జ్యోతి మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
పెరవలి : తెల్లవారుజామునే గుడికి వెళ్లిన ఓ యువతి కాలువలో కాళ్లు కడుగుదామని దిగి ప్రమాదవశాత్తూ పడిపోయి మృతి చెందింది. ఈ ఘటన ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో చోటుచేసుకుంది. పెరవలి ఎస్సై పి.నాగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గురువారం ఉదయం పెరవలి మండలం కాకరపర్రు వద్ద కాలువలో యువతి మృతదేహం తేలింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు హడలిపోయారు. వెంటనే పెరవలి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని తణుకు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు.
వారు హుటాహుటిన చేరుకుని కాలువలోని యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఆ యువతి ఎవరనేది తెలియక పోవడంతో పోలీసులు కాలువ పరీవాహక ప్రాంతంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. చివరికి మధ్యాహ్నానికి మృతురాలి వివరాలు తెలిశాయి.
ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి చెందిన గారపాటి శ్రీ వెంకట జ్యోతి (18)గా ఆమెను గుర్తించారు. తెల్లవారుజామునే గుడికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిందని, కాలువలో కాళ్లు కడుక్కునేందుకు దిగి కాలు జారి మునిగిపోయినట్టు తెలిసింది.
మృతదేహం కాకరపర్రు లాకుల వరకు కొట్టుకొచ్చింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్ తప్పుతాననే భయంతోనే?
మృతురాలు శ్రీ వెంకట జ్యోతి ఇంటర్ చదువుతోంది. ఆమె తల్లి చనిపోవడంతో వేలివెన్నులోని అమ్మమ్మ, తాతయ్య దగ్గర ఉంటూ చదువుకుంటోంది. తండ్రి వరప్రసాద్ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇంటర్ పరీక్ష ఫలితాలు గురువారం విడుదల కావడంతో పరీక్ష ఫెయిల్ అవుతాననే భయంతో ఆమె కావాలనే కాలువలో పడినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే పరీక్షా ఫలితాల్లో ఆమె ఇంటర్ పాస్ అవడం గమనార్హం. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment