canal water
-
చిన్నారి జీవితాన్ని చిదిమేసిన కాల్వ నీరు.. ఒక్కాగానొక్క కొడుకు దూరమై..
సాక్షి, అమలాపురం రూరల్: ఇంటి ఎదురుగా పారే పంట కాల్వ ఆ చిన్నారిని మృత్యురూపంలో కబళించింది. ఆటలాడుకుంటున్న ఆ చిన్నారి జీవితాన్ని కాల్వ నీరు చిదిమేసింది. అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి శివారు ముంగండవారిపేటకు చెందిన సత్తి షణ్ముఖ సత్యసాయి సాకేత్ (7) ప్రమాదవశాత్తూ ఇంటికెదురుగా పారే పంట కాల్వలో పడి బుధవారం ఉదయం మరణించాడు. అప్పటి వరకూ ఇంటి ముంగిట తోటి పిల్లలతో ఆడుకుంటుండగా ఈ ప్రమాదం సంభవించింది. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో పిల్లలు ఆడుకుంటున్న సమయంలో సాకేత్ కాల్వలో పడిపోయాడు తోటి పిల్లలు ఈ విషయాన్ని సాకేత్ తల్లిదండ్రులు నరసింహమూర్తి, సంధ్యారాణిలకు చెప్పారు. నరసింహమూర్తి సోదరుడు శ్రీనివాసరావు, స్థానికులు కాల్వలోకి దిగి సాకేత్ కోసం గాలించినా ఫలితం లేదు. దీంతో పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కాల్వలు మూసివేసినా ఎగువ నీరు దిగువకు వస్తుండడంతో ప్రవాహ వేగం అధికంగా ఉంది. అమలాపురం తాలూకా ఎస్సై అందే పరదేశి ఘటనా స్థలికి చేరుకుని గజ ఈతగాళ్లను, ఫైర్ సిబ్బందిని రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు కిలోమీటరు దూరం వరకూ కాల్వలో గాలింపు చేపట్టగా సాకేత్ మృత దేహం లభ్యమైంది. అప్పటి వరకూ ఆటలాడుకుంటూ కళ్లెదుటే కనిపించిన చిన్నారి సాకేత్ విగత జీవిగా కనిపించగానే తల్లిదండ్రులు నిర్ఘాంతపోయి కన్నీటి పర్యంతం అయ్యారు. వన్నె చింతలపూడి గ్రామంలో విషాదం అలుముకుంది. చదవండి: భార్య, భర్త.. మధ్యలో ప్రియుడు..క్రైమ్ కథా చిత్రమ్ ఒక్కాగానొక్క కొడుకు దూరమై.. నరసింహమూర్తి, సంధ్యారాణి దంపతులకు సాకేత్ ఒక్కగానొక్క కొడుకు. ఏడేళ్ల కొడుకును ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అమలాపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. తండ్రి నరసింహమూర్తి అమలాపురంలోని ఓ ఫైనాన్స్ షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. తల్లి సంధార్యాణి గృహిణి. ఏకైక బిడ్డ కన్ను మూయడంతో ఇంక మేము ఎవరి కోసం బతకాలంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కాల్వల చెంతన లేదా సమీపంలో ఉన్న ఇళ్లకు చెందిన తమ పిల్లలను కదలికను పిల్లల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉండాలని ఎస్సై పరదేశి సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: 24 ఏళ్ల క్రితం పెళ్లి.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. భర్త అడ్డొస్తున్నాడని -
బతుకమ్మ నిమజ్జనంలో అపశ్రుతి
కల్లూరు రూరల్: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రఘునాథబంజర్‌లో శనివారంరాత్రి జరిగిన బతుకమ్మ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బతుకమ్మను నిమజ్జనం చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు నాగార్జునసాగర్ కాల్వనీటిలో మునిగి మృత్యువాతపడ్డారు. వివరాలు.. నాగార్జునసాగర్ కాల్వలో బతుకమ్మను నిమజ్జనం చేసే క్రమంలో ఖమ్మంపాటి మాధవీలత(25), పసుపులేటి శివ(23) నీటమునిగి మృతిచెందారు. వివరాలు.. రఘునాథబంజర్ గ్రామంలో పేర్చిన బతకమ్మలను శనివారంరాత్రి ఊరేగించారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు అర్ధరాత్రి దాటిన అనంతరం కూడా కొనసాగింది. తర్వాత గ్రామం పక్కనే ఉన్న సాగర్ ప్రధాన కాల్వనీటిలో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు భక్తులంతా అక్కడికి చేరుకున్నారు. బతుకమ్మను నిమజ్జనం చేస్తుండగా ఖమ్మంపాటిమాధవీలత(25) నీటిలోకి జారింది. అక్కడే ఉన్న పసుపులేటి శివ(23)తోపాటు మరో ఇద్దరు కాల్వలోకి దూకి ఆమెను కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా కాసేపటికే మాధవీలత చనిపోయింది. అయితే ఆమె మృతదేహాన్ని గాలించి ఒడ్డుకు చేర్చేక్రమంలో శివ నీటిప్రవాహంలో కొట్టుకుపోయాడు. మాధవీలత మృతదేహాన్ని కాల్వగట్టుపైకి తెచ్చిన కొద్దిసేపటికి అక్కడున్నవారు గుర్తించి శివ కోసం రాత్రంతా గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో కాల్వనీటిపైన మృతదేహం తేలగా గ్రామస్తులు గమనించి ఒడ్డుకు చేర్చారు. పండుగ కోసం ఊరొచ్చి ఇలా.. ఏపీలోని కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన రాధాకృష్ణ, మాధవీలత భార్యాభర్తలు. అక్కడే నివాసముంటున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు రఘునాథబంజర్‌లో రేషన్‌డీలర్. పసుపులేటి శివ తండ్రి రామయ్య సామాన్య కూలీ. రామయ్యకు శివతోపాటు ఓ కుమార్తె ఉంది. శివ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అవివాహితుడు. దసరా పండుగ కోసం వచ్చిన వీరిద్దరూ ఇలా మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పెళ్లిపై గొడవ: అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య, తల్లి గల్లంతు
యశవంతపుర: పెళ్లి సంబంధాలు విషయమై కుటుంబంలో గొడవలకు దారి తీశాయి. దీనిపై తరచూ వాగ్వాదం జరుగుతుండడంతో మనస్తాపం చెందిన తల్లీకూతుళ్లు కాలువలోకి దూకగా.. అది చూసిన సోదరుడు కూడా కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే వారిలో ఇద్దరి మృతదేహాలు లభించగా తల్లి ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ విషాద ఘటన కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లా సంతేబెన్నూరు తాలూకా చెన్నగిరి సమీపంలోని మరవంజి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు రాజప్ప కుమార్తె శ్రుతి (24) ఎంఏ పూర్తి చేసింది. ఆమెకు అనేక పెళ్లి సంబంధాలను చూశారు. తండ్రి ఏ సంబంధం తీసుకొచ్చినా యువతి ఒప్పుకునేది కాదు. ఇదే విషయమై కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో శ్రుతి, ఆమె తల్లి కమలమ్మ (50) బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి మళ్లీ రాలేదు. వారు అదృశ్యమవడంతో రాజప్ప, ఆయన కుమారుడు సంజయ్ గాలింపు చేపట్టారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంతేబెన్నూరు సమీపంలోని మెదికెరె వద్ద భద్ర కాలువలో గురువారం శృతి మృతదేహం లభ్యమైంది. అయితే సోదరి మృతితో మనస్తాపం చెందిన సంజయ్ కూడా కాలువలోకి దూకగా శుక్రవారం అతడి మృతదేహం యక్కెగొంది వద్ద లభించింది. అయితే కమలమ్మ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సాగర్ కాలువలో రేణుకా చౌదరి పీఏ గల్లంతు!
ఖమ్మం: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి ప్రధాన అనుచరుడు, వ్యక్తిగత సహాయకుడు నాగార్జున సాగర్ కాలువలో గల్లంతయ్యారు. ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. గజ ఈతగాడిగా పేరుపొందిన అతడు గల్లంతవడం షాకింగ్‌గా ఉంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గత ఈతగాళ్లను రప్పించి అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే అతడికి గుండెపోటు రావడంతో కాలువలో గల్లంతై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరికి ప్రధాన అనుచరుడిగా రవి గుర్తింపు పొందాడు. దీంతోపాటు ఆమెకు వ్యక్తిగత సహాయకుడి (పీఏ) గా పని చేస్తున్నాడు. ఖమ్మం నగరంలోని సాగర్ కాలువలో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడు కాలువలో గల్లంతైనట్టు తెలుస్తోంది. అయితే దాదాపు 11 కిలోమీటర్లు నిర్విరామంగా రవి ఈత కొడతాడని స్థానికులు చెబుతున్నారు. సాగర్ కాలువలోకి ఈతకు వెళ్లిన అనంతరం రవికి గుండెపోటు వచ్చి ఉంటుందని సమాచారం. ఆ సమయంలో అతడు కాలువలో గల్లంతై ఉంటాడని భావిస్తున్నారు. సమాచారం తెలియడంతో పోలీసులు రవి కోసం సాగర్ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా రవి ఆచూకీ లభించలేదు. కాలువ సమీపంలో రవికి చెందిన బుల్లెట్ వాహనం, చెప్పులు, బ్యాగ్ ఉన్నాయి. -
చెరువులోకి దూసుకెళ్లిన కారు..
సాక్షి, ఆళ్లపల్లి: ప్రమాదవశాత్తు చెరువులో కారు దూసుకెళ్లి బోల్తా పడి ఇద్దరు యువకులు మృత్యువాతకు గురైన సంఘటన ఆదివారం ఆళ్లపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలారం గ్రామానికి చెందిన అరెం రాజబాబు (26), సీతారాంపురం గ్రామానికి చెందిన పాయం రవి (35) అవివాహితులు. ఇరువురు తమ స్నేహితుడు బట్టు సారయ్యను కారులో శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఇప్పనపల్లిలో దింపి తిరిగి వస్తున్న సమయంలో అతివేగం కారణంగా ఆళ్లపల్లి గ్రామ శివారు మూలమలుపు వద్ద అదుపుతప్పి మొద్దుల చెరువులో బోల్తా పడి డోర్లు లాక్ పడటంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారు జామున అటుగా వెళ్తున్న పాదచారులు చెరువులో బోల్తా పడి ఉన్న కారుని గుర్తించి స్థానికులకు సమాచారం అందించారు. అరెం రాజబాబు ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని రాజకీయాలకు ఆకర్షితుడై గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి, మండల పరిషత్ ఎన్నికల్లో జెడ్పీటీసీ పదవికి పోటీచేశాడు. పాయం రవి ఉన్నత చదువులు చదుకొని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. వీరిరువురి మృతితో మైలారం, సీతారాంపురం గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను జెడ్పీ చైర్ పర్సన్ కోరం కనకయ్య, సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎండీ.జలాల్ సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: సాబీర్ పాషా సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతిచెందిన గిరిజన యువకుల కుటుంబాలను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆళ్లపల్లికి చెందిన ఆరెం రాజబాబు, పాయం రవి శనివారం రాత్రి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా, మృతుల కుటుంబ సభ్యులను సాబీర్‌పాషా పరామర్శించారు. నివాళులర్పించిన వారిలో మహిళా సమాఖ్య నాయకురాళ్లు ఈసం రమాదేవి, మేది ని లక్ష్మి, రత్నకుమారి, ఐవైఎప్ నాయకులు నదీప్, హఫీజ్ సుబ్బారావు తదితరులున్నారు. -
ప్రాణం తీసిన చేప
కోటగిరి(బాన్సువాడ) : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని యాద్గార్పూర్ గ్రామానికి చెందిన కూలీ షేక్ బషీర్(45) చేపలు పట్టేందుకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు నిండాయి. ఈ నేపథ్యంలో షేక్‌బషీర్ మంగళవారం ఉద యం తన ఇంటి నుంచి కొందరు స్నేహితులతో కలిసి గ్రామ చెరువు సమీపంలోని వాగు వద్దకు వెళ్ళాడు. గ్రామ చెరువు అలుగు పారుతుండడంతో చెరువులోని చేపలు వాగులోకి కొట్టుకు రావడంతో గమనించిన షేక్‌బషీర్ కర్ర సహాయంతో చేపలను కొట్టాడు. చేప కిందపడడంతో దాన్ని పట్టుకునే ప్రయత్నంలో అదుపుతప్పి వాగులో పడిపోయాడు. అక్కడే ఉన్న కొందరు యువకులు గమనించి గ్రామంలోకి వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ సులోచన, జెడ్పీటీసీ పుప్పాల శంకర్, తహసీల్దార్ విఠల్, ఆర్ఐ కృష్ణదత్తు, అడీషనల్ ఆర్ఐ నజీర్, ఎస్ఐ రాజ్‌భరత్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి చెరువు వద్దకు చేరుకున్నారు. హంగర్గకు చెందిన మక్కయ్య అనే యువకుడు వాగులోకి వెళ్ళి గాలించగా మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చాడు. మక్కయ్య ప్రతిభను పలువురు అభినందించారు. మృతదేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు షేక్‌బషీర్ వాగులో పడి మృతి చెందాడనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు విషాదానికి గురయ్యారు. ప్రతిరోజు అందరితో కలుపు గొలుపుగా ఉండేవాడని క్షణాల్లో కళ్ళముందర ఉన్న వ్యక్తి మృతి చెందాడనే వార్త పలువురు జీర్ణించుకోలేక పోయారు. అక్కడికి చేరిన ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ధైర్యం చెప్పారు. మృతదేహం ఒడ్డుకు చేర్చే వరకు అక్కడే ఉన్నారు. -
పాకాల ఏరులో ఆగిన ఆటో
గార్ల మహబూబాబాద్ : మండలంలోని రాంపురం నుంచి గార్లకు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో పాకాల ఏరులో చిక్కుకుపోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కురవి మండలం రాజోలు పంచాయతీ హర్యాతండాకు చెందిన 8 మంది ప్రయాణికులు గార్లకు వచ్చేందుకు ఆటోలో బయలుదేరారు. రాంపురం దాటిన అనంతరం డ్రైవర్ పాకాల ఏటి చెక్‌డ్యాంపై నుంచి ఆటోను తీసుకెళ్తుండగా.. వరద ఉధృతికి ఆటో కదలలేక పాకాల ఏటి మధ్యలో ఆగిపోయింది. స్థానికులు గమనించి ఆటోలోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆటోకు తాళ్లు కట్టి ట్రాక్టర్ సాయంతో బయటకు లాగారు. 8 వడ్ల బస్తాలు ఉండడంతో ఆటో వాగులోకి వెళ్లలేదు. వడ్ల బస్తాలు లేకుంటే ఆటో వాగులోకి వెళ్లి ప్రయాణికులు నీటిలో మునిగిపోయేవారు. అందరూ సురక్షితంగా బయట పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో రెండు నెలలపాటు పాకాల ఏరు చెక్‌డ్యాం పైనుంచి ప్రవహిస్తుంది. రాంపురం పంచాయతీ గ్రామాల ప్రజలు ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా ఏరు దాటుతూ వెళ్లాలి. ఏటిలో పడి అనేక మందికి తీవ్రగాయలపాలు కాగా.. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. పలుమార్లు పాకాల ఏటిపై బ్రిడ్జి నిర్మించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను విన్నవించినా ఫలితం లేదని రాంపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పాకాల ఏటిపై బ్రిడ్జి నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
ఆవును రక్షించబోయి...
శృంగవరపుకోట రూరల్ : బందలో నీరు తాగేందుకు దిగిన (మెడకు, కాలికి తాడుతో కట్టేసి ఉన్న ఆవు) ఆవును రక్షించబోయి కరెడ్ల రామ శివకేశ (25) అనే యువకుడు ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందిన సంఘటన మండలంలోని వెంకటరమణపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి మృతుడి తండ్రి వెంకటరమణ, మామయ్య కనిశెట్టి ఈశ్వరరావు తెలియజేసిన వివరాల ప్రకారం..లక్కవరపుకోట మండలం పిల్లాగ్రహారానికి చెందిన కరెడ్ల రామ శివకేశ ఎస్.కోట మండలం వెంకటరమణపేటలో ఉన్న తన మేనత్త సత్యవతి ఇంటికి చుట్టపు చూపుగా కొద్ది రోజుల కిందట వచ్చాడు. మేనత్తకు చెందిన ఆవులను వెంకటరమణపేట జంక్షన్‌కు ఎదురుగా ఉన్న తిమిడి రోడ్డు వైపు మేతకు తీసుకెళ్లాడు. ఇందులో ఒక ఆవు (కాలుకు మెడకు తాడుతో కట్టి ఉన్నది) దాహార్తిని తీర్చుకునేందుకు సమీపంలో ఉన్న బండి కన్నయ్యగారి బందలో దిగింది. అయితే కాలికి, మెడకు తాడు కట్టి ఉండడంతో గట్టు ఎక్కడానికి అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఆవును రక్షించడానికి రామ శివకేశ బందలో దిగి ఆవును తోలుతూ ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు. సమీపంలో ఉన్న రైతులు గమనించి బందలో మునిగిన రామశివను బయటకు తీసి వారి బంధువుల సహకారంతో ఎస్.కోటలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రామ శివకేశ మృతి చెందినట్లు డాక్టర్ ఆర్. త్రినాథరావు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు బందనిండా నీరు చేరిందని.. రామశివకు ఈతరానందునే ప్రమాదవశాత్తూ నీట మునిగిపోయాడని స్థానికులు తెలిపారు. మృతుడికి వివాహం జరిగినప్పటికీ భార్య వదిలేసిందని, తల్లికూడా మరణించిందని బంధువులు తెలిపారు. అందరితో కలిసిమెలసి ఉంటూ అప్యాయంగా పలకరించే రామశివ ఇకలేడంటు మృతుని మేనత్త సత్యవతి, మావయ్య కనిశెట్టి ఈశ్వరరావు, తండ్రి వెంకటరమణ, బంధువులు బోరున విలపించారు. మృతుని తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు ఎస్సై ఎస్.అమ్మినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాలువలో పడి యువతి మృతి
పెరవలి : తెల్లవారుజామునే గుడికి వెళ్లిన ఓ యువతి కాలువలో కాళ్లు కడుగుదామని దిగి ప్రమాదవశాత్తూ పడిపోయి మృతి చెందింది. ఈ ఘటన ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో చోటుచేసుకుంది. పెరవలి ఎస్సై పి.నాగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఉదయం పెరవలి మండలం కాకరపర్రు వద్ద కాలువలో యువతి మృతదేహం తేలింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు హడలిపోయారు. వెంటనే పెరవలి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని తణుకు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన చేరుకుని కాలువలోని యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఆ యువతి ఎవరనేది తెలియక పోవడంతో పోలీసులు కాలువ పరీవాహక ప్రాంతంలోని అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. చివరికి మధ్యాహ్నానికి మృతురాలి వివరాలు తెలిశాయి. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి చెందిన గారపాటి శ్రీ వెంకట జ్యోతి (18)గా ఆమెను గుర్తించారు. తెల్లవారుజామునే గుడికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిందని, కాలువలో కాళ్లు కడుక్కునేందుకు దిగి కాలు జారి మునిగిపోయినట్టు తెలిసింది. మృతదేహం కాకరపర్రు లాకుల వరకు కొట్టుకొచ్చింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్ తప్పుతాననే భయంతోనే? మృతురాలు శ్రీ వెంకట జ్యోతి ఇంటర్ చదువుతోంది. ఆమె తల్లి చనిపోవడంతో వేలివెన్నులోని అమ్మమ్మ, తాతయ్య దగ్గర ఉంటూ చదువుకుంటోంది. తండ్రి వరప్రసాద్ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇంటర్ పరీక్ష ఫలితాలు గురువారం విడుదల కావడంతో పరీక్ష ఫెయిల్ అవుతాననే భయంతో ఆమె కావాలనే కాలువలో పడినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే పరీక్షా ఫలితాల్లో ఆమె ఇంటర్ పాస్ అవడం గమనార్హం. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
చివరికి కష్టమే!
కోయిల్‌సాగర్ డీ– 16 కాల్వ కింద సాగు చేసిన వరికి సాగునీరు లేకపోవడంతో నిట్ట నిలువునా పంటలు ఎండుతున్నాయి. బిల్లుల మంజూరు నిర్లక్ష్యం కావడం మూలంగా కాల్వ ఆధునికీకరణ పనులు ఆలస్యం కావ డంతో ఆయకట్టు కింద ఉన్న బోర్లలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. పనులు నిలిపి వేసి ఎండుతున్న పొలాలకు నీరు వదిలి జీవం పోయాలని రైతులు కోరుతున్నారు. డీ–16 కాల్వపనులు సాగకపోవడంతో ఆదిలోనే రైతులకు గోస పట్టుకుంది. మరికల్ : కోయిల్‌సాగర్ డీ– 16 కాల్వ కింద 1100 ఎకరాల ఆయకట్టు ఉంది. దీని ఆధునీకరణ చేసేందుకు ప్రభుత్వం రూ.4.60 కోట్లను మంజూరు చేసింది. 6నెల్లల క్రితమే ఈ పనులు ప్రారంభం కావడం జరిగింది. కాల్వ వెడల్పు పనులు పూర్తి కావచ్చాయి. బిల్లుల అల స్యం కారణంగా వంతెనలు, అండర్‌టర్నల్ పనులు ముందుకు సాగడం లేదు. బోర్లలో తగ్గుతున్న నీటి మట్టం డీ–16 కాల్వకు కోయిల్‌సాగర్ నీరు విడుదల కాకపొవడంతో కాల్వ కింద ఉన్న వ్యవసాయ బోర్లలో నీటిమట్టం పూర్తిగా పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. పనులు పూర్తి చేసిన వరకైనా నీటిని వదిలితే బోర్లలో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేసు ్తన్నారు. పనుల నత్తనడకన సాగుతుండటంతో మరో ఎడాది పట్టెటాట్లు కన్పిస్తుంది. ప్రస్తుతం కాల్వ వెడల్పు పనులు మినహా మిగిత పనులు తూములు, వంతేనాలు, అండర్ టర్నల్ పనులు జరుగుతున్నాయి. ఇవి పూరైన తర్వా తనే నీళ్లు వచ్చే అవకాశం ఉంది. బిల్లుల అలస్యం కారణంగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు తంటలు పండుతున్నాడు. నత్తనడకన పనులు డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేసి డీ–16 కాల్వకు నీరు వదులుతామని చేప్పిన అధికారులు మాట తప్పారు. దీంతో ఈ కాల్వ కింద సాగు చేసుకున్న వరిపంటలు నీళ్లులేక వందలాది ఎకరాలో వరిపంట ఎండుతుంది. ఇటీవల కాల్వ పనులను పరిశీలించడానికి వచ్చిన అధికారులను డీ–16 రెండవ తూమ్ వరకు నీరు వదాలారు. అక్కడి వరకే నీరు రావడంతో కొంత వరకు పంటలు ఉపిరిపిల్చుకున్నాయి. మిగిత తూమ్‌ల కింద పనులు కొనసాగుతుండటంతో సాగునీరు అందడం లేదు. దీంతో అక్కడి పంటల పరిస్థితి చూస్తే కర్షకులకు కనీళ్లు తెపిస్తున్నాయి. డీ–16 కాల్వకు నీరు వదలాలి డీ–16 కాల్వ పనులు ఇపట్లో పూర్తి కావు. ఎండిన పంటలను దృష్టిలో ఉంచుకొని రెండు తడుల నీటిని విడుదల చేస్తే పంటలను కాపాడకునే అకాశంతో పాటు బోర్లను కాపడుకున్నే అవకాశం ఉంది. అధికారులు నీళ్లు వదాలకుంటే ఎకరాకు రూ.20 వేల చొప్పున నష్టపోవాల్సిన పరిస్థితి దారిస్తుంది. – ఆంజనేయులు, రైతు, తీలేర్ ముందే చెప్పాం డీ– 16 కాల్వ అధునీకరణ పనుల నిమిత్తం ఈ ఆయకట్టు కింద రైతులు ఎవరూ కూడా పంటలను సాగు చేసుకోవద్దాని ముందే చెప్పాం. అయినా కొందరు రైతులు వరిపంటలను సాగు చేసుకున్నారు. వీలైనంత వరకు కాల్వ పనులు పూర్తి చేసిన వరకు ఎండిన పంటలకు నీరు వదిలేందుకు చర్యలు తీసుకుంటాం. – భూపాల్‌రెడ్డి, కోయిల్‌సాగర్, ప్రాజెక్టు ఈఈ -
నా తోటే నాకు ముఖ్యం!
సంతమాగులూరు: ఎవరేమైపోతే మాకేంటి.. మా తోటలకు నీరు కట్టుకుంటే చాలు అన్న చందంగా ఉంది కొందరు రైతుల పరిస్థితి. కాలువ తూముల ద్వారా పొలాలకు, నీరు కడితే ఆలస్యం అవుతుందనుకున్నారేమో ఏమో, ఏకంగా ఫత్తేపురం సమీపంలోని సంతమాగులూరు మేజరుకు గండి కొట్టి సుబాబుల్ తోటలకు నీరు కడుతున్నారు. దీంతో నీటి కోసం ఎదురు చూస్తున్న కంది, శనగ, మిరప, పత్తి రైతులు లబోదిబోమంటున్నారు. ఫత్తేపురం సమీపంలోని సంతమాగులూరు మేజరుకు ఇదే గ్రామానికి చెందిన ఓ రైతు గండి కొట్టి సుబాబుల్ తోటలకు నీరు తరలిస్తున్నాడు. దీంతో మేజరు నుంచి వెళ్లే నీరు రహదారిపైగా ప్రవహిస్తుండడంతో, రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. అధికారుల అండదండలతోనే? ఏకంగా సాగరు మేజరు కాలువకు గండి కొట్టి, సుబాబుల్ తోటలకు నీరు కడుతున్నరంటే, దాని వెనుక అధికారుల అండదండలు లేకుండా ఉన్నాయా? అని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు కల్పించుకుని మేజరుకు కొట్టిన గండిని పూడ్పించాలని కోరుతున్నారు. దీనిపై ఎన్‌స్పీ జేఈ తేజశ్వనిని వివరణ కోరగా ఈ విషయం తనకు తెలియదని వెంటనే సిబ్బందిని పంపించి గండిని పూడ్చుతామని వివరించారు. -
ఏడేళ్లుగా.. ఎదురుచూపులే..!
'చెంతనే కృష్ణమ్మ పరుగులెడుతున్నా.. ఆ గ్రామానికి చుక్క సాగునీరు అందని పరి(దు)స్థితి. 600 ఎకరాల టెలాండ్ భూములకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ఏడేళ్ల క్రితం చేపట్టిన సప్లమెంటరీ కాల్వ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఈ కాల్వ పనులకు నిధుల లేమి ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో కాల్వ చివరి భూములకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు' - హాలియా నాగార్జున సాగర్‌కు కేవలం 20 కి.మీ దూరంలో ఉన్న రాజవరం గ్రామానికి సాగునీరు అందించాన్న ఉద్దేశంతో ఏడేళ్ల క్రితం సప్లమెంటరీ కాల్వ నిర్మాణం చేపట్టారు. మొదట నిడమనూరు మండలం సూరేపల్లి గ్రామం వద్ద హాలియా వాగుపై ఏర్పాటు చేసిన కత్వ నుంచి రాజవరం గ్రామం వరకు రూ.10 లక్షలతో కాల్వ నిర్మించారు. ఆ నిధులు సరిపోకపోవడంతో మరో రూ.15 లక్షలు మంజూరు చేశారు. ఫలితం లేకపోవడంతో మళ్లీ రూ.35 లక్షల వ్యయంతో నూతనంగా మరో కాల్వను నిర్మించారు. దానికి సప్లమెంటరి కాల్వగా నామకరణం చేశారు. నిధుల లేమితో ఈ కాల్వ కూడా పూర్తి కాలేదు. దీంతో రాజవరం గ్రామ టేలాండ్ భూమి రైతులు సాగునీరు అందక పత్తి, కంది, మినుముల, జోన్న తదితర మెట్టపంటలను సాగు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రతిపాదనలకే పరిమితమా..? రాజవరం గ్రామంలో సాగునీరు అందించేందుకు చేపట్టిన సప్లమెంటరీ కాల్వ పూర్తికి అదనపు నిధులు అవసరమని రెండేళ్ల క్రితం ఎన్ఎస్పీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నేటికీ పైసా కూడా విడుదల కాలేదు. ఏడేళ్లుగా అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు సప్లమెంటరీ కాల్వ వద్దకు రావడం, కాల్వ నిర్మాణ పూర్తికి కావాల్సిన నిధులను అంచనా వేసి ప్రతిపాదనలు రూపొందించి పంపడం తంతుగా మారింది. కానీ ఇప్పటి వరకు పైసా కూడా విడుదల కాకపోవడంతో సప్లమెంటరీ కాల్వ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అధికారులు, ప్రజాప్రతినిధు లు మారుతున్నారే గానీ కాల్వ పరిస్థితి మారడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇలా చేస్తే .. మండలంలోని రాజవరం గ్రామ పరిధిలో ఉన్న 600 ఎకరాలకు సాగునీరు అందించాలంటే మొదటి నిడమనూరు మండలం సూరేపల్లి వద్ద హాలియా వాగుపై ఎర్పాటు చేసిన కత్వ ఎత్తును పెంచాలి. దీంతో పాటు రాజవరం చెరువును విస్తరించి ఆధునికీకరించాలి. అలా చేయడం వలన సూరేపల్లి కత్వ నుంచి నీటిని కాల్వ ద్వార రాజవరం చెరువు కు సరఫరా చేయొచ్చు. అక్కడ నుంచి సప్లమెంటరీ కాల్వ ద్వార సా గునీరు సరఫరా చేస్తే టెలాండ్ భూములకు సాగునీరు అందుతుంది. అందుకు గానూ రూ.కోటీ నుంచి రెండు కోట్ల వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం రూ.కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయగల్గితే 600 ఎకరాలకు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. కాల్వ నిర్మాణం పూర్తి చేయాలి గ్రామంలో 600 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన సప్లమెంటరీ కాల్వకు అదనపు నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలి. కాల్వ నిర్మాణం పూర్తయితే గ్రామానికి సాగునీరుతో పాటు తాగునీరు అందుతుంది. -బి.రమణరాజు,మాజీసర్పంచ్, రాజవరం