గార్ల మహబూబాబాద్ : మండలంలోని రాంపురం నుంచి గార్లకు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో పాకాల ఏరులో చిక్కుకుపోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కురవి మండలం రాజోలు పంచాయతీ హర్యాతండాకు చెందిన 8 మంది ప్రయాణికులు గార్లకు వచ్చేందుకు ఆటోలో బయలుదేరారు. రాంపురం దాటిన అనంతరం డ్రైవర్ పాకాల ఏటి చెక్‌డ్యాంపై నుంచి ఆటోను తీసుకెళ్తుండగా.. వరద ఉధృతికి ఆటో కదలలేక పాకాల ఏటి మధ్యలో ఆగిపోయింది.
స్థానికులు గమనించి ఆటోలోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆటోకు తాళ్లు కట్టి ట్రాక్టర్ సాయంతో బయటకు లాగారు. 8 వడ్ల బస్తాలు ఉండడంతో ఆటో వాగులోకి వెళ్లలేదు. వడ్ల బస్తాలు లేకుంటే ఆటో వాగులోకి వెళ్లి ప్రయాణికులు నీటిలో మునిగిపోయేవారు. అందరూ సురక్షితంగా బయట పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో రెండు నెలలపాటు పాకాల ఏరు చెక్‌డ్యాం పైనుంచి ప్రవహిస్తుంది.
రాంపురం పంచాయతీ గ్రామాల ప్రజలు ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా ఏరు దాటుతూ వెళ్లాలి. ఏటిలో పడి అనేక మందికి తీవ్రగాయలపాలు కాగా.. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. పలుమార్లు పాకాల ఏటిపై బ్రిడ్జి నిర్మించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను విన్నవించినా ఫలితం లేదని రాంపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పాకాల ఏటిపై బ్రిడ్జి నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment