మర్రిపాలెం (విశాఖ ఉత్తరం) : మర్రిపాలెంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. పూటుగా మద్యం తాగి ఉన్మాదిలా విరుచుకుపడ్డాడు. మద్యం సీసా పగులకొట్టి పొడిచేందుకు ప్రయత్నించాడు. దీంతో హడలిపోయిన ప్రజలు పరుగులు తీశారు. పోలీసులకు సమాచారం అందించడంతో పరారయ్యాడు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మర్రిపాలెం ప్రధాన రహదారిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అతిగా మద్యం సేవించాడు. ఒడిశా భాషలో మాట్లాడుతూ బిగ్గరగా కేకలు వేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా మద్యం సీసా పగులకొట్టాడు. ఆ దారిలో పాదచారుల మీద ప్రతాపం చూపించాడు. సీసాతో పొడిచేందుకు ముందుకు రావడంతో ప్రాణ భయంతో ప్రజలు పరుగులు తీశారు. ఈ విషయాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించడంతో కొద్దిసేపటికి ఎయిర్‌పోర్ట్ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు.
ఉన్మాదిలా ప్రవర్తించిన వ్యక్తి కోసం గాలించారు. అప్పటికే ఆ వ్యక్తి పరారయ్యాడు. మర్రిపాలెం పరిసర ప్రాంతాలలో గాలించినా ఆచూకీ తెలియరాలేదు. ఇదిలా ఉండగా గలాటా సృష్టించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, గాయాలతో ఉన్న అతనికి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుపోయాడని మరో కథనం వినిపిస్తోంది. అయితే ఎవరూ నేరుగా ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు కాలేదు. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి తమకు సమాచారం అందిన విషయం వాస్తవమని ఎయిర్‌పోర్ట్ సీఐ ఎన్.వి.ప్రభాకర్ స్పష్టం చేశారు. పోలీసులు Ððవెళ్లేసరికి ఆగంతకుడు కనిపించలేదని తెలిపారు. గాయపడినట్టు ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలలో చాటుమాటుగా అమ్మకాలు జరగడంపై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సైకో సీసాతో పొడిచి వుంటే ప్రాణ నష్టం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు.
సైకో వీరంగం
Published Tue, Oct 3 2017 9:19 AM | Last Updated on Tue, Oct 3 2017 9:19 AM
Advertisement
Advertisement