garla
-
పొంగులేటి ఎఫెక్ట్.. బీఆర్ఎస్కు బిగ్ షాక్
సాక్షి, గార్ల: తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా గార్ల జెడ్పీటీసీ సభ్యురాలు జాటోత్ ఝాన్సీలక్ష్మి బుధవారం ప్రకటించారు. ఈ సందర్బంగానే ఆమెతోపాటు మరో 30 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గార్లలోని పొంగులేటి, కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి బీఆర్ఎస్లో సముచిత స్థానం లభించలేదన్నారు. ఆయన వెంట తిరుగుతున్న జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యకు సైతం ప్రభుత్వం భద్రతను తొలగించడం కక్షపూరిత చర్యగా ఆమె అభివర్ణించారు. ఇది కూడా చదవండి: భారత్ పరివర్తన్ మిషన్‌గా బీఆర్ఎస్ -
ఆమెకు 22.. అతనికి 17
మహబూబాబాద్ : జిల్లాలోని గార్ల మండలం.. రాజుతండ గ్రామ పంచాయతీలో విషాదం చోటుచేసుకుంది. తమ పెళ్లిని కుటుంబీకులు అంగీకరించరనే భయంతో బావిలో దూకి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు... రాజు తండా గ్రామపంచాయతీ వడ్ల తండాకు చెందిన మైనర్ గుగులోతు వెంకటేష్ (17), అమ్మాయి భూక్య ప్రవీణ (22) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గత మూడు రోజులుగా వీరిద్దరు కనిపించకపోవడంతో రెండు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. వారిద్దరు ఏమయ్యారనే దానిపై బంధువులు.. గ్రామస్థులతో కలిసి చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. (చదవండి : ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య) ఈ నేపథ్యంలో నేడు తెల్లవారుజామున తండా శివారు ప్రాంతంలోని వ్యవసాయ బావిలో వీరిద్దరు శవాలై తేలారు. వ్యవసాయ పనులకు వెళ్తున్న రైతులు బావిలో మృతదేహాలు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను బావి నుంచి వెలికి తీశారు. అనంతరం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓకే తండాలో సమీప ఇళ్లలో ఉండే ఇద్దరు చనిపోవడంతో విషాద చాయలు అలుముకున్నాయి. -
బైకుల దొంగ అరెస్ట్
సాక్షి, వరంగల్: మండలంలో ఈనెల 10న 2 మోటార్‌సైకిళ్లు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు గార్ల, బయ్యారం సీఐ వై.రమేష్ తెలిపారు. బుధవారం గార్ల పోలీస్‌స్టేషన్‌లో మోటార్‌సైకిళ్ల చోరీకి సంబందించిన వివరాలను సీఐ విలేకరులకు వెల్లడించారు. గార్లలో గత 2 నెలల క్రితం బంధువుల ఇళ్లకు వచ్చిన మహ్మద్ రఫిక్ గార్లలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 10న అర్ధరాత్రి గార్లకు చెందిన పతంగి ప్రవీణ్, గద్దపాటి రాము తమ ఇళ్ల ముందర మోటార్‌సైకిళ్లు పెట్టి, ఉదయాన్నే లేచిచూడగా మోటార్ సైకిళ్లు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు గార్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు గార్ల ఎస్సై పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి గార్లలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మహ్మద్ రఫిక్ మోటార్‌సైకిళ్ల చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. నాటినుంచి పరారీలో ఉన్న నిందితుడు బుధవారం సత్యనారాయణపురం క్రాస్‌రోడ్ వద్ద చోరీ చేసిన అప్పాచీ, స్కూటీ మోటార్‌సైకిళ్లను వేరే వ్యక్తులకు అమ్ముతుండగా గార్ల పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి రూ.1లక్ష విలువ గల 2 మోటార్‌సైకిళ్లను స్వాధీన పరుచుకుని, నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ఇకనుంచి ప్రతీ గ్రామంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుని శాంతి భద్రతలను కాపాడుకోవడంలో పోలీసులతో ప్రజలు భాగస్వాములు కావాలని సీఐ కోరారు. కాగా, మోటార్‌సైకిళ్ల చోరీ నిందితుడిని పట్టుకున్న ఎస్సై పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సిబ్బందిని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అభినందించి, వీరికి త్వరలో రివార్డులు అందజేస్తామని తెలిపినట్లు సీఐ రమేష్ విలేకరులకు తెలిపారు. -
పాకాల ఏరులో ఆగిన ఆటో
గార్ల మహబూబాబాద్ : మండలంలోని రాంపురం నుంచి గార్లకు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో పాకాల ఏరులో చిక్కుకుపోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కురవి మండలం రాజోలు పంచాయతీ హర్యాతండాకు చెందిన 8 మంది ప్రయాణికులు గార్లకు వచ్చేందుకు ఆటోలో బయలుదేరారు. రాంపురం దాటిన అనంతరం డ్రైవర్ పాకాల ఏటి చెక్‌డ్యాంపై నుంచి ఆటోను తీసుకెళ్తుండగా.. వరద ఉధృతికి ఆటో కదలలేక పాకాల ఏటి మధ్యలో ఆగిపోయింది. స్థానికులు గమనించి ఆటోలోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆటోకు తాళ్లు కట్టి ట్రాక్టర్ సాయంతో బయటకు లాగారు. 8 వడ్ల బస్తాలు ఉండడంతో ఆటో వాగులోకి వెళ్లలేదు. వడ్ల బస్తాలు లేకుంటే ఆటో వాగులోకి వెళ్లి ప్రయాణికులు నీటిలో మునిగిపోయేవారు. అందరూ సురక్షితంగా బయట పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో రెండు నెలలపాటు పాకాల ఏరు చెక్‌డ్యాం పైనుంచి ప్రవహిస్తుంది. రాంపురం పంచాయతీ గ్రామాల ప్రజలు ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా ఏరు దాటుతూ వెళ్లాలి. ఏటిలో పడి అనేక మందికి తీవ్రగాయలపాలు కాగా.. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. పలుమార్లు పాకాల ఏటిపై బ్రిడ్జి నిర్మించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను విన్నవించినా ఫలితం లేదని రాంపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పాకాల ఏటిపై బ్రిడ్జి నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన గార్ల ఎంపీపీ
వరంగల్: జిల్లాలోని గార్ల ఎంపీపీ , వైస్ ఎంపీపీలు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన తొలి విడత పరామర్శయాత్రలో గార్ల ఎంపీపీ సుశీల, వైస్ ఎంపీపీ నర్సింగరావులు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పరిపాలన రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు షర్మిలపై చూపిస్తున్న అభిమానం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టనున్న రెండో విడత పరామర్శయాత్ర సెప్టెంబర్ 7 వ తేదీ నుంచి 11 వ తేదీ వరకూ కొనసాగుతుందని పొంగులేటి తెలిపారు. వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన తొలి విడత పరామర్శయాత్ర ముగిసింది. ఈరోజు పరకాల నియోజకవర్గం సంగెం మండలం రామచంద్రాపురంలోని బొల్లు ఎల్లమ్మ కుటుంబాన్ని ముందుగా పరామర్శించారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలోని పుల్లూరు కొమురమ్మ ఇంటికి వెళ్లారు. చివరగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ కుటుంబ సభ్యలకు భరోసా ఇచ్చారు. మొదటి విడత యాత్రలో మొత్తం 7 నియోజకవర్గాల్లో 32 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించారు. -
‘మైనింగ్’ మేనేజర్ కిడ్నాప్‌కు యత్నం
గార్ల, న్యూస్‌లైన్: చందాల కోసం ప్రజాప్రతిఘటన పేరుతో ఆలెం కృష్ణ, మరో ముగ్గురు నకిలీ నక్సలైట్లు గార్లలో నివసిస్తున్న ఓ మైనింగ్ మేనేజర్‌ను కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశారు. గురువారం తెల్లవారుజామున పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గార్ల మండలం శేరిపురం సమీపంలోని విశ్వభారతి మైనింగ్ వద్దకు గురువారం తెల్లవారుజామున పలువురు వెళ్లి వాచ్మెన్ బుచ్చిరాములును నిద్రలేపారు. తాము నక్సలైట్లమని, గార్లలో మీ మేనేజర్ ఇల్లు చూపించాలని బెదిరించడంతో వాచ్మెన్ వారి వెంట టాటా మ్యాజిక్ ఆటోలో గార్లకు వచ్చాడు. నకిలీనక్సల్స్ వాచ్‌మెన్‌తో మేనేజర్ ఇంటి తలుపు తట్టించారు. దీంతో మేనేజర్ చల్లా వాసుదేవరెడ్డి బయటకు రాగా వారు అన్న రమ్మంటుండంటూ కోరారు. అందుకు మేనేజర్ నిరాకరించడంతో వారి మధ్య కొద్దిసేపు పెనుగులాట చోటు చేసుకుంది. దీంతో మేనేజర్ అతని వద్ద ఉన్న రివాల్వర్ లాక్కుని ఎదురుగా ఉన్న ఆర్సీఎం వసతిగృహంలోకి విసిరివేశాడు. ఇంతలో మేనేజర్ భార్య మేల్కొని కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు మేల్కొన్నారు. దీంతో నకిలీ నక్సలైట్లు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే మైనింగ్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించగా వారు నకిలీ నక్సైైైలైట్ల కోసం గాలింపు చేపట్టారు. నకిలీ నక్సలైట్ల నుంచి లాక్కున్న రివాల్వర్‌ను మేనేజర్ పోలీసులకు అప్పగించారు. ఈమేరకు గార్ల బయ్యారం సీఐ ఎంవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో గార్ల ఎస్సై జె వసంత్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫిబ్రవరిలో మైన్స్ వద్ద మూడు ట్రాక్టర్లను దహనం చేసిన ఆలెం కృష్ణ నకిలీ నక్సలైట్ ఆలెం కృష్ణ ఫిబ్రవరి నెలలో గార్ల మండలం శేరిపురం సమీపంలోని విశ్వభారతి మైనింగ్ వద్ద ఉన్న మూడు ట్రాక్టర్లను దగ్ధం చేసి చందాల కోసం మైనింగ్ వద్ద ఉన్న సూపర్వైజర్ శివశంకర్‌రెడ్డిని కిడ్నాప్ చేసి ఐదు రోజుల అనంతరం వదిలిపెట్టాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయిన కృష్ణ ఇంతకాలం జైలు జీవితం గడిపి వారం రోజుల క్రితమే విడుదలయ్యారు. అనంతరం తిరిగి ఈ సంఘటనతో ఆలెం కృష్ణ తన ఉనికిని చాటుకున్నాడు. ఆలెం కృష్ణ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.