రాజబాబు, రవి మృతదేహాలు: మొద్దులచెరువులో బోల్తా పడిన కారు
సాక్షి, ఆళ్లపల్లి: ప్రమాదవశాత్తు చెరువులో కారు దూసుకెళ్లి బోల్తా పడి ఇద్దరు యువకులు మృత్యువాతకు గురైన సంఘటన ఆదివారం ఆళ్లపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలారం గ్రామానికి చెందిన అరెం రాజబాబు (26), సీతారాంపురం గ్రామానికి చెందిన పాయం రవి (35) అవివాహితులు. ఇరువురు తమ స్నేహితుడు బట్టు సారయ్యను కారులో శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఇప్పనపల్లిలో దింపి తిరిగి వస్తున్న సమయంలో అతివేగం కారణంగా ఆళ్లపల్లి గ్రామ శివారు మూలమలుపు వద్ద అదుపుతప్పి మొద్దుల చెరువులో బోల్తా పడి డోర్లు లాక్ పడటంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాతకు గురయ్యారు.
ఆదివారం తెల్లవారు జామున అటుగా వెళ్తున్న పాదచారులు చెరువులో బోల్తా పడి ఉన్న కారుని గుర్తించి స్థానికులకు సమాచారం అందించారు. అరెం రాజబాబు ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని రాజకీయాలకు ఆకర్షితుడై గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి, మండల పరిషత్ ఎన్నికల్లో జెడ్పీటీసీ పదవికి పోటీచేశాడు. పాయం రవి ఉన్నత చదువులు చదుకొని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. వీరిరువురి మృతితో మైలారం, సీతారాంపురం గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను జెడ్పీ చైర్ పర్సన్ కోరం కనకయ్య, సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎండీ.జలాల్ సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: సాబీర్ పాషా
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతిచెందిన గిరిజన యువకుల కుటుంబాలను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆళ్లపల్లికి చెందిన ఆరెం రాజబాబు, పాయం రవి శనివారం రాత్రి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా, మృతుల కుటుంబ సభ్యులను సాబీర్‌పాషా పరామర్శించారు. నివాళులర్పించిన వారిలో మహిళా సమాఖ్య నాయకురాళ్లు ఈసం రమాదేవి, మేది ని లక్ష్మి, రత్నకుమారి, ఐవైఎప్ నాయకులు నదీప్, హఫీజ్ సుబ్బారావు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment