపు రూ. కోటి మేర డిపాజిట్లు చేసినట్టు చెప్పారు. ‘నమ్మి డిపాజిట్లు సేకరించాను. ఖాతాదారులు నా వెంటపడుతున్నారు. ఏం చెయ్యాలో తెలియడం లేదన్నా’ అంటూ చంటమ్మ బావురు మంది. జగన్‌ను కలిసిన ఇరసపు గోవిందమ్మ బాధ అంతా ఇంతా కాదు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ల పెళ్లికి ఉపయోగపడుతుందని రెక్కల కష్టాన్ని అగ్రిగోల్డ్‌లో పెట్టిందట. బోర్డు తిప్పేశాక ఏడవని రోజు లేదని చెప్పింది. అగ్రీగోల్డ్ బాధితుల పక్షాన జగననన్న పోరాడుతున్న తీరు చూసి ఒక్కసారి కలవాలని వచ్చానంది. జగన్ అధికారంలోకిస్తే మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది.
లోకేశ్‌ను కలిసినా పింఛన్ రాలేదు..
పెన్షన్ కోసం ఐదుసార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని దార్లపూరికి చెందిన తలమరి రామయ్య అనే వృద్ధుడు వాపోయాడు. మంత్రి లోకేశ్‌ను కలిసినా కూడా లాభం లేదయ్యా.. అన్నాడు. కొడుకు చనిపోయి, కోడలి ఆరోగ్యం సరిగా లేకపోయినా వితంతు పెన్షన్ కోసం తిప్పించుకుంటున్నారని, జన్మభూమి కమిటీ కనికరం చూపడం లేదని ఏటి కొప్పాక వద్ద దమ్ము ఎరుకమ్మ జననేత ఎదుట వాపోయింది.
వికలాంగులను పెళ్లి చేసుకుంటే చంద్రన్న పెళ్లి కానుక కింద రూ.75 వేలు ఇస్తానన్నారని, అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకునే వాళ్లే లేరని దేవారపు రాము తెలిపాడు. ‘ఇద్దరు పిల్లలూ వికలాంగులే.. ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం లేదన్నా..’ అంటూ కంబాల అప్పయ్యమ్మ జననేతకు చెప్పుకుంది. దారిపొడవునా ఇలా వందలాది మంది కష్టాలు చెప్పుకున్నారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జననేత.. త్వరలోనే నవలోకం వస్తుందని, కష్టాలన్నీ తీరతాయని ధైర్యం చెప్పారు.
కక్షగట్టి ఉపాధి లేకుండా చేశారు
మా కుటుంబానికి జాబ్ కార్డు ఉంది. మేమంతా ఉపాధి కూలీలమే. మహానేత వైఎస్‌పై ఉన్న అభిమానంతో గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశాం. దీంతో కక్షగట్టి నాలుగున్నరేళ్లుగా మాకు ఉపాధి లేకుండా చేశారు. పనులు ఇప్పించండయ్యా.. అని ఎన్నిసార్లు వెళ్లి అడిగినా.. ‘మీరు వైఎస్సార్‌సీపీ కదా.. మీకు ఎమ్మెల్యే గారు పనులివ్వొద్దన్నారు.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో’ అన్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు మావి. మాలాంటి చిన్నవాళ్లతో కూడా టీడీపోళ్లు ఆటలాడుకుంటున్నారు. జగన్‌బాబుకు మా కష్టం చెప్పుకున్నాం. ఆరు నెలలు ఓపిక పట్టండి.. మంచిరోజులొస్తాయని ధైర్యం చెప్పారు. ఆ బాబు అధికారంలోకి రావాలి. మాబోటి పేదల కష్టాలు తీరాలి. – గార అప్పారావు, కుటుంబ సభ్యులు
రాజన్న పాలనలో ఖుషీగా ఉండేవాళ్లం
రాజశేఖరరెడ్డి హయాంలో అప్పట్లోనే చెరకుకు గిట్టుబాటు ధర రూ.1600కు పైగా ఇచ్చారు. అప్పట్లో ఏటికొప్పాక చక్కెర ఫ్యాక్టరీ 3.80 లక్షల టన్నులు క్రషింగ్ చేõసేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతుకు గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేక చెరకు సాగు తగ్గించేశారు. ఈ ఏడాది 80 వేల టన్నుల క్రషింగ్ ఆడింది. రాజన్న రాజ్యంలో ఎంతో ఖుషీగా ఉండేవాళ్లం. – అన్నం రమణ, చెరకు రైతు
Comments
Please login to add a commentAdd a comment