సాకేత్ కోసం పంట కాల్వలో గాలిస్తున్న గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది, సాకేత్ (ఫైల్ ఫోటో)
సాక్షి, అమలాపురం రూరల్: ఇంటి ఎదురుగా పారే పంట కాల్వ ఆ చిన్నారిని మృత్యురూపంలో కబళించింది. ఆటలాడుకుంటున్న ఆ చిన్నారి జీవితాన్ని కాల్వ నీరు చిదిమేసింది. అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి శివారు ముంగండవారిపేటకు చెందిన సత్తి షణ్ముఖ సత్యసాయి సాకేత్ (7) ప్రమాదవశాత్తూ ఇంటికెదురుగా పారే పంట కాల్వలో పడి బుధవారం ఉదయం మరణించాడు. అప్పటి వరకూ ఇంటి ముంగిట తోటి పిల్లలతో ఆడుకుంటుండగా ఈ ప్రమాదం సంభవించింది. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో పిల్లలు ఆడుకుంటున్న సమయంలో సాకేత్ కాల్వలో పడిపోయాడు
తోటి పిల్లలు ఈ విషయాన్ని సాకేత్ తల్లిదండ్రులు నరసింహమూర్తి, సంధ్యారాణిలకు చెప్పారు. నరసింహమూర్తి సోదరుడు శ్రీనివాసరావు, స్థానికులు కాల్వలోకి దిగి సాకేత్ కోసం గాలించినా ఫలితం లేదు. దీంతో పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కాల్వలు మూసివేసినా ఎగువ నీరు దిగువకు వస్తుండడంతో ప్రవాహ వేగం అధికంగా ఉంది. అమలాపురం తాలూకా ఎస్సై అందే పరదేశి ఘటనా స్థలికి చేరుకుని గజ ఈతగాళ్లను, ఫైర్ సిబ్బందిని రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు కిలోమీటరు దూరం వరకూ కాల్వలో గాలింపు చేపట్టగా సాకేత్ మృత దేహం లభ్యమైంది. అప్పటి వరకూ ఆటలాడుకుంటూ కళ్లెదుటే కనిపించిన చిన్నారి సాకేత్ విగత జీవిగా కనిపించగానే తల్లిదండ్రులు నిర్ఘాంతపోయి కన్నీటి పర్యంతం అయ్యారు. వన్నె చింతలపూడి గ్రామంలో విషాదం అలుముకుంది.
చదవండి: భార్య, భర్త.. మధ్యలో ప్రియుడు..క్రైమ్ కథా చిత్రమ్
ఒక్కాగానొక్క కొడుకు దూరమై..
నరసింహమూర్తి, సంధ్యారాణి దంపతులకు సాకేత్ ఒక్కగానొక్క కొడుకు. ఏడేళ్ల కొడుకును ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అమలాపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. తండ్రి నరసింహమూర్తి అమలాపురంలోని ఓ ఫైనాన్స్ షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. తల్లి సంధార్యాణి గృహిణి. ఏకైక బిడ్డ కన్ను మూయడంతో ఇంక మేము ఎవరి కోసం బతకాలంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కాల్వల చెంతన లేదా సమీపంలో ఉన్న ఇళ్లకు చెందిన తమ పిల్లలను కదలికను పిల్లల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉండాలని ఎస్సై పరదేశి సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: 24 ఏళ్ల క్రితం పెళ్లి.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. భర్త అడ్డొస్తున్నాడని
Comments
Please login to add a commentAdd a comment