ఖమ్మం: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి ప్రధాన అనుచరుడు, వ్యక్తిగత సహాయకుడు నాగార్జున సాగర్ కాలువలో గల్లంతయ్యారు. ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. గజ ఈతగాడిగా పేరుపొందిన అతడు గల్లంతవడం షాకింగ్‌గా ఉంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గత ఈతగాళ్లను రప్పించి అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే అతడికి గుండెపోటు రావడంతో కాలువలో గల్లంతై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరికి ప్రధాన అనుచరుడిగా రవి గుర్తింపు పొందాడు. దీంతోపాటు ఆమెకు వ్యక్తిగత సహాయకుడి (పీఏ) గా పని చేస్తున్నాడు. ఖమ్మం నగరంలోని సాగర్ కాలువలో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడు కాలువలో గల్లంతైనట్టు తెలుస్తోంది. అయితే దాదాపు 11 కిలోమీటర్లు నిర్విరామంగా రవి ఈత కొడతాడని స్థానికులు చెబుతున్నారు. సాగర్ కాలువలోకి ఈతకు వెళ్లిన అనంతరం రవికి గుండెపోటు వచ్చి ఉంటుందని సమాచారం. ఆ సమయంలో అతడు కాలువలో గల్లంతై ఉంటాడని భావిస్తున్నారు. సమాచారం తెలియడంతో పోలీసులు రవి కోసం సాగర్ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా రవి ఆచూకీ లభించలేదు. కాలువ సమీపంలో రవికి చెందిన బుల్లెట్ వాహనం, చెప్పులు, బ్యాగ్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment