రైలులో చిన్న వివాదం ఎంత పనిచేసింది? | Home Guard Dead Psycho Attack In East Godavari | Sakshi
Sakshi News home page

రైలులో చిన్న వివాదం ఎంత పనిచేసింది?

Published Mon, Jan 6 2020 8:31 AM | Last Updated on Mon, Jan 6 2020 10:35 AM

Home Guard Dead Psycho Attack In East Godavari - Sakshi

భార్యతో వెంకటశివ (ఫైల్‌) 

సాక్షి, తూర్పుగోదావరి: సౌమ్యుడు, వివాద రహితుడు, అందరినీ నవ్వుతూ పలకరించే ఆ యువకుని పట్ల ‘విధి’ వక్రించింది. హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రెడ్డి సూర్య వెంకటశివ (36) మరి కొద్ది నిమిషాలలో రైలు దిగి క్షేమంగా ఇంటి చేరుకునేవాడు. కానీ ఈలోపే రైలులోని ఓ ఉన్మాదితో వివాదం తలెత్తింది. ఆ ఉన్మాది శివను రైలులో నుంచి బయటకు తోసేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడిపై ఆధారపడి జీవిస్తున్న తల్లి, భార్య దిక్కులేనివారయ్యారు. ఎప్పటికైనా ఉద్యోగంలో గొప్పవాడై అందరికీ ఆసరాగా ఉంటాడని భావించిన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిపోయారు. అందరితో కలుపుగోరుతనంగా ఉండే ఆ యువ హోంగార్డు ప్రాణాలు కోల్పోవడంతో మండల వ్యాప్తంగా ప్రజలు ఆవేదనకు గురయ్యారు.

చదవండి: 'ఆయన ముక్కు బాలేదు.. నాకీ పెళ్లొద్దు'

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోటనందూరు పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్న శివకు చెరకు క్రషింగు సీజన్‌ నేపథ్యంలో సామర్లకోట సెంటర్లో ట్రాఫిక్‌ డ్యూటీ వేశారు. 15 రోజులు డ్యూటీ టర్నలో భాగంగా ఆదివారం శివ డ్యూటీ ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఆదివారం మధ్యాహం సామర్లకోటలో బొకారో ట్రైన్‌ ఎక్కాడు. రైలులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అబీబ్‌ ఇతర ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిని శివ వారించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో అబీబ్‌  అన్నవరం దాటిన తరువాత హంసవరం సమీపంలో ట్రైన్‌ నుంచి శివను బయటకు తోసేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తుని రైల్వే పోలీసులు మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి  తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు.


కొత్తకొట్టాంలో వెంకటశివ ఇంటి వద్ద శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, (అంతరచిత్రం) హోంగార్డు వెంకట శివ మృతదేహం
 
కొత్త కొట్టాంలో విషాదం 
మండలంలోని కొత్తకొట్టాం గ్రామానికి చెందిన శివ కోటనందూరు పోలీసు స్టేషనులో హోమ్‌ గార్డుగా పని చేస్తున్నాడు. ఇతడి తండ్రి ఆరేళ్ల క్రితం మృతి చెందారు. తల్లి సత్యవతి, శివ కలిసి ఉంటున్నారు. శివకు నలుగురు అక్కలు, అన్నయ్య ఉన్నారు. నలుగురు అక్కలకు పెళ్లిళ్లు జరిగి ఎవరికి వారు జీవిస్తున్నారు. అన్నయ్య గ్రామంలోనే ఉండి వ్యవసాయం చేస్తూ అవకాశం వచ్చినప్పుడు బయట చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తుంటాడు. 10వ తరగతి చదువుకున్న  శివ 2003లో కోటనందూరు పోలీసు స్టేషనులో హోంగార్డుగా చేరాడు.

ఈ 16 ఏళ్లలో కోటనందూరు, తునిటౌన్, తునిరూరల్, అన్నవరం పోలీసు స్టేషన్లు, అన్నవరం కొండపై విధులు నిర్వహించాడు. క్రమశిక్షణతో, అందరితో కలివిడిగా మెలిగే శివ అంటే తోటి ఉద్యోగుల ఎంతో ఇష్టపడేవారు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పరికరించే శివ దుర్మరణం పాలయ్యాడని తెలుసుకుని వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. విశాఖ జిల్లా నాతవరం మండలం, చిక్కుడుపాలెం గ్రామానికి చెందిన దేవిని 2018 జూన్‌ 18న శివ వివాహం చేసుకున్నాడు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో మృత్యువు ఇలా ఉన్మాది రూపంలో వచ్చి శివను కడతేర్చింది. 

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు  
శివ మృతితో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లి, అక్కలు, అన్నయ్య రోదన అందరినీ కలచివేసింది. డ్యూటీ చేస్తున్నంత సమయం నవ్వుతూనే ఉండేవాడని, ఎప్పుడు ఎవరితోనూ గొడవ పడ్డ సందర్భాలు లేవని కోటనందూరు పోలీసు సిబ్బంది చెబుతున్నారు. శివ ఎంతో మంచి వాడని, చెప్పిన పనిని వెంటనే ముగించేవాడని, అతని మరణం స్టేషన్‌కు తీరని లోటని ఎస్సై అశోక్‌ అన్నారు.


తునిలో విలేకరులతో మాట్లాడుతున్న ఎస్పీ నయీం అస్మి

తుని: విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ నయీం అస్మి హుటాహుటిన తుని చేరుకున్నారు. హోంగార్డు శివ మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం అందించారు. శివ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement