pseudo Naxals
-
సూడో నక్సల్స్ అరెస్టు
హైదరాబాద్: నక్సల్స్పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ, వరంగల్ జిల్లాలకు చెందిన బొల్ల నర్సింహ, పల్లెల్ల సురేందర్, రాచకొండ శ్రీరాములు, అక్కారం కృష్ణ, సమ్మయ్య అనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3 లక్షల నగదు, 5 సెల్ఫోన్లు, ఒక పిస్టల్, కార్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. వీరిపై తొమ్మిది కేసులున్నాయని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. -
అంబికా ప్రసాద్‌కు సూడో నక్సల్స్ బెదిరింపు!
నక్సలైట్లమని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారినుంచి కారు, ఎయిర్ పిస్టల్, ప్రజా ప్రతిఘటన పార్టీ పేరిట ఉన్న లెటర్ హెడ్లు, మూడు సెల్ఫోన్లు, 5 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ శుక్రవారం వెల్లడించారు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం బొడ్లూరు గ్రామానికి చెందిన రేపాక శ్రీరాములు (ప్రసాద్) అదే జిల్లా రాయపర్తికి చెందిన పొనుగంటి వెంకటేశ్వరరావు సీపీఐ (ఎంఎల్) ప్రజాప్రతిఘటన పార్టీ, చండ్ర పుల్లారెడ్డి వర్గానికి చెందిన నక్సలైట్లమని చెప్పుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. వారిద్దరూ ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ సోదరుడు ఆలపాటి వజ్ర అంబికా ప్రసాద్‌ను బెదిరించి రూ.18 లక్షలు వసూలు చేశారు. ఇటీవల మరో రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రసాద్ ఈ నెల 2న ఏలూరు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులిద్దరూ శుక్రవారం ఏలూరు మండలం చొదిమెళ్ల గ్రామంలో ఉండగా పట్టుకున్నారు. నిందితులది ఘన చరిత్రే.. అరె స్టైన నిందితులు రేపాక శ్రీరాములు (ప్రసాద్), పొనుగంటి వెంకటేశ్వరరావుది ఆదినుంచీ నేర చరిత్రే అని ఎస్పీ భాస్కర్‌భూషణ్ తెలిపారు. తోడు దొంగలైన ఇదరూ 2000వ సంవత్సరం నుంచి నక్సలైట్లమని ప్రజలను బెదిరిస్తూ నేరాలకు పాల్పడ్డారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని వ్యాపారులు, రియల్టర్లను బెదిరించి దాదాపు రూ.30 లక్షలు వసూలు చేసినట్టు విచారణలో తేలిందన్నారు. వీరిద్దరూ ఇప్పటికే 13 కేసుల్లో అరెస్టయి న్యాయస్థానాల్లో విచారణ ఎదుర్కొన్నారని వివరించారు. -
‘మైనింగ్’ మేనేజర్ కిడ్నాప్‌కు యత్నం
గార్ల, న్యూస్‌లైన్: చందాల కోసం ప్రజాప్రతిఘటన పేరుతో ఆలెం కృష్ణ, మరో ముగ్గురు నకిలీ నక్సలైట్లు గార్లలో నివసిస్తున్న ఓ మైనింగ్ మేనేజర్‌ను కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశారు. గురువారం తెల్లవారుజామున పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గార్ల మండలం శేరిపురం సమీపంలోని విశ్వభారతి మైనింగ్ వద్దకు గురువారం తెల్లవారుజామున పలువురు వెళ్లి వాచ్మెన్ బుచ్చిరాములును నిద్రలేపారు. తాము నక్సలైట్లమని, గార్లలో మీ మేనేజర్ ఇల్లు చూపించాలని బెదిరించడంతో వాచ్మెన్ వారి వెంట టాటా మ్యాజిక్ ఆటోలో గార్లకు వచ్చాడు. నకిలీనక్సల్స్ వాచ్‌మెన్‌తో మేనేజర్ ఇంటి తలుపు తట్టించారు. దీంతో మేనేజర్ చల్లా వాసుదేవరెడ్డి బయటకు రాగా వారు అన్న రమ్మంటుండంటూ కోరారు. అందుకు మేనేజర్ నిరాకరించడంతో వారి మధ్య కొద్దిసేపు పెనుగులాట చోటు చేసుకుంది. దీంతో మేనేజర్ అతని వద్ద ఉన్న రివాల్వర్ లాక్కుని ఎదురుగా ఉన్న ఆర్సీఎం వసతిగృహంలోకి విసిరివేశాడు. ఇంతలో మేనేజర్ భార్య మేల్కొని కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు మేల్కొన్నారు. దీంతో నకిలీ నక్సలైట్లు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే మైనింగ్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించగా వారు నకిలీ నక్సైైైలైట్ల కోసం గాలింపు చేపట్టారు. నకిలీ నక్సలైట్ల నుంచి లాక్కున్న రివాల్వర్‌ను మేనేజర్ పోలీసులకు అప్పగించారు. ఈమేరకు గార్ల బయ్యారం సీఐ ఎంవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో గార్ల ఎస్సై జె వసంత్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫిబ్రవరిలో మైన్స్ వద్ద మూడు ట్రాక్టర్లను దహనం చేసిన ఆలెం కృష్ణ నకిలీ నక్సలైట్ ఆలెం కృష్ణ ఫిబ్రవరి నెలలో గార్ల మండలం శేరిపురం సమీపంలోని విశ్వభారతి మైనింగ్ వద్ద ఉన్న మూడు ట్రాక్టర్లను దగ్ధం చేసి చందాల కోసం మైనింగ్ వద్ద ఉన్న సూపర్వైజర్ శివశంకర్‌రెడ్డిని కిడ్నాప్ చేసి ఐదు రోజుల అనంతరం వదిలిపెట్టాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయిన కృష్ణ ఇంతకాలం జైలు జీవితం గడిపి వారం రోజుల క్రితమే విడుదలయ్యారు. అనంతరం తిరిగి ఈ సంఘటనతో ఆలెం కృష్ణ తన ఉనికిని చాటుకున్నాడు. ఆలెం కృష్ణ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.