నక్సలైట్లమని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారినుంచి కారు, ఎయిర్ పిస్టల్, ప్రజా ప్రతిఘటన పార్టీ పేరిట ఉన్న లెటర్ హెడ్‌లు, మూడు సెల్‌ఫోన్లు, 5 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ శుక్రవారం వెల్లడించారు.
వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం బొడ్లూరు గ్రామానికి చెందిన రేపాక శ్రీరాములు (ప్రసాద్) అదే జిల్లా రాయపర్తికి చెందిన పొనుగంటి వెంకటేశ్వరరావు సీపీఐ (ఎంఎల్) ప్రజాప్రతిఘటన పార్టీ, చండ్ర పుల్లారెడ్డి వర్గానికి చెందిన నక్సలైట్లమని చెప్పుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. వారిద్దరూ ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ సోదరుడు ఆలపాటి వజ్ర అంబికా ప్రసాద్ను బెదిరించి రూ.18 లక్షలు వసూలు చేశారు. ఇటీవల మరో రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రసాద్ ఈ నెల 2న ఏలూరు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులిద్దరూ శుక్రవారం ఏలూరు మండలం చొదిమెళ్ల గ్రామంలో ఉండగా పట్టుకున్నారు.
నిందితులది ఘన చరిత్రే..
అరె స్టైన నిందితులు రేపాక శ్రీరాములు (ప్రసాద్), పొనుగంటి వెంకటేశ్వరరావుది ఆదినుంచీ నేర చరిత్రే అని ఎస్పీ భాస్కర్‌భూషణ్ తెలిపారు. తోడు దొంగలైన ఇదరూ 2000వ సంవత్సరం నుంచి నక్సలైట్లమని ప్రజలను బెదిరిస్తూ నేరాలకు పాల్పడ్డారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని వ్యాపారులు, రియల్టర్‌లను బెదిరించి దాదాపు రూ.30 లక్షలు వసూలు చేసినట్టు విచారణలో తేలిందన్నారు. వీరిద్దరూ ఇప్పటికే 13 కేసుల్లో అరెస్టయి న్యాయస్థానాల్లో విచారణ ఎదుర్కొన్నారని వివరించారు.