ఇంఫాల్: కల్లోల మణిపూర్‌లో పరిస్థితి మళ్లీ అదుపు తప్పుతోంది. జాతుల ఘర్షణతో గతేడాది అట్టుడికిపోయిన ఆ రాష్ట్రంలో మరోసారి హింస పెచ్చరిల్లుతోంది. ఈ క్రమంలో జిరిబామ్‌లో సోమవారం కుకీ ఉగ్రవాదులు మైతీ వర్గానికి ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన విషయం విదితమే.
కిడ్నాప్‌కు గురైన ఆరుగురి మృతదేహాలను పోలీసులు తాజాగా గుర్తించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. బందీలుగా చేసిన అయిదు రోజులకు మృతదేహాలను గుర్తించిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం సిల్చార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
ముందుగా శుక్రవారం సాయంత్రం అస్సాం-మణిపూర్ సరిహద్దులోని జిరి నదిలో తేలుతూ ముగ్గురు మహిళల మృతుదేహాలు లభ్యమవ్వగా.. నేడు మరో ముగ్గురి మృతదేహాలు దొరికాయి. మృతదేహాలు కొంత కుళ్లిపోవడంతో ఉబ్బిపోయాయని, అందరూ మైతీ వర్గానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు.
కాగా జిరిబామ్ జిల్లాలోని బోకోబెరాలో కుకీ ఉగ్రవాదులు సోమవారం (నవంబర్ 11న) భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. బోకోబెరా పోలీస్ స్టేషన్, దానికి దగ్గరలోని సిఆర్‌పిఎఫ్ పోస్ట్‌పై సాయుధ కుకీలు హింసాత్మక దాడికి పాల్పడ్డారు. ఈ ఎన్‌కౌంటర్‌లో అనుమానిత కుకీ ఉగ్రవాదుల్లో పది మందిని పోలీసులు కాల్చిచంపారు. ఆ దాడి తర్వాత ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కనిపించడం లేదు. వీరిని కుకీలు కిడ్నాప్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment