ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ సునీల్ పాల్ కిడ్నాప్‌కు గురయ్యాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కిడ్నాప్ అయిన కొద్ది గంటలకే అతడిని విడుదల చేయడంతో క్షేమంగా ఇంటికి చేరుకున్నాడని అతడి భార్య తెలిపింది. ఈ విషయంలో పోలీసులను కూడా సంప్రదించినట్లు పేర్కొంది.
నిజంగానే కిడ్నాప్..
అయితే ఇది పబ్లిసిటీ స్టంట్ అయి ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై కమెడియన్ సునీల్ పాల్ స్పందించాడు. ఇది ప్రాంకో, పబ్లిసిటీ స్టంటో కాదని, తనను నిజంగానే కిడ్నాప్ చేశారని స్పష్టం చేశాడు. తాజా ఇంటర్వ్యూలో సునీల్ పాల్ మాట్లాడుతూ.. అమిత్ అనే వ్యక్తి హరిద్వార్‌లో బర్త్‌డే పార్టీలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపాడు. ఇందుకోసం కాస్త అడ్వాన్స్ కూడా పంపాడు. దీంతో డిసెంబర్ 2న ఢిల్లీకి వెళ్లాను. బర్త్‌డే పార్టీకి వెళ్తుండగా మార్గమధ్యలో స్నాక్స్ తిందామని ఆగారు.
రూ.20 లక్షలు డిమాండ్
సరిగ్గా అప్పుడే నా అభిమాని అంటూ ఓ వ్యక్తి వచ్చి మాట్లాడుతూ ఓ కారులోకి తోశాడు. బలవంతంగా నన్ను కారులో తీసుకెళ్లారు. కళ్లకు గంతలు కట్టి ఓ బంగ్లాకు తీసుకెళ్లారు. అక్కడ నన్ను చాలారకాలుగా భయపెట్టారు. రూ.20 లక్షలు కావాలని డబ్బు డిమాండ్ చేశారు, నా ఫోన్ కూడా లాక్కున్నారు. నా దగ్గర ఏటీఎమ్ కార్డు లేదని చెప్పడంతో వారు బేరాలు మొదలుపెట్టారు. నా ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసుకోవచ్చని చెప్పారు.
ఖర్చుల కోసం రూ.20 వేలిచ్చారు
అలా రూ.7.5 లక్షలు సమకూర్చాను. దీంతో వాళ్లు మరుసటి రోజు విమాన ప్రయాణ ఖర్చుల కోసం రూ.20 వేలు చేతిలో పెట్టి ఇంటికి పంపించారు. ఈ సంఘటన గురించి ఎవరితోనూ చెప్పకూడదనుకున్నాను. కానీ నా భార్య అప్పటికే పోలీసులను సంప్రదించడంతో నేనూ నోరు విప్పాను. కానీ ఆ కిడ్నాపర్లు నా వ్యక్తిగత విషయాలన్నీ తెలుసుకున్నారు.
వణికిపోయా..
నా పిల్లలు ఏ స్కూల్‌లో చదువుతారు? నా తల్లి ఎక్కడ నివసిస్తుంది? ఇలా ప్రతీది అడిగారు. నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలనేది భయంగా ఉంది. ఈ సంఘటనతో నేను వణికిపోయాను. పబ్లిసిటీ కోసం ఇదంతా చేశానంటున్నారు... అదే నిజమైతే మధ్యలో పోలీసులను ఎందుకు లాగుతాను. పైగా నా స్నేహితుల దగ్గర డబ్బు పంపినట్లు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా నేను ఇంకా బతికే ఉన్నందుకు సంతోషం అని సునీల్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment