రజాక్‌ను కేజీహెచ్‌లో విచారిస్తున్న శ్రీలంక కస్టమ్స్ అధికారులు
సాక్షి, విశాఖపట్నం: ఆ మధ్య తమిళ హీరో సూర్య నటించిన చిత్రంలో ఓ పాత్రధారి కడుపులో కొకైన్ టాబ్లెట్స్ పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తుంటాడు. చివరకు వాటిలో ఒకటి కడుపులోనే పగిలిపోవడంతో ప్రాణం మీదకు తెచ్చుకుంటాడు. బంగారం స్మగ్లర్లు ఇప్పుడు ఈ దారినే ఎంచుకున్నారు. ఇన్నాళ్లూ బూట్లు, దుస్తులు, టీవీలు, ఐరెన్ బాక్స్‌లు వంటి వాటిలో విదేశాల నుంచి బంగారం రవాణా చేసే స్మగ్లర్లు... ఇప్పుడు కడుపులో బంగారం బిస్కెట్లు రవాణా చేస్తున్నారు. ఒకప్పుడు ముంబయి, హైదరాబాద్, చెన్నై వంటి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల మీదుగా విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఘరానాబాబులు ఇటీవల కాలంలో విశాఖ ఎయిర్‌పోర్టును ఎంచుకున్నారు.
మూడేళ్లుగా పెరిగిన కార్యకలాపాలు
గడిచిన మూడేళ్లుగా విశాఖ ఎయిర్ పోర్టు ద్వారా విమానాల సంఖ్యతో ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అదే స్థాయిలో స్మగ్లింగ్ కార్యకలాపాలు కూడా పెచ్చుమీరుతున్నాయి. గడిచిన మూడేళ్లలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ సుమారు 82 మంది పట్టుబడగా... రూ.10కోట్లకు పైగా విలువైన బంగారం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువగా దుబాయి నుంచే బంగారం బిస్కెట్ల అక్రమ రవాణా సాగుతోంది. గత ఏడాది దుబాయి నుంచి నాలుగున్నర కేజీల బంగా రాన్ని తీసుకొస్తున్న ఏడుగురిని కస్టమ్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు మహిళల నుంచి 4కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది టీవీలు, స్పీకర్లలో రూ.2కోట్ల విలువైన బంగారాన్ని స్మగింగ్ చే స్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
శ్రీలంక వాసిని పట్టించిన మెటల్‌డిటెక్టర్
తాజాగా శ్రీలంకకు చెందిన అబ్దుల్ రజాక్ కడుపులో బంగారం కాయిన్స్ పెట్టుకుని రవాణా చేస్తూ కస్టమ్స్ పోలీసులకు చిక్కాడు. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌లో శ్రీలంక నుంచి విశాఖకు చేరుకున్న రజాక్ బయటకొస్తుండగా... కస్టమ్స్ అధికారులు మెటల్ డిటెక్టర్‌తో తనిఖీలు చేస్తుండగా కడుపులో ఉన్న పసిడి బయటపడింది. అనుమానం వచ్చిన అధికారులు రజాక్‌ను బాత్ రూమ్‌లోకి తీసుకెళ్లి విచారించేసరికి అసలు విషయం కక్కేశాడు. ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున బరువున్న 8 బిస్కెట్లు కవర్‌లో చుట్టి మింగేశాడు.
మల ద్వారం నుంచి ఐదు కాయిన్స్ బయటకు తీయగలిగారు. మరో మూడు కాయిన్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతం కేజీహెచ్‌లోనే ప్రత్యేక పోలీసుల బందోబస్తు మధ్య ఉంచారు. మంగళవారం మిగిలిన మూడు కాయిన్స్‌ను కూడా వెలికి తీసి ఆ తర్వాత పోలీసులకు అప్పగిస్తామని వైద్యులు తెలిపారు. కాగా కస్టమ్స్ పోలీసులతో పాటు శ్రీలంక నుంచి వచ్చిన ఆ దేశ కస్టమ్స్ సిబ్బంది కూడా నిందితుడు అజీజ్‌ను కేజీహెచ్‌లో విచారించారు. గతంలో కూడా రజాక్ ఇదే రీతిలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినట్టుగా సమాచారం. స్మగ్లర్లు సినీఫక్కీలో కడుపులో పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తుండడం కస్టమ్స్ పోలీసులకు సవాల్‌గా మారింది.