‘మైనింగ్’ మేనేజర్ కిడ్నాప్‌కు యత్నం | pseudo Naxals try to kidnap Mining manager | Sakshi
Sakshi News home page

‘మైనింగ్’ మేనేజర్ కిడ్నాప్‌కు యత్నం

Published Fri, Nov 8 2013 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM

pseudo Naxals try to kidnap Mining manager

 గార్ల, న్యూస్‌లైన్: చందాల కోసం ప్రజాప్రతిఘటన పేరుతో ఆలెం కృష్ణ, మరో ముగ్గురు నకిలీ నక్సలైట్లు గార్లలో నివసిస్తున్న ఓ మైనింగ్ మేనేజర్‌ను కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశారు. గురువారం తెల్లవారుజామున పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గార్ల మండలం శేరిపురం సమీపంలోని విశ్వభారతి మైనింగ్ వద్దకు గురువారం తెల్లవారుజామున పలువురు వెళ్లి వాచ్‌మెన్ బుచ్చిరాములును నిద్రలేపారు. తాము నక్సలైట్లమని, గార్లలో మీ మేనేజర్ ఇల్లు చూపించాలని బెదిరించడంతో వాచ్‌మెన్ వారి వెంట టాటా మ్యాజిక్ ఆటోలో గార్లకు వచ్చాడు.
 
 నకిలీనక్సల్స్ వాచ్‌మెన్‌తో మేనేజర్ ఇంటి తలుపు తట్టించారు. దీంతో మేనేజర్ చల్లా వాసుదేవరెడ్డి బయటకు రాగా వారు అన్న రమ్మంటుండంటూ కోరారు. అందుకు మేనేజర్ నిరాకరించడంతో వారి మధ్య కొద్దిసేపు పెనుగులాట చోటు చేసుకుంది. దీంతో మేనేజర్ అతని వద్ద ఉన్న రివాల్వర్ లాక్కుని ఎదురుగా ఉన్న ఆర్‌సీఎం వసతిగృహంలోకి విసిరివేశాడు. ఇంతలో మేనేజర్ భార్య మేల్కొని కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు మేల్కొన్నారు. దీంతో నకిలీ నక్సలైట్లు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే మైనింగ్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించగా వారు నకిలీ నక్సైైైలైట్ల కోసం గాలింపు చేపట్టారు. నకిలీ నక్సలైట్ల నుంచి లాక్కున్న రివాల్వర్‌ను మేనేజర్ పోలీసులకు అప్పగించారు. ఈమేరకు గార్ల బయ్యారం సీఐ ఎంవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో గార్ల ఎస్సై జె వసంత్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 ఫిబ్రవరిలో మైన్స్ వద్ద మూడు ట్రాక్టర్లను దహనం చేసిన ఆలెం కృష్ణ
 నకిలీ నక్సలైట్ ఆలెం కృష్ణ ఫిబ్రవరి నెలలో గార్ల మండలం శేరిపురం సమీపంలోని విశ్వభారతి మైనింగ్ వద్ద ఉన్న మూడు ట్రాక్టర్లను దగ్ధం చేసి చందాల కోసం మైనింగ్ వద్ద ఉన్న సూపర్‌వైజర్ శివశంకర్‌రెడ్డిని కిడ్నాప్ చేసి ఐదు రోజుల అనంతరం వదిలిపెట్టాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయిన కృష్ణ ఇంతకాలం జైలు జీవితం గడిపి వారం రోజుల క్రితమే విడుదలయ్యారు. అనంతరం తిరిగి ఈ సంఘటనతో ఆలెం కృష్ణ తన ఉనికిని చాటుకున్నాడు. ఆలెం కృష్ణ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement